Skip to content
తెలంగాణ వార్తలు

వాట్సాప్ గ్రూప్ నుంచి తీసేశారని పోలీస్ కేసు పెట్టిన మహిళ..ఎలా పరిష్కరించాలో తెలియక తలలు పట్టుకుంటున్న పోలీసులు

Prajapaksham 27 Jun 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
వాట్సాప్ గ్రూప్ నుంచి తీసేశారని పోలీస్ కేసు పెట్టిన మహిళ..ఎలా పరిష్కరించాలో తెలియక తలలు పట్టుకుంటున్న పోలీసులు

Hyderabad Woman Approaches Police After Being Removed from WhatsApp Group

సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో పోలీసులకు ఎలాంటి వింత సవాళ్లు ఎదురవుతున్నాయో చెప్పడానికి హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటనే ఒక చక్కటి ఉదాహరణ. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఆసక్తికరమైన కథనంలోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 పరిధిలోని ఎన్‌బీటీ నగర్ బస్తీ నివాసితుల కోసం స్థానిక సమస్యలపై చర్చించుకునేందుకు ఒక వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు.

పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైనేజీ వంటి కాలనీ సమస్యల పరిష్కారమే ఈ గ్రూప్ ముఖ్య ఉద్దేశం. అయితే, కొద్దిరోజులుగా కొందరు సభ్యులు బస్తీ సమస్యలను పక్కనపెట్టి రాజకీయ సందేశాలు, వీడియోలను విపరీతంగా పోస్ట్ చేయడం ప్రారంభించారు. దీంతో స్పందించిన గ్రూప్ అడ్మిన్.. ఇది కేవలం బస్తీ సమస్యల కోసమేనని, ఎలాంటి రాజకీయ పోస్టులు పెట్టవద్దని నిబంధనలు విధించారు. అయినప్పటికీ ఒక మహిళా సభ్యురాలు అడ్మిన్ హెచ్చరికలను లెక్కచేయకుండా వరుసగా రాజకీయ పోస్టులు పెడుతూనే ఉన్నారు. పలుమార్లు వారించినా ఆమె వైఖరి మార్చుకోకపోవడంతో విసిగిపోయిన అడ్మిన్, ఆమెను గ్రూప్ నుండి తొలగించారు.

గ్రూప్ నుంచి తొలగించడాన్ని తీవ్ర అవమానంగా భావించిన సదరు మహిళ.. తనను తిరిగి గ్రూప్‌లో చేర్చుకోవాలని అడ్మిన్‌ను కోరారు. అయితే, నియమాలను ఉల్లంఘించిన వారిని చేర్చుకునే ప్రసక్తే లేదని అడ్మిన్ నిరాకరించారు. దీంతో ఆగ్రహం చెందిన ఆమె, అడ్మిన్ తనను ఉద్దేశపూర్వకంగా గ్రూప్ నుండి తీసేసి మానసిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విచిత్రమైన ఫిర్యాదు చూసి పోలీసులు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

ఫిర్యాదు నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు గ్రూప్ అడ్మిన్‌ను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. జరిగిన ఉదంతం తెలుసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, అడ్మిన్ మాత్రం తన నిర్ణయానికే కట్టుబడ్డారు. గ్రూప్ నియమాలను పదేపదే ఉల్లంఘించినందువల్లే ఆమెను తొలగించానని, ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి గ్రూప్‌లో చేర్చుకునే ప్రసక్తే లేదని పోలీసుల ముందే స్పష్టం చేశారు. దీంతో సాధారణంగా గంభీరమైన నేరాలను దర్యాప్తు చేసే బంజారాహిల్స్ పోలీసులు, ఈ వాట్సాప్ గ్రూప్ గొడవను ఎలా పరిష్కరించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *