Skip to content
తెలంగాణ వార్తలు

ఏకపక్షంగా క్యాన్సిల్ చేయడం చెల్లదు.. ల్యాండ్ రిజిస్ట్రేషన్ల రద్దుపై హైకోర్టు కీలక తీర్పు..

Prajapaksham 23 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
ఏకపక్షంగా క్యాన్సిల్ చేయడం చెల్లదు.. ల్యాండ్ రిజిస్ట్రేషన్ల రద్దుపై హైకోర్టు కీలక తీర్పు..

Unilateral cancellation of registration is invalid: Telangana High Court

భూముల రిజిస్ట్రేషన్లు ,లేఔట్ క్రమబద్ధీకరణకు (LRS) సంబంధించి తెలంగాణ హైకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. ఒక నిర్దిష్ట స్థలానికి సంబంధించి ఒకసారి జరిగిన రిజిస్ట్రేషన్‌ను (విక్రయ పత్రం/సేల్‌డీడ్‌) అధికారులు ఏకపక్షంగా రద్దు చేయడం ఎంతమాత్రం చెల్లదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఏదైనా రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాల్సి వస్తే చట్టప్రకారం ఇరుపక్షాలకు ముందస్తుగా నోటీసులు జారీ చేయాలని, వారి పూర్తి సమ్మతి ఉన్నప్పుడు లేదా సముచితమైన సివిల్ కోర్టు ఉత్తర్వులను జత చేసినప్పుడు మాత్రమే రద్దు ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనితో పాటు, నివాస లేఔట్‌లలో ప్రజల ఉపయోగం కోసం లేదా పబ్లిక్ అవసరాల కోసం ప్రత్యేకంగా కేటాయించిన రోడ్లు, పార్కులు, ఓపెన్ స్థలాల వంటి వాటికి ప్రభుత్వ క్రమబద్ధీకరణ పథకం (LRS) ఎట్టి పరిస్థితుల్లోనూ వర్తించదని హైకోర్టు గట్టిగా స్పష్టం చేసింది.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేట పరిధిలోని సర్వే నంబర్ 27/ఎ,ఎలో గల 287 చదరపు గజాల స్థలానికి సంబంధించిన వివాదంలో హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. సదరు స్థలానికి సంబంధించి కూకట్‌పల్లికి చెందిన కె.కమలమ్మ పెట్టుకున్న ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు తిరస్కరించారు. అంతేకాకుండా, ఆ స్థలానికి ఉన్న పాత రిజిస్ట్రేషన్‌ను కూడా అధికారులు రద్దు చేశారు. ఈ రెండు చర్యలను సవాలు చేస్తూ కమలమ్మ హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్‌లు దాఖలు చేయగా, దీనిపై జస్టిస్‌ అలిశెట్టి లక్ష్మీనారాయణ సమగ్ర విచారణ చేపట్టారు.

ఈ విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, తన క్లయింట్ 2014లోనే ఈ 287 చదరపు గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ ద్వారా చట్టబద్ధంగా కొనుగోలు చేశారని కోర్టుకు తెలిపారు. అక్కడ రెండు తాత్కాలిక గదులను నిర్మించి విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్ను కూడా క్రమంగా చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. అయితే రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ పొరుగువారు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు మేరకు అధికారులు వాటిని కూల్చివేశారని వాదించారు. వాస్తవానికి డ్రాఫ్ట్ లేఔట్‌లో ఆ ప్రాంతంలో రోడ్డు ఉన్నట్లు చూపించినప్పటికీ, ఆ తర్వాత ఆ డ్రాఫ్ట్ లేఔట్ రద్దయిందని, ఈ వాస్తవాలేవీ పరిశీలించకుండా జీహెచ్‌ఎంసీ అధికారులు ఏకపక్షంగా ఎల్‌ఆర్‌ఎస్‌ను తిరస్కరించి, రిజిస్ట్రేషన్‌ను కూడా రద్దు చేశారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు.

మరోవైపు జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది ఈ వాదనలను గట్టిగా తోసిపుచ్చారు. అసలైన డ్రాఫ్ట్ లేఔట్ నిబంధనల ప్రకారం సదరు స్థలంలో రోడ్డు ఉందని, దానికి సంబంధించిన గిఫ్ట్ డీడ్ (బహుమతి పత్రం) కూడా మున్సిపాలిటీ పేరిట నమోదై ఉందని కోర్టుకు వివరించారు. ప్రజల కోసం, రోడ్డు నిర్మాణం కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ వ్యక్తుల పేరిట క్రమబద్ధీకరించడం కుదరదని స్పష్టం చేశారు. ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ ఈ కేసులో కీలక చట్టపరమైన అంశాలను వెల్లడించారు. లేఔట్ నిబంధనల ప్రకారం రోడ్లను, బహిరంగ స్థలాలను ఒకసారి గిఫ్ట్ డీడ్ ద్వారా మున్సిపాలిటీకి లేదా స్థానిక సంస్థలకు అప్పగించిన తర్వాత, అవి చట్టబద్ధంగా రద్దు కానంతవరకు ఆ స్థలాలపై డెవలపర్‌కు గానీ, ఇతరులకు గానీ ఎలాంటి హక్కులు ఉండవని స్పష్టం చేశారు. ప్రజోపయోగ అవసరాల కోసం కేటాయించిన స్థలాల క్రమబద్ధీకరణకు ఎల్‌ఆర్‌ఎస్ ఉత్తర్వులు వర్తించవని తేల్చి చెప్పారు.

ఈ నేపథ్యంలో రోడ్డు స్థలంలో ఉన్న ప్లాట్‌కు సంబంధించిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తును జీహెచ్‌ఎంసీ తిరస్కరించడం పూర్తిగా సబబేనంటూ పిటిషనర్ దాఖలు చేసిన ఒక పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టివేశారు. అయితే, అదే సమయంలో రిజిస్ట్రేషన్‌ను అధికారులు ఏకపక్షంగా రద్దు చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ కమలమ్మకు ఊరటనిచ్చారు. చట్టప్రకారం నోటీసులు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేయడం కుదరదని, అధికారులు కావాలనుకుంటే ఇప్పుడు చట్ట ప్రకారం సరైన పద్ధతిలో చర్యలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. ఈ వివాదం పూర్తిగా తేలేవరకు సదరు స్థలంలో మరిన్ని తదుపరి రిజిస్ట్రేషన్లు లేదా లావాదేవీలు జరగకుండా నిరోధించేందుకు, ఆ భూమిని నిషేధిత ఆస్తుల జాబితాలో (Prohibited Property List) చేర్చాలంటూ జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ హైకోర్టు తన తుది తీర్పును ముగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *