Skip to content
క్రైమ్ వార్తలు

ముస్సోరిలో తెలుగు టెకీ అనుమానాస్పద మృతి.. భర్తతో మద్యం సేవించిన తరువాత ఘటన.. ఎన్నో అనుమానాలు..

Prajapaksham 17 Jun 2026 1 నిమిషాల పఠనం క్రైమ్
ముస్సోరిలో తెలుగు టెకీ అనుమానాస్పద మృతి.. భర్తతో మద్యం సేవించిన తరువాత ఘటన.. ఎన్నో అనుమానాలు..

Lok Sabha Director Death: రూ.70 లక్షల అప్పు.. లోక్‌సభ సచివాలయ డైరెక్టర్ గౌరవ్ గౌతమ్ మృతి.. 15 సూసైడ్ నోట్..

ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మసూరీ-ధనోల్టి రహదారిపై ఉన్న ఒక హోమ్‌స్టేలో 27 ఏళ్ల ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపుతోంది. గురుగ్రామ్‌లోని ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలో పనిచేస్తున్న సదరు మహిళ మృతదేహం బస చేసిన గదిలో లభ్యమైందని పోలీసులు మంగళవారం వెల్లడించారు.

ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతురాలిని ఢిల్లీలోని కిద్వాయ్ నగర్ ఈస్ట్‌లో నివసిస్తున్న పి. రాధా గాయత్రిగా పోలీసులు గుర్తించారు. ఆమె భర్త సౌమ్య శ్రీచరణ్ పుణెలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వీరిద్దరి సొంత ఊరు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం కాగా, వీరికి 2025 నవంబర్ 8న వివాహం జరిగింది.

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఈ జంట జూన్ 13న ఢిల్లీ నుంచి రిషికేశ్‌కు చేరుకుంది. ఆ తర్వాత ఆదివారం (జూన్ 14) రాత్రి సుమారు 11:30 గంటల ప్రాంతంలో మసూరీ-ధనోల్టి రహదారి, టిప్రిధర్‌లోని ‘కియానా హోమ్‌స్టే’కు వచ్చి, అక్కడి ‘బ్లిస్’ అనే గదిలో బస చేశారు. సోమవారం ఉదయం హోమ్‌స్టేలోని ఒక మహిళ స్పృహ కోల్పోయి పడి ఉందనే సమాచారం ముస్సోరీ పోలీసులకు అందింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అంబులెన్స్‌ను రప్పించగా, అంబులెన్స్ సిబ్బందిలోని ఒక ఫార్మసిస్ట్ ఆమెను పరీక్షించి అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు.

ఘటనపై భర్త శ్రీచరణ్ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో.. తామిద్దరూ ఆదివారం రాత్రి మద్యం సేవించి తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో నిద్రపోయామని తెలిపాడు. అయితే ఉదయం నిద్రలేచి చూసేసరికి తన భార్య మూత్రపు మడుగులో స్పృహ లేకుండా పడి ఉందని, ఆమె ముక్కు నుండి రక్తం కారుతోందని పేర్కొన్నాడు.

పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించినప్పుడు గదిలో అనుమానాస్పద పరిస్థితులు కనిపించాయి. మృతురాలి శరీరం నేలపై బట్టలు లేకుండా పడి ఉందని, దుప్పటిపై రక్తపు మరకలు ఉన్నాయని పోలీసులు తమ ప్రకటనలో తెలిపారు. అలాగే గదిలో రెండు ఖాళీ మద్యం సీసాలు, ఆహార పదార్థాలు లభించాయి.

ప్రస్తుతం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం డెహ్రాడూన్‌లోని కరోనేషన్ ఆసుపత్రికి తరలించారు. ఈ శవపరీక్షను వైద్యుల బృందం చేత, పూర్తి వీడియో కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించాలని పోలీసులు ఆసుపత్రి వర్గాలను కోరారు. గాయత్రి మరణవార్తను విశాఖపట్నంలో ఉన్న ఆమె తల్లిదండ్రులకు చేరవేశామని, వారు మంగళవారం రాత్రికి ఇక్కడికి చేరుకుంటారని సర్కిల్ ఆఫీసర్ మనోజ్ అస్వాల్ తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఈ మరణానికి గల అసలు కారణాలు స్పష్టమవుతాయని అధికారులు పేర్కొన్నారు.