Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సింగపూర్ ప్రధాని‌తో సీఎం చంద్రబాబు భేటీ.. పెట్టుబడులు, అభివృద్ధిపై చర్చ

Prajapaksham 15 Jun 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
సింగపూర్ ప్రధాని‌తో సీఎం చంద్రబాబు భేటీ.. పెట్టుబడులు, అభివృద్ధిపై చర్చ

Andhra Pradesh CM Chandrababu Meets Singapore Prime Minister for Development Talks

ఆంధ్రప్రదేశ్ CM నారా చంద్రబాబు నాయుడు తన సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్‌తో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ,ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యంపై లోతైన చర్చలు జరిగాయి. ముఖ్యంగా సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి రంగాల్లో సహకారం అందించాలని చంద్రబాబు కోరారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు మద్దతు ఇవ్వడంతో పాటు, సెమీకండక్టర్ తయారీకి అవసరమైన ఎకో సిస్టమ్ అభివృద్ధి ,సామర్థ్య పెంపులో (Capacity Building) తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలోని పట్టణాలు ,నగరాల రూపురేఖలను మార్చేందుకు వీలుగా ‘అర్బన్ గవర్నెన్స్’ (పట్టణ పరిపాలన)లో సింగపూర్ అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను ఏపీలోనూ అమలు చేసేలా సహకారం కావాలని సీఎం కోరారు. వ్యవసాయ రంగం గురించి ప్రస్తావిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి సేద్యం ద్వారా పండిస్తున్న పంటల గురించి లారెన్స్ వాంగ్‌కు వివరించారు. ఏపీ నుంచి నాణ్యమైన ఉద్యానవన ,ఆక్వా ఉత్పత్తులను దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ప్రకృతి సేద్యం ద్వారా పండించే పంటలకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా సర్టిఫికేషన్ ,ట్రేసబిలిటీ (ఉత్పత్తి మూలాలను గుర్తించడం) సాధించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా పోర్టులు ,విమానాశ్రయాల అభివృద్ధిలో ఏపీ, సింగపూర్ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై సింగపూర్ ప్రధాని ప్రత్యేకంగా ఆరా తీసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతంలో అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో సింగపూర్ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో, మళ్లీ ఆ ప్రాజెక్టును వేగవంతం చేయడంలో తాజా చర్చలు కీలక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సాంకేతికత ,ఆర్థిక రంగాల్లో అభివృద్ధి చెందిన సింగపూర్ సహకారం ఏపీ పారిశ్రామిక వృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఈ భేటీ ద్వారా స్పష్టమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *