Skip to content
తెలంగాణ వార్తలు

హైకోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యం.. HYDRAA కమిషనర్‌కు రూ.50 వేల జరిమానా..కేసు ఏంటంటే..

Prajapaksham 13 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
హైకోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యం.. HYDRAA కమిషనర్‌కు రూ.50 వేల జరిమానా..కేసు ఏంటంటే..

Telangana HC Imposes Rs 50,000 Fine on HYDRAA Commissioner in Land Case

హైదరాబాద్‌లోని ఒక భూవివాదంలో కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేసినందుకు గాను ‘హైడ్రా’ (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో గట్టి చుక్కెదురైంది. కోర్టు ధిక్కరణ చర్యల కింద ఆయనకు రూ.50 వేల భారీ జరిమానా విధిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ కేసు వివరాల్లోకి వెళితే… ఖైరతాబాద్ మండలం, యూసఫ్‌గూడ (వెంగళరావు నగర్) గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 45లో ఉన్న రెండు ఎకరాల భూమిపై దివంగత ఫర్హతుల్లా వారసుడైన మహ్మద్ షఫాహతుల్లా గతంలో హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 2008 నుండి తామే ఈ భూమిని ఆధీనంలో ఉంచుకున్నామని పిటిషనర్ తెలిపారు. దీనిపై విచారించిన హైకోర్టు, సదరు భూమి విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని, యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని గతంలో ‘హైడ్రా’ , జీహెచ్‌ఎంసీలను ఆదేశించింది. అయితే, న్యాయస్థానం ఇచ్చిన ఈ స్పష్టమైన ఆదేశాలను ఉల్లంఘిస్తూ, ఈ ఏడాది మార్చి నెలలో హైడ్రా అధికారులు పోలీసులతో కలిసి వచ్చి అక్కడ ఉన్న ప్రహరీ గోడను కూల్చివేసి, కంచె వేసి, అది హౌసింగ్ బోర్డ్‌కు చెందిన స్థలమంటూ బోర్డులు పెట్టారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలని, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని గత ఏప్రిల్ నెలలోనే హైకోర్టు చివరి అవకాశం (కండిషనల్ ఆర్డర్) ఇచ్చింది. అయినప్పటికీ హైడ్రా కమిషనర్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడం, గడువు ముగిసినా కౌంటర్ దాఖలు చేయకపోవడంపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఇచ్చిన ‘స్టేటస్ కో’ ఆదేశాలను ఉల్లంఘించడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ కమిషనర్‌కు రూ.50 వేల జరిమానా విధించారు. ఈ జరిమానా మొత్తాన్ని హైకోర్టు ‘చీఫ్ జస్టిస్ రిలీఫ్ ఫండ్’కు చెల్లించాలని స్పష్టం చేశారు. ఈ పెనాల్టీ సొమ్మును పూర్తిగా చెల్లించిన రసీదును చూపించిన తర్వాతే, ఈ భూవివాదం కేసులో హైడ్రా సమర్పించే కౌంటర్ అఫిడవిట్‌ను స్వీకరించాలని హైకోర్టు రిజిస్ట్రీకి గట్టి ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *