Skip to content
తెలంగాణ › వార్తలు

TGPCB: పిసిబిలో కోల్డ్‌వార్? ఇద్దరూ ఇద్దరే..

jagan 09 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
TGPCB: పిసిబిలో కోల్డ్‌వార్? ఇద్దరూ ఇద్దరే..

TGPCB

TGPCB: గాడిన పడుతుంది అని ఆశాభావం వ్యక్తమవుతున్న సమయంలోనే టీజీపిసిబిలో ఆందోళన మొదలయ్యింది. సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు బాధ్యుల మధ్యన నెలకొన్న కోల్డ్‌వార్ ఎక్కడికి దారి తీస్తుంది? అనే ఉత్కంఠకు తెరలేచింది. ఉన్నత స్థాయి పదవి భర్తీ కావడంతో అక్కడే ఉన్న ఓ ఉన్నతాధికారికి అసహనం మొదలయ్యిందని.. అనేక ప్రభుత్వ పెద్దలకు మొరపెట్టుకుంటే ఏకంగా ఆయనకు పిసిబికి ఇంచార్జి పదవి అప్పగించి పూర్తి స్థాయిలో మరో శాఖను అప్పగించడంతో పిసిబిలో ఏం జరుగుతుంది? అనేది అంతుచిక్కడం లేదు. విశేష అనుభవం ఉన్న వ్యక్తి సంస్థకు అధినేతగా వస్తే సదరు ఉన్నతాధికారి నూనతా భావం పెంచుకోవడం ఏమిటి? అనేది ఇప్పుడు బ్యూరోక్రాట్లలో సైతం చర్చకు ఆస్కారం కలిగిస్తున్నది. ఇటీవల నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం పీసీబీ నిర్ణయాలు, ఫైళ్ల ఆమోదం, అధికారాల పంపకం తదితర విషయంలో సమన్వయ లోపం పెరగనుందనే ఆందోళన నెలకొంది. తూతూమంత్రంగా మారిన పిసిబిని గాడిలో పెట్టేందుకు నూతన చైర్మన్ చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉండగానే… అధికారి చక్రం తిప్పి అక్కడి నుంచి తప్పుకునేందుకు యత్నించడం చూస్తుంటే.. వారికి కేవలం అధికారం కావాలా? అనే ప్రశ్నలకు తావిస్తున్నది.

ఓ నివేదికలో ఒకే సీనియర్ అధికారికి మూడు కీలక బాధ్యతలు అప్పగించడంపై గతంలో విమర్శలు వచ్చాయి. వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ల సమాచారాన్ని సేకరించడంలో వివిధ విభాగాలు, యూనిట్లు, ల్యాబొరేటరీల నుంచి సమాచారం రావడంలో ఆలస్యం జరిగిందని విమర్శలున్నాయి. కొన్ని పరిశ్రమలు పర్యావరణ అనుమతుల నిబంధనలు పాటించలేదని గుర్తించి, పిసిబి పర్యావరణ పరిహారం లెక్కించి చర్యలు తీసుకోవాలని ఆదేశించినా పూర్తి స్థాయిలో అమలు కాలేదనే విమర్శలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. పిసిబి పనితీరుపై వచ్చిన విమర్శల్లో సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపాలు, కొన్ని పరిశ్రమలతో అధికారుల కుమ్మక్కు ఆరోపణాలు కూడా ప్రస్తావిస్తున్నారు. ఏండ్లు గడుస్తున్నా అధికారి వీటిపై ఇప్పటి వరకు ఏం చేశారు? అనేది కూడా చర్చకు వస్తున్నది. బాధ్యతల విభజన, సిబ్బంది కొరత, వివిధ విభాగాల మధ్య సమాచార మార్పిడి ఆలస్యం వంటి సమస్యలు ఉన్నాయి. ఏదేమైనా ఎల్‌నినో వంటి విపత్కర పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో పిసిబి పాత్ర కీలకంగా మారిందని చెప్పవచ్చు.