Skip to content
తెలంగాణ › వార్తలు

Telangana Politics: కాంగ్రెస్‌ ప్రభుత్వంలో భగ్గుమన్న అంతర్గత విభేదాలు.. రేడియల్ రోడ్ టెండర్లపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు

jagan 12 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Telangana Politics: కాంగ్రెస్‌ ప్రభుత్వంలో భగ్గుమన్న అంతర్గత విభేదాలు.. రేడియల్ రోడ్ టెండర్లపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు

Komati Reddy Rajagopal Reddy

Telangana Politics: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL) ఆధ్వర్యంలో చేపట్టిన రూ.3,296 కోట్ల రేడియల్ రోడ్-2 నిర్మాణ టెండర్ల ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

తమ సొంత ప్రభుత్వంలోనే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మూడు ప్యాకేజీలకు గానూ ఇతర సంస్థల కన్నా రూ.600 కోట్లు తక్కువకు తమ కంపెనీ బిడ్లు దాఖలు చేసినప్పటికీ, ఉద్దేశపూర్వకంగా నిబంధనలు పెట్టి తమను పక్కనపెట్టారని ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఉండే శాఖలోనే ఈ దోపిడీ జరగడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. టెండర్లలో పాల్గొనవద్దని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తనకు ఫోన్లు వచ్చాయని, అయినప్పటికీ తాము పోటీలో నిలిచామని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.

ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళతానని ఆయన స్పష్టం చేశారు. తమ కంపెనీని అనర్హులుగా ప్రకటించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఈ అంశంపై న్యాయపరంగా సుప్రీంకోర్టు వరకు పోరాడతామని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలనే ఇది గుర్తు చేస్తోందని ఆయన విమర్శించారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని, స్వయంగా రేవంత్ రెడ్డి చేసినా తాను వ్యతిరేకిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇలాంటి అక్రమాలు జరుగుతుంటే ఢిల్లీలో పార్టీ నిర్వహించే నిరసనల్లో తాను ఎలా పాల్గొంటానని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటూ ఇటువంటి అవినీతిపై తన పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.