Skip to content
తెలంగాణ › వార్తలు

Telanagana Paddy Cultivation: పైరుపైనే… పంట బేరం..! వరిసాగు తగ్గడంతో… సరికొత్త వ్యాపారానికి తెర

Krishna Rao 11 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Telanagana Paddy Cultivation: పైరుపైనే… పంట బేరం..! వరిసాగు తగ్గడంతో… సరికొత్త వ్యాపారానికి తెర

Telanagana Paddy Cultivation

Telanagana Paddy Cultivation: సన్న ధాన్యం పంట సాగు చేసిన రైతుల వద్దకు క్యూ.. క్వింటా ధర రూ.3,500 – 3,800

Telanagana Paddy Cultivation: ఎల్‌నినో ప్రభావంతో ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలో వరిసాగు 40 శాతానికి తగ్గిపోయింది. దీనితో మిల్లర్లు పంట చేనుపై ఉండగానే సరికొత్త వ్యాపారానికి తెర లేపారు. సన్న ధాన్యం పంట సాగు చేసిన రైతుల వద్దకు వారు క్యూ కడుతున్నారు. పంట చేతికి అందేందుకు నెల నుంచి రెండు నెలల సమయం పట్టే అవకాశాలు ఉన్నా.. నూర్పిడి కాగానే ధాన్యం తమకే అమ్మాలంటూ ముందస్తు బేరసారాలు కుదుర్చుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం ఇస్తున్న ధరకు మించి ఇస్తామంటూ చెబుతుండడంతో సన్న ధాన్యం క్వింటాకు రూ.3,500 నుంచి రూ.3,800 వరకు ధర పలుకుతుంది. ఇలా రైతుల నుంచి ఒప్పందం చేసుకున్న మిల్లర్లు రూ.50 వేల నుంచి లక్షల్లో అడ్వాన్సులు ఇస్తున్న పరిస్థితి.

ఈ వానాకాలం సీజన్‌లో రైతులు జిల్లా వ్యాప్తంగా 4,94,500 ఎకరాల్లో వరి సాగు చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. కానీ ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక నీటి ఎద్దడితో 40 శాతం మేరకు సాగు తగ్గింది. నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, మూసీ ఆయకట్టు పరిధిలోని రైతులు సాగునీరు వస్తుందనే ఆశతో పంట సాగు చేయగా, వారాబందీ పద్ధతిలో నీటిని విడుదల చేయడం, అవి సరిపోకపోవడంతో పంటను కాపాడుకునేందుకు చేతిలో చిల్లిగవ్వ లేకున్నా మరీ అప్పు చేసి రైతులు బావులు, బోర్లు తవ్వించారు. మిగతా మెట్ట ప్రాంత రైతులు కూడా బావులు, బోర్లపై ఆధారపడి పంట సాగు చేస్తున్నారు. భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతుండడంతో ఒకపక్క నీరు లేక, మరోపక్క విద్యుత్ కోతలతో వరిపైర్లు 10 శాతానికి పైగా ఎండిపోయిన పరిస్థితి. దీనితో మొత్తం పంట సాగు 50 శాతానికి పడిపోయినట్లు అయింది. ప్రభుత్వం సన్న ధాన్యం పండించిన రైతులకు కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరతోపాటు క్వింటాకు అదనంగా రూ.500 వరకు బోనస్ చెల్లిస్తుండడంతో రైతులు 70 శాతానికి మించి సన్న ధాన్యం పంటనే సాగు చేశారు.

వరిసాగు సగానికి సగం తగ్గడంతో మిల్లర్లు సరికొత్త వ్యాపారానికి తెర లేపారు. ప్రస్తుతం మార్కెట్‌లో పచ్చి ధాన్యానికే సన్నరకంలో చింట్లు క్వింటాకు రూ.3,500 నుంచి రూ.3,800 వరకు ధర పలుకుతుండగా, సాంబమసూరి క్వింటా ధర రూ.3,500 నుంచి రూ.3,600 వరకు ఉంది. దీనిని మిల్లర్లు రైతుల నుంచి పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి కొనుగోలు కేంద్రాల్లో క్వింటాకు రూ.2,461 ధర చెల్లించడంతో పాటు, అదనంగా మరో రూ.500 ఇస్తుంది. ఇలా చూసుకుంటే క్వింటాకు రూ.2,961లకు మించి రైతులకు రావడం లేదు. వర్షాభావ పరిస్థితుల్లో పంట సాగు తగ్గడంతో మిల్లర్లు సరికొత్త వ్యాపారానికి తెర లేపారు.

పంట చేతికి అందకముందే రైతుల వద్దకు క్యూ కడుతున్నారు. మిర్యాలగూడ, కోదాడ, హుజూర్‌నగర్ ప్రాంతాలకు చెందిన మిల్లర్లు ఊరూరూ తిరుగుతూ సన్నరకం పంటను సాగు చేస్తున్న రైతుల వివరాలు సేకరిస్తున్నారు. రైతులు ఎన్ని ఎకరాలు సాగు చేశారు… ఎంత పంట దిగుబడి వస్తుంది అంచనా వేస్తున్నారు. అనంతరం రైతులతో బేరసారాలకు దిగి క్వింటాకు రూ.600 నుంచి రూ.1,000 వరకు అదనంగా చెల్లిస్తామంటూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. పనిలో పనిగా ఎకరాకు రూ.10 వేల వరకు అడ్వాన్సుగా రైతులకు ముట్టజెప్పుతున్నారు. ప్రభుత్వం కూడా రైతులు తడిపంటలు సాగుచేసి నష్టపోవద్దని, కేవలం ఆరుతడి పంటలనే సాగు చేయాలని చెబుతూ వస్తుంది. దీనిని మిల్లర్లు ముందుగానే పసిగట్టి అధిక ధరలకు ధాన్యాన్ని సేకరించే పనిలో పడ్డారు. కొనుగోలు చేసిన ధాన్యంతో లాభాలు అధికంగా గడించవచ్చనే ఆశతో ఇదంతా చేస్తున్నారు.

ట్యాగ్‌లు: Telangana