సింగరేణిలో INTUC నాయకుడు శంకర్ రావు అక్రమ దందా…కార్మికుల కన్నీటితో కోళ్లు సంపాదిస్తున్న నేత…
సింగరేణిలో INTUC నాయకుడు శంకర్ రావు అక్రమ దందా…కార్మికుల కన్నీటితో కోళ్లు సంపాదిస్తున్న నేత…
నల్లబంగారు నేలలో కార్మికులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. రాత్రింబవళ్లు భూమి పొరల్లో ప్రాణాలను పణంగా పెట్టి, స్వేదం చిందించి రాష్ట్రానికి వెలుగులు పంచే కార్మికుల కష్టార్జితం కొందరి వ్యక్తిగత స్వార్థానికి కామధేనువుగా మారుతోంది. బదిలీల కోసమో, అనారోగ్యంతో ఉన్న తండ్రి స్థానంలో కొడుకుకు కారుణ్య నియామకం తెచ్చుకోవడం కోసమో, మెడికల్ అన్‌ఫిట్ చేయించుకోవడం కోసమో కార్మికుడు పడే తపనను, వారి బలహీనతను ఆసరాగా చేసుకుని కొన్ని శక్తులు కోట్ల రూపాయల ‘సెట్టింగ్’ దందాకు తెరలేపాయి.
ప్రస్తుతం సింగరేణిలో ఉద్యోగం చేస్తూ ఐఎన్టీయూసీ నాయకుడిగా చెలామణి అవుతున్న జెట్టి శంకర్రావు సాగించిన ఈ రాబందుల దందా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. సంఘం నేతగా చెలామణి అవుతూ “పని అయిపోతుంది” అనే ఒక్క మాటతో శంకర్రావు పదుల సంఖ్యలో ఉన్న అమాయక కార్మికుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. 2021 నుంచి విడతల వారీగా బదిలీలు, కారుణ్య నియామకాల పేరిట డబ్బులు దండుకున్నట్లు వెల్లడైంది. ఎస్ఆర్పీ-3 గనికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడికి కారుణ్య నియామకం ఇప్పిస్తానని నమ్మించి ఏకంగా రూ.20 లక్షలు గుంజడం ఈ దందా తీవ్రతకు అద్దం పడుతోంది. పని చేయకపోగా, డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విశ్రాంత ఇంజనీర్ పెరుమాండ్ల రాజు వద్ద నుంచి రూ.10 లక్షలు దండుకోగా, సూరపనేని కృష్ణ (రూ.1,50,000), ప్రవీణ్ (రూ.1,50,000), పెండ్రి సతీష్ రెడ్డి (రూ.1,00,000), రమేశ్ (రూ.1,00,000), వేరు సదానందం (రూ.1,00,000), ప్రభాకర్ (రూ.90,000), మహేందర్ రెడ్డి (రూ.50,000), శంకర్ (రూ.50,000), అరుణ్ (రూ.50,000), కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డ్ రాజేష్ (రూ.10,000) నుంచి కూడా వసూళ్లకు తెగబడ్డాడు.
ఆర్థిక అక్రమాలు, ఐపీ… మళ్లీ పదవులా?
శంకర్రావుకు గతంలోనూ ఇటువంటి ఆర్థిక అక్రమాలకు పాల్పడిన చరిత్ర ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో శ్రీరాంపూర్ ప్రాంతంలో పలువురి వద్ద డబ్బులు వసూలు చేసి, కేసులు కావడం, దాడికి దిగడంతో పరారై ఐపీ (ఇన్సాల్వెన్సీ పిటిషన్) పెట్టిన దాఖలాలు ఉన్నాయని కార్మిక వర్గాలు గుర్తుచేస్తున్నాయి. కొన్నాళ్ల పాటు పరారీలో ఉండి, ఆ తర్వాత మళ్లీ సింగరేణిలో విధుల్లో చేరిన ఆయనకు సంఘంలో తిరిగి బాధ్యతలు అప్పగించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
కొంతమంది కార్మికులు శంకర్రావు వద్దకు వెళ్తే బదిలీలు చేయిస్తానని, మెడికల్ అన్‌ఫిట్ చేయిస్తానని, కారుణ్య నియామకాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నాడని ఆరోపిస్తున్నారు. సింగరేణిలో బదిలీలు, మెడికల్ అన్ఫిట్లు, కారుణ్య నియామకాల పేరిట 2021 నుంచి పెద్దఎత్తున నగదు వసూలు చేస్తున్నాడని పలువురు గని కార్మికులు ఆరోపిస్తున్నారు.
తిరగబడిన బాధితులు… ఆధారాలతో నిలదీత
ఏళ్లు గడుస్తున్నా పనులు కాకపోవడం, ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితులు నస్పూర్ ప్రెస్ క్లబ్ వద్ద శంకర్రావును నిలదీశారు. బాధితుల ఆగ్రహంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శంకర్రావు సంతకాలు చేసి ఇచ్చిన ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, బాధిత కార్మికులు పోలీసు స్టేషన్లలో ఇచ్చిన ఫిర్యాదుల ప్రతులు ఈ అక్రమ వసూళ్లకు తిరుగులేని ఆధారాలుగా బయటపడ్డాయి.
సార్వత్రిక, గుర్తింపు సంఘం ఎన్నికలపై తీవ్ర ప్రభావం!
కార్మికుల హక్కుల కోసం పోరాడాల్సిన సంఘాలు కొందరి చేతుల్లో వ్యక్తిగత దందాలకు వేదికలుగా మారడంపై కార్మిక లోకం నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటువంటి వివాదాస్పద శక్తుల వల్ల రానున్న సార్వత్రిక ఎన్నికలతో పాటు గుర్తింపు సంఘం ఎన్నికల్లోనూ యూనియన్‌కు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యేలు తక్షణమే కల్పించుకుని ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఎన్నికల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ దందాపై పోలీసులు, సింగరేణి యాజమాన్యం సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కార్మిక లోకం డిమాండ్ చేస్తోంది.