Hyderabad Metro-RTC Common Pass: హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బస్సు, మెట్రోకు ఒకే పాస్.. ధరలు ఇవ
Hyderabad Metro-RTC Common Pass
Hyderabad Metro-RTC Common Pass: హైదరాబాద్ నగరవాసులకు ప్రజా రవాణా విషయంలో కీలక సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇకపై నగర ఆర్టీసీ బస్సులు, హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు ఒకే పాస్‌ను ఉపయోగించుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC), హైదరాబాద్ మెట్రో రైల్ కలిసి కామన్ ట్రావెల్ పాస్‌ను అక్టోబర్ 2 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చాయి. ప్రజాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ సదుపాయాన్ని ప్రారంభించారు. దీంతో ప్రతిరోజూ బస్సు నుంచి మెట్రోకు, మెట్రో నుంచి బస్సుకు మారే ప్రయాణికులకు ప్రత్యేకంగా రెండు టికెట్లు తీసుకోవాల్సిన అవసరం తగ్గనుంది.
కొత్త కామన్ పాస్‌ను హైదరాబాద్‌లోని అన్ని మెట్రో స్టేషన్లలో పొందే అవకాశం ఉంది. ఈ పాస్‌తో ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలో నడిచే ఆర్టీసీ సిటీ బస్సులతో పాటు మెట్రో రైళ్లలో ప్రయాణించవచ్చు. అయితే పుష్పక్ బస్సులకు ఈ కామన్ పాస్ వర్తించదు. నగరంలో బస్సులు, మెట్రో రెండింటినీ కలిపి ఉపయోగించే ప్రయాణికులకు ఈ విధానం ముఖ్యంగా ఉపయోగపడనుంది.
కామన్ పాస్‌లో ప్రస్తుతం రెండు రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. రోజువారీ కామన్ పాస్ ధర రూ.400గా నిర్ణయించారు. ఇందులో మెట్రో వాటా రూ.300 కాగా, ఆర్టీసీ వాటా రూ.100. నెలవారీ కామన్ పాస్ ధర రూ.8,500. ఇందులో మెట్రోకు రూ.7,000, ఆర్టీసీకి రూ.1,500 చొప్పున కేటాయిస్తారు. కామన్ పాస్‌ను తొలిసారి కొనుగోలు చేసే సమయంలో కార్డుకు అదనంగా రూ.100 చెల్లించాలి. ఇది రీఫండబుల్ డిపాజిట్. కార్డును తిరిగి అప్పగించినప్పుడు ఆ రూ.100ను తిరిగి చెల్లిస్తారు.
‘మీ టికెట్’ యాప్‌తో బస్సు టికెట్ ఫోన్లోనే
కామన్ పాస్‌తో పాటు TGSRTC ‘మీ టికెట్’ మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా నగర బస్సుల్లో కాగితపు టికెట్ అవసరం లేకుండా మొబైల్లోనే టికెట్ కొనుగోలు చేయవచ్చు. ప్రయాణికులు యాప్‌లో ఎక్కే ప్రాంతం, గమ్యస్థానం, టికెట్ వివరాలను ఎంపిక చేసి డిజిటల్ పేమెంట్ చేయాలి. చెల్లింపు పూర్తయిన తర్వాత డైనమిక్ QR కోడ్‌తో కూడిన డిజిటల్ టికెట్ మొబైల్లో జనరేట్ అవుతుంది. ప్రయాణ సమయంలో ఆ QR టికెట్‌ను కండక్టర్‌కు చూపిస్తే సరిపోతుంది.
దీంతో నగర బస్సుల్లో చిల్లర సమస్య, కాగితపు టికెట్ల అవసరం, టికెట్ కొనుగోలు కోసం అదనపు సమయం వంటి ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. డిజిటల్ విధానంలో టికెట్లు, పాస్‌లు పొందేందుకు ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది.
రూ.600కే డిజిటల్ వీక్లీ బస్ పాస్
‘మీ టికెట్’ యాప్‌లో డిజిటల్ వీక్లీ బస్ పాస్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ పాస్ ధర రూ.600. ఒకసారి పాస్ తీసుకుంటే ఏడు రోజుల పాటు అర్హత ఉన్న ఆర్టీసీ సిటీ బస్సుల్లో అపరిమితంగా ప్రయాణించవచ్చు. బస్‌పాస్ కౌంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా యాప్‌లోనే పాస్ కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. గడువు ముగిసిన తర్వాత కూడా యాప్ ద్వారానే పాస్‌ను రెన్యూవల్ చేసుకోవచ్చు.
అంతేకాకుండా ‘మీ టికెట్’ యాప్ ద్వారా ఇతర డిజిటల్ టికెటింగ్, బస్ పాస్ సేవలను కూడా పొందే అవకాశం కల్పించారు. దీంతో నగర ప్రజా రవాణా వ్యవస్థలో టికెటింగ్ ప్రక్రియను మరింత డిజిటల్‌గా మార్చే దిశగా ఆర్టీసీ అడుగులు వేస్తోంది.
హైదరాబాద్‌లో బస్సు, మెట్రో రెండింటినీ ఉపయోగించే ప్రయాణికులకు కామన్ పాస్ ద్వారా ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడమే ఈ వ్యవస్థ లక్ష్యం. ముఖ్యంగా రోజువారీగా మెట్రో స్టేషన్‌కు బస్సులో చేరుకుని, అక్కడి నుంచి మెట్రోలో గమ్యస్థానానికి వెళ్లే ప్రయాణికులకు ఒకే పాస్‌తో రెండు రవాణా వ్యవస్థలను ఉపయోగించుకునే అవకాశం లభించింది.
- Voter List Update 2026: ఓటర్ల జాబితాపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో SSR.. జనవరి 4న తుది జాబితా విడుదల!
- El Niño Alert: సూపర్ ఎల్ నినో ముప్పు.. రానున్న 10 నెలలు అత్యంత కీలకం.. సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక
- Parliament Special Session: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం సన్నాహాలు.. డీలిమిటేషన్, మహిళా కోటా బిల్లులే అజెండా..
- Weather Alert: గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వానలు కురుస్తాయని ఐఎండీ ప్రకటన
- డబ్బుల కోసం నటించాలనుకోను.. ‘క్రేజీ కల్యాణం‘ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్