CM Revanth Reddy: సీఎం గారూ..! కేసీఆర్పై ఆరోపణలు సరే…వేల ఎకరాల గుట్టు నిజంగానే రట్టు అవుతుందా..? 22A పరిష్కారం ఏంటి..
CM Revanth Reddy: ప్రజా సమస్యల పరిష్కారాన్ని పక్కనబెట్టి నాయకులు భూ ఆక్రమణల లెక్కలపై ఘర్షణ పడటం వల్ల సామాన్యులకు తక్షణ లబ్ధి చేకూరదు. ప్రభుత్వం ఇచ్చిన 30 రోజుల గడువులోగా రెవెన్యూ రికార్డుల ద్వారా ఈ ఆరోపణలను న్యాయబద్ధంగా నిరూపిస్తేనే క్రిమినల్ కేసులు నిలిచే అవకాశం ఉంటుంది.
CM Revanth Reddy: తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ లక్ష్యంగా తీవ్రమైన భూ ఆక్రమణ ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబం వారి సంబంధీకుల వద్ద తొమ్మిది జిల్లాల్లో కలిపి మొత్తం 439 ఎకరాల భూమి ఉన్నట్లు లెక్కలతో సహా వెల్లడించారు. ముఖ్యంగా ఎర్రవెల్లి ఫార్మ్హౌస్ పరిధిలోనే 388 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్, పేదల భూములు ఉన్నాయని ఆరోపించారు. కేసీఆర్ నియంత్రణలో మొత్తం 700 ఎకరాల వరకు భూములు ఉన్నాయని, గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన భూ ఆక్రమణల విలువ సుమారు లక్ష కోట్ల రూపాయల వరకు ఉంటుందని సభలో పేర్కొన్నారు.
ఈ భూ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక విచారణ ట్రిబ్యునల్ (SET)ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. విచారణను 30 రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశిత సమయంలోగా నివేదిక సమర్పించకపోతే సంబంధిత రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విచారణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామిలకు బాధ్యతలు అప్పగించారు.
అసెంబ్లీ బయట హరీష్ రావు ప్రతిదాడి:
సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు బహిష్కరణకు గురికావడంతో, సభ బయట మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబంపైనే తిరుగు ఆరోపణలు చేస్తూ, రేవంత్ కుటుంబం 308 ఎకరాల భూమిని ఆక్రమించిందని ఆరోపించారు. వీటిలో 175 ఎకరాలకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, కొండారెడ్డిపల్లిలోనూ 77 నుంచి 79 ఎకరాల భూమి ఉందనే సమాచారం ఉందని పేర్కొన్నారు. ఈ ఆరోపణల నిజానిజాలు తేలేందుకు సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని హరీష్ రావు సవాల్ విసిరారు.
రాజకీయ ఆరోపణలు వర్సెస్ ప్రజల సమస్యలు:
ఇరుపక్షాల మధ్య నడుస్తున్న ఈ భూ వివాదాలు కేవలం రాజకీయ ఆరోపణలుగా మిగిలిపోకుండా, రికార్డులతో కూడిన ఆధారాలతో నిజాలు బయటకు రావడం ప్రజాస్వామ్యానికి అవసరం. అయితే, ఈ పరస్పర విమర్శల మధ్య అసెంబ్లీలో చర్చకు రాకుండా పోయిన ప్రధాన సమస్య ’22A’ నిషేధిత భూముల జాబితా. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. సామాన్య ప్రజలు తమ సొంత భూములను అమ్ముకోలేక, కొనుగోలు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారాన్ని పక్కనబెట్టి నాయకులు భూ ఆక్రమణల లెక్కలపై ఘర్షణ పడటం వల్ల సామాన్యులకు తక్షణ లబ్ధి చేకూరదు. ప్రభుత్వం ఇచ్చిన 30 రోజుల గడువులోగా రెవెన్యూ రికార్డుల ద్వారా ఈ ఆరోపణలను న్యాయబద్ధంగా నిరూపిస్తేనే క్రిమినల్ కేసులు నిలిచే అవకాశం ఉంటుంది. రాజకీయ నాటకీయతను పక్కనపెట్టి, ఉభయ పక్షాలు చూపించిన ఈ లెక్కల్లోని నిజా నిజాలను తేల్చడంతో పాటు 22A సమస్యకు శాశ్వత పరిస్కారం చూపాలని ప్రజలు కోరుకుంటున్నారు.