విద్యా వ్యవస్థపై ఆర్‌ఎస్‌ఎస్ ఉడుంపట్టు
RSS tightens its grip on the education system.
చీకటిని పారద్రోలి విద్య జ్ఞానాన్ని ఆవిష్కరిస్తుందనే విషయం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు తెలియంది కాదు. అందుకే ఆర్‌ఎస్‌ఎస్ ఛీఫ్ జెన్ జీతో సమావేశం అయ్యేందుకు ముందే, దాని అజెండా ఏమిటో వారికి ముందే తెలుసు. సమాజా న్ని తప్పుదోవ పట్టించేందుకు, వారికి అనుకూలురైన చరిత్రకారులచే వాస్తవాలను వక్రీకరించడం ఒక్కటే వారికి చెల్లుతుంది. ప్రాచీన నాగరిక విలువల ముసుగులో హిందుత్వ ఆధారంగా రూపొందించబడిన విద్యారంగ విధానంలోనే అడ్డూ అదుపు లేకుండా కార్పొరేటీకరణ చేయటం అంతర్లీనంగా ఇమిడి ఉండటంతో, అది వినాశకరంగా నిరూపితమైంది. ఇది విద్య ప్రాధాన్యతా స్థానాన్ని అంతం చేయడానికి దారితీసింది. ప్రజలకు విద్యను అందించడం ఎల్లప్పుడూ ఏ ప్రభుత్వానికైనా ప్రధాన బాధ్యతగా పరిగణించబడేది, కానీ ఇప్పుడు ఆ బాధ్యతను నీతిమాలిన ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు.
ప్రాథమిక పాఠశాలల నుండి విశ్వవిద్యాలయాల వరకు అన్ని విద్యా, పరిశోధనా సంస్థలు తమకు నచ్చిన వ్యక్తుల ఆధ్వర్యంలో నడిపిస్తున్నారనేది నేడు అందరికీ తెలిసిన విషయమే. నియామకాలు ఎంపిక విధానంలో జరుగుతాయి. వాటికి ఆర్‌ఎస్‌ఎస్ ద్వారా ఎంపిక చేయబడతాయి. కేవలం అనుబంధ సంస్థల సభ్యులు మాత్రమే అర్హత పొందుతారు. పాఠశాల ఉపాధ్యాయుల నుండి వైస్ ఛాన్సలర్ల వరకు, విద్యా, పరిశోధనా సంస్థల డైరెక్టర్ల నుంచిడి స్వయంప్రతిపత్తి సంస్థల అధిపతుల వరకు మితవాద శక్తులు బరితెగించి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. ఈ నియామకాలు, మితవాద శక్తుల ప్రత్యక్ష అండతో అధ్యయనాలు, పరిశోధనల పునర్వ్యవస్థీకరణకు దారితీసి, మొత్తం విద్యా వ్యవస్థను కలుషితం చేస్తున్నాయి.
మరో అంశం, మితవాద సిద్ధాంతాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలను సవరించడం. ఎన్‌సిఇఆర్‌టి, సిబిఎస్‌ఇ లేదా వివిధ రాష్ట్ర బోర్డు ల వంటి సంస్థలు ఈ పనిని చేపట్టాయి. వాస్తవాలను వక్రీకరించి, వాటి నిష్పాక్షికతను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరిగాయి. శాస్త్రీయ దృక్పథాన్ని పరిరక్షించడంలో నిష్పాక్షికత ఒక ముఖ్యమైన అంశం. మధ్యయుగం, అలాగే మొఘల్ యుగం, స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన అంశాలను పూర్తిగా తొలగించారు. ఆర్‌ఎస్‌ఎస్ లేదా ఇతర హిందుత్వ ప్రముఖులకు చరిత్రలో చోటు కల్పించేందుకు ముస్లిం వ్యతిరేక ఆర్‌ఎస్‌ఎస్ వైఖరికి అనుగుణంగా బరితెగించి ఉన్నత విద్య సిలబస్‌లో కోతలు విధించారు. చరిత్రలో వారి ప్రతికూల, విధ్వంసకర పాత్ర ఉన్నప్పటికీ, వక్రీకరణ విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడానికి ప్రయత్నాలు జరిగాయి. వాస్తవానికి, ఇప్పుడు పాఠ్యప్రణాళికపై నిశిత పర్యవేక్షణ ఉంది. హిందుత్వ జాతీయవాదానికి ఇబ్బంది కలిగించే దేన్నీ అనుమతించరు. కుల, లింగ భేదాలు, సమాజంలోని సంఘర్షణలు, వైరుధ్యాలు, సమాజంలోని వివిధ రకాల విభజనల వాస్తవాలను అణచివేస్తున్నారు. వామపక్షవాదులుగా లేదా జాతీయవాదులు కానివారిగా ఆర్‌ఎస్‌ఎస్ భావించే రచయితలను, మేధావులను తొలగిస్తున్నారు.
అయితే, ఆర్‌ఎస్‌ఎస్ విద్యా వ్యవస్థను ఆర్థికంగా ఎలా తన ఆధీనంలోకి తీసుకుందో అనే విషయం ఇంకా ప్రజల దృష్టికి రాలేదు. ఇది అనేక రూపాల్లో ఉంటుంది వర్క్‌షాప్‌లు, సెమినార్లకు నిధులు సమకూర్చడం నుంచి ఆర్‌ఎస్‌ఎస్ ప్రేరేపిత సంస్థలు ప్రచురించే నిర్దేశిత పుస్తకాలలోని వక్రీకరణలకు ఆజ్యం పోసే అనువైన సబ్జెక్టులను చదవడానికి స్కాలర్షిప్‌లు ఇవ్వడం వరకు ఇది విస్తరించి ఉంది. సంఘ్ పరివార్ దృష్టిలో, ఈ చర్యకు రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఇది ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థలకు డబ్బును మళ్ళిస్తుంది, వారి విషపూరిత భావజాల వ్యాప్తిని సులభతరం చేస్తుంది.
ఈ అంశాలన్నీ దాదాపు అన్ని విద్యాసంస్థలపై నియంత్రణ సాధించడానికి ఆర్‌ఎస్‌ఎస్‌కు దోహదపడ్డాయి. ఆర్‌ఎస్‌ఎస్ నియంత్రణలో ఉన్న సంస్థలలో, విద్యార్థులకు ప్రశ్నలు అడిగే స్వేచ్ఛ, తమ ఆలోచనల ను వ్యక్తపరిచే స్వేచ్ఛ, తమ ఆసక్తులను అనుసరించి, తాము చేయాలనుకున్నది చేసే స్వేచ్ఛ ఉండదు. సొంతంగా ఆలోచించే స్వేచ్ఛ లేదా ప్రశ్న లు అడిగే స్వేచ్ఛ కేవలం విద్యార్థికి తెలుసుకునే హక్కును గౌరవించినప్పుడే సాధ్యమవుతుందని అర్థం చేసుకోవాలి. విద్యార్థులకు అన్ని వనరు ల నుండి సమాచారం, జ్ఞానాన్ని పొందే హక్కు ఉండాలి. వారిని విభిన్న జ్ఞాన వనరులకు పరిచయం చేయడం విద్యాసంస్థలు, ఉపాధ్యాయుల కర్తవ్యం. ఆ హక్కు నేడు ప్రమాదంలో ఉంది.
నెమ్మదిగా, మన విద్యాసంస్థలు ఆర్‌ఎస్‌ఎస్ నడుపుతున్న సరస్వతీ శిశు మందిరాల ప్రతిరూపాలుగా మారుతున్నాయి. ఆ శిశు మందిరాల బోధనా పద్ధతులు, పాఠ్యప్రణాళిక, దినచర్యపై జరిపిన అధ్యయనాలు, యువత మనసులను హిందుత్వ భావజాలంలోకి ఎలా మారుస్తున్నా యో చూపిస్తున్నాయి. యువత యొక్క సాంస్కృతిక, రాజకీయ కల్పనలను తీర్చిదిద్దడానికి విద్యను ఒక ముఖ్యమైన సాధనంగా ఆర్‌ఎస్‌ఎస్ చాలాకాలంగా పరిగణిస్తోంది. దాని పాఠశాలలపై జరిపిన అధ్యయనా లు, హిందూయేతరులను శత్రువులుగా చూపించే విధంగా చరిత్రను, సామాజిక గుర్తింపును ఎలా బోధించవచ్చో నమోదు చేశాయి.
విద్యా వ్యవస్థపై ఆర్‌ఎస్‌ఎస్ తెచ్చిపెట్టిన విధ్వంసం నుండి భాగవత్ తప్పించుకోలేరు. అంతేకాకుండా, జెన్- జీ సభ్యులతో తన సంభాషణల సందర్భంగా వారిని(జెన్ జీని) దేశద్రోహులుగా ముద్ర వేయకూడదని పేర్కొంటూ భగవత్ తనను తాను మితవాద స్వరంగా ప్రదర్శించుకున్నప్పటికీ, నీట్ వివాదంపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల సమయంలో, ప్రముఖ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త అతుల్ లిమాయే, ఎంపిలు నిశికాంత్ దుబే, కంగనా రనౌత్ వంటి బిజిపి నాయకులతో సహా ఆయన సహచరులలో చాలామంది, నిరసన చేస్తున్న యువతపై బహిరంగంగా తీవ్రమైన
ఆరోపణలు చేశారు.
ఈ వైరుధ్యాన్ని విస్మరించడం అసాధ్యం. ఈ ఆరోపణలు జెన్ జీ లోని కొందరు సభ్యులతో భాగవత్ జరిపిన సంభాషణను ఒక పకడ్బందీ రాజకీయ వ్యూహంగా స్పష్టం చేస్తున్నాయి. –ఒక స్వరం వ్యవస్థ ప్రతిష్టను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుండగా, మరో స్వరం అసమ్మతిని భయపెడుతూ, విభజిస్తూ, అప్రతిష్టపాలు చేస్తూనే ఉంది. ఆర్‌ఎస్‌ఎస్ ఈ ‘ద్వంద్వ ప్రమాణాల’ వైఖరితో భారత యువతను తప్పుదోవ పట్టించలేము.
జెన్ జీ తరం సంభాషణకు, గౌరవానికి, నమ్మకానికి అర్హులని భాగవత్ నిజంగా విశ్వసిస్తే, ఆయన కొంత నైతిక స్థిరత్వాన్ని ప్రదర్శించాలి. భాగవత్ దృష్టిలో, దాని అర్థం కేవలం యువ భారతీయుల ఉద్దేశాలను, దేశభక్తిని పదేపదే ప్రశ్నించిన ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నాయకులను బహిరంగంగా వ్యతిరేకించడం మాత్రమే కాదు. మన యువతరం పట్ల సంఘ్ పరివార్ నాయకుల నోటి నుండి అలాంటి అసభ్య భాష ఎందుకు వస్తుందో ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి ఆత్మపరిశీలన చేసుకోవడం కూడా దాని అర్థం. అంతేకాకుండా, ఈ సంక్షోభానికి ఆర్‌ఎస్‌ఎస్ అనేది పరిష్కారం కాదని, అదే అసలు కారణమని భాగవత్ అంగీకరించాలి. ఈ సంక్షోభం పరిష్కారం కావాలంటే, విద్యా వ్యవస్థను ఆర్‌ఎస్‌ఎస్ పట్టు నుండి విడిపించడం అత్యవసరం. యువ భారతీయులు నాణ్యమైన విద్య, పారదర్శకమైన పరీక్షలు, ఉపాధి అవకాశాలు, పాలనలో జవాబుదారీతనం కోరుతున్నారు. ఈ ప్రశ్నకు భాగవత్ వద్ద గానీ, ఆర్‌ఎస్‌ఎస్ వద్ద గానీ, బిజెపి ప్రభుత్వం వద్ద గానీ ఎలాంటి సమాధానం లేదు.