Rahul Gandhi: మోదీజీ.. మీ ప్రభుత్వంలోని 200 మంది అధికారులు మాతో టచ్‌లో ఉన్నారు.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..
Rahul Gandhi: సీఈసీ తక్షణమే రాజీనామా చేయాలి..అప్రూవర్‌గా మారాలి : రాహుల్‌గాంధీ
Rahul Gandhi: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జ్ఞానేశ్ కుమార్ స్వయంగా తనకు సందేశాలు పంపిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. “జ్ఞానేశ్ కుమార్ గారూ.. మీరు చేసిన తప్పును అంగీకరించి అప్రూవర్‌గా మారండి. ఈ మొత్తం వ్యవహారంలో మీరు ప్రధాన నేరస్థుడు కాదు, మీ వెనుక అసలు సూత్రధారులు ఉన్నారని వ్యాఖ్యానించారు. భారత ప్రధాన న్యాయమూర్తిని కలవడానికి ముందు, సోమవారం సుప్రీంకోర్టు వైపు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి చేపట్టిన భారీ మార్చ్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
మీడియా సమావేశంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, సీఈసీ తనను సంప్రదించి సందేశాలు పంపిన మాట నిజమేనని రాహుల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న ప్రెస్ మీట్‌ను కూడా సీఈసీ ప్రత్యక్షంగా చూస్తున్నారని పేర్కొన్నారు. అయితే, ఆ సందేశాల్లోని అంతర్గత వివరాలను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. సీఈసీకి ప్రభుత్వం పూర్తిగా రక్షణ కవచంలా నిలుస్తోందని, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్, , పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీల తీవ్ర ఒత్తిడితోనే జ్ఞానేశ్ కుమార్ పనిచేస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల నిర్వహణలో పారదర్శకత దెబ్బతింటోందని, ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఇండియా కూటమి నేతలు సుప్రీంకోర్టు వైపు నిరసన ప్రదర్శన చేపట్టారు. సీఈసీని తక్షణమే పదవి నుంచి తొలగించి, ఎన్నికల వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వంలోని ఈడీ, సీబీఐ , విదేశాంగ శాఖలకు చెందిన సుమారు 200 మంది అధికారులు ప్రతిపక్ష నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ కీలక సమాచారాన్ని అందిస్తున్నారని రాహుల్ వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి తాను ఇప్పటికే భారత ప్రధాన న్యాయమూర్తికి (CJI) లేఖ రాశానని, అధికారికంగా పిటిషన్ దాఖలు చేయాలని సీజేఐ సూచించినట్లు రాహుల్ తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడే ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించే వరకు తమ ఆందోళనలు ఆగవని, ఆ తర్వాత ప్రధాని మోదీ, అమిత్ షాల తప్పులను ఎండగడుతూ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని రాహుల్ గాంధీ హెచ్చరించారు.