Skip to content
జాతీయం వార్తలు

Jantar Mantar Protest: యూనిఫామ్ లేదు, నేమ్‌ప్లేట్ లేదు… విద్యార్థులపై దాడి చేసింది పోలీసులా? ఆర్ఎస్ఎస్ మూకలా?

Prajapaksham 22 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Jantar Mantar Protest: యూనిఫామ్ లేదు, నేమ్‌ప్లేట్ లేదు… విద్యార్థులపై దాడి చేసింది పోలీసులా? ఆర్ఎస్ఎస్ మూకలా?

Jantar Mantar Protest: యూనిఫామ్ లేదు, నేమ్‌ప్లేట్ లేదు... విద్యార్థులపై దాడి చేసింది పోలీసులా? ఆర్ఎస్ఎస్ మూకలా?

ఢిల్లీలో విద్యార్థుల ఆందోళన సందర్భంగా జరిగిన లాఠీచార్జ్ వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. విద్యా సంబంధిత సమస్యలు, పరీక్షల్లో అక్రమాలపై శాంతియుతంగా నిరసన తెలుపుతూ పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చిన విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా బలప్రయోగం చేశారు. అయితే, పోలీసులతో పాటు కొందరు ప్రైవేటు వ్యక్తులు కూడా చేతుల్లో లాఠీలు పట్టుకుని తమపై దారుణంగా దాడి చేశారని విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నాయి.

పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీచార్జ్ చేస్తున్న సమయంలో, వారి పక్కనే సివిల్ దుస్తుల్లో ఉన్న కొందరు వ్యక్తులు విద్యార్థులను వేటాడి మరీ కొడుతున్న దృశ్యాలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆందోళనను అణచివేసే సమయంలో పలువురు పోలీసులు కనీసం తమ నేమ్‌ప్లేట్లు కూడా ధరించలేదని, అసలు పోలీసు వ్యవస్థకే సంబంధం లేని ప్రైవేటు వ్యక్తులు బాన్సర్లలాగా వచ్చి దాడి చేస్తున్నా పోలీసులు వారిని అడ్డుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ లాఠీచార్జ్ వెనుక పోలీసుల తోడ్పాటుతో పాటు ఆర్ఎస్ఎస్ (RSS) గుండాల హస్తం ఉందంటూ విద్యార్థి నేతలు బహిరంగంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ ఆందోళనను భగ్నం చేయడానికి, విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేయడానికే పోలీసు బలగాలతో పాటు సివిల్ దుస్తుల్లో ఉన్న ఆర్ఎస్ఎస్ శ్రేణులను మోహరించి దాడులకు తెగబడ్డారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

తాము రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే, పోలీసులు మరియు సివిల్ దుస్తుల్లో ఉన్న వ్యక్తులు ఉన్నట్టుండి లాఠీలతో విరుచుకుపడ్డారని తీవ్రంగా గాయపడిన విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా విద్యార్థులపై సైతం ప్రైవేటు వ్యక్తులు చెయ్యి చేసుకున్నారని, తీవ్రంగా గాయపడి రక్తం ఓడుతున్నా కనీస మానవత్వం చూపలేదని ఆందోళనకారులు ఆరోపించారు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులే ప్రైవేటు వ్యక్తులకు లాఠీలు ఇచ్చి తమపైకి రెచ్చగొట్టారా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.