Skip to content
జాతీయం వార్తలు

గ్లోబల్ వార్మింగ్‌కు తోడైన ఎల్ నినో.. 2027లో రికార్డు స్థాయి వేడితో ప్రపంచానికి పెను ముప్పు!

Prajapaksham 14 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
గ్లోబల్ వార్మింగ్‌కు తోడైన ఎల్ నినో.. 2027లో రికార్డు స్థాయి వేడితో ప్రపంచానికి పెను ముప్పు!

El Niño Explained: Why Global Temperatures Could Surge

ప్రకృతి తన గమనాన్ని మార్చుకుంటే మానవ మనుగడ ఎంతలా అతలాకుతలం అవుతుందో చెప్పడానికి తాజా అంతర్జాతీయ వాతావరణ హెచ్చరికలే నిదర్శనం అని చెప్పవచ్చు. ఇప్పటికే మానవ ప్రేరిత గ్లోబల్ వార్మింగ్‌తో అల్లాడిపోతున్న భూగోళాన్ని మరింత అగ్నిగుండంగా మార్చేందుకు ‘ఎల్ నినో’ అనే సహజ వాతావరణ పెను మార్పు దూసుకొస్తోంది. అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA), జపాన్ వాతావరణ సంస్థలతో పాటు ఐక్యరాజ్యసమితి శాస్త్రవేత్తలు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2026 మిగిలిన కాలమంతా క్రమంగా బలపడుతూ సాగబోయే ఈ ఎల్ నినో.. రాబోయే 2027 సంవత్సరాన్ని చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా మార్చబోతోందని శాస్త్రవేత్తలు గట్టిగా హెచ్చరిస్తున్నారు. దశాబ్దాలుగా పెరుగుతున్న భూతాపానికి ఈ తాజా పరిణామం తోడవడంతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణం, ఆహార సరఫరాలు, ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది.

అసలు పసిఫిక్ మహాసముద్రం, దాని పైన ఉండే వాతావరణంలో వచ్చే మార్పుల వల్లే ఈ ఎల్ నినో పుట్టుకొస్తుంది. సాధారణంగా ఈ సముద్రంలో గాలులు తూర్పు నుండి పడమర వైపు వీస్తుంటాయి. కానీ, ఈ గాలులు బలహీనపడినప్పుడు లేదా వ్యతిరేక దిశలో వీచినప్పుడు, సముద్రంలోని వెచ్చని నీరు మధ్య, తూర్పు ఉష్ణమండల పసిఫిక్ అంతటా విస్తరిస్తుంది. మధ్య ఉష్ణమండల పసిఫిక్‌లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సగటు కంటే 0.5°C పైగా పెరగడాన్ని, అలాగే పశ్చిమ పసిఫిక్‌తో పోలిస్తే మధ్య పసిఫిక్‌లో వాతావరణ పీడనం తగ్గడాన్ని గమనించిన తర్వాతే శాస్త్రవేత్తలు కొత్త ఎల్ నినో దశ ప్రారంభమైందని అధికారికంగా ప్రకటించారు.

1600ల కాలంలోనే పెరూ దేశపు జాలర్లు ఈ వింత మార్పును గమనించి, దీనికి స్పానిష్ భాషలో ‘క్రీస్తు శిశువు’ అని అర్ధం వచ్చేలా ‘ఎల్ నినో డి నవిదాద్’ అని ముద్దుపేరు పెట్టారు. అయితే ఇప్పుడు సముద్ర ఉపరితలం కిందే కాకుండా, లోపలి పొరల్లో కూడా నీరు అసాధారణంగా వేడెక్కడం శాస్త్రవేత్తలను మరింత భయపెడుతోంది. కొన్ని చోట్ల సముద్ర అంతర్భాగ ఉష్ణోగ్రతలు సగటు కంటే ఏకంగా 6 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది.

ఈ లోతైన సముద్రపు వేడి క్రమంగా ఉపరితలానికి రావడం వల్ల, మధ్య ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సుదీర్ఘ కాలం పాటు 2°C లేదా అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఇలా జరిగితే దానిని “చాలా బలమైన” లేదా “సూపర్” ఎల్ నినో అంటారు. 1950 తర్వాత ఇలాంటి తీవ్రమైన పరిస్థితులు కొన్ని సార్లు మాత్రమే రాగా, ప్రస్తుత ఎల్ నినో అంతటి మహా ముప్పుగా మారడానికి 63% అవకాశం ఉందని, ఇది కనీసం 2027 ప్రారంభం వరకు కొనసాగుతుందని NOAA స్పష్టం చేసింది.

ఈ బలమైన ఎల్ నినో ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణం తీవ్రంగా ప్రభావితం కానుంది. ఇది భూమిపైనా, సముద్రంలోనూ వడగాడ్పుల ప్రమాదాన్ని పెంచడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో కరువు రక్కసి కోరలు చాచేలా, మరికొన్ని ప్రాంతాల్లో అకాల భారీ వర్షాలు ముంచెత్తేలా చేస్తుందని ప్రపంచ వాతావరణ సంస్థ సెక్రటరీ జనరల్ సెలెస్ట్ సౌలో ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్ నినో సమయంలో సముద్రం తనలోని వేడిని గాలికి బదిలీ చేయడం వల్ల వాతావరణం మరింత వేడెక్కుతుంది.

దీనివల్ల దక్షిణ అమెరికా, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలలో తీవ్ర పొడి వాతావరణం ఏర్పడి, కరువులు, కార్చిచ్చులు సంభవించే ప్రమాదం ఉంది. ఇది భారత రుతుపవనాలను కూడా బలహీనపరుస్తుంది. అదే సమయంలో దక్షిణ అమెరికాలో భారీ వర్షాల వల్ల వరదల ముప్పు పెరుగుతుంది. ఈ ప్రక్రియ తూర్పు, మధ్య పసిఫిక్ ప్రాంతాలలో ఎక్కువ ఉష్ణమండల తుఫానులను తీసుకువస్తుంది కానీ అట్లాంటిక్ మహాసముద్ర పరిసరాల్లో తుఫానుల తాకిడిని తగ్గిస్తుంది. ఇక యూకే విషయానికి వస్తే.. అక్కడి శీతాకాలం మొదట్లో సాధారణంగా ఉండి, ముగిసే సమయానికి తీవ్రమైన చలితో ముగుస్తుంది.

ఈ వాతావరణ మార్పులు మానవ జీవితం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై వినాశకర ప్రభావం చూపనున్నాయి. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రపంచ దేశాలను హెచ్చరిస్తూ, ఈ ఎల్ నినో వేడెక్కుతున్న భూగోళానికి మరింత ఆజ్యం పోస్తుందని, దీని ప్రభావాలు వినాశకరమైన వేగంతో సరిహద్దులను దాటుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే అంతర్జాతీయ వివాదాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎరువుల సరఫరా దెబ్బతిన్న తరుణంలో, ఈ ఎల్ నినో కరువు తోడైతే దక్షిణ అమెరికా, ఆగ్నేయాసియాలలో పంటలు దెబ్బతిని తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుంది.

నిత్యావసరాల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు పెరుగుతాయి. అలాగే సముద్రాలు వేడెక్కడం వల్ల చల్లని, పోషకాలు ఉన్న నీరు పైకి రాదు కాబట్టి, ‘ఆంకోవీస్’ వంటి చేపలకు ఆహారం దొరకక అవి చనిపోతాయి. ఫలితంగా దక్షిణ అమెరికాలోని జాలర్ల కుటుంబాలు ఉపాధి కోల్పోతాయి. శాస్త్రవేత్తలు ప్రస్తుత పరిస్థితిని రికార్డు స్థాయి నష్టాన్ని మిగిల్చిన 2015-16 నాటి ఎల్ నినోతో పోలుస్తున్నారు, ఆ సమయంలో కరేబియన్ తీరంలో నీటి కొరత, ఆఫ్రికాలో కరువు వచ్చి లక్షలాది మంది ఆకలితో అలమటించారు.

ఐక్యరాజ్యసమితి వాతావరణ శాస్త్రవేత్తల సంస్థ (IPCC) నివేదికల ప్రకారం 1950 కంటే ముందుతో పోలిస్తే.. ఆ తర్వాత వచ్చిన ఎల్ నినోలు చాలా బలంగా ఉన్నాయి. అయితే, భూతాపం వల్లే ఎల్ నినో తీవ్రత పెరుగుతోందా అనేదానికి ఇంకా పూర్తిస్థాయి స్పష్టమైన ఆధారాలు లేవు. కొన్ని వాతావరణ నమూనాలు భూతాపం వల్ల ఇవి మరింత తరచుగా వస్తాయని సూచిస్తున్నప్పటికీ, శాస్త్రవేత్తల్లో దీనిపై ఇంకా ఏకాభిప్రాయం లేదు. కానీ, ఇప్పటికే ఉన్న వాతావరణ మార్పుల దుష్ప్రభావాలకు ఈ ఎల్ నినో తోడవ్వడం వల్ల విపత్తుల తీవ్రత రెట్టింపు అవుతుందనేది మాత్రం వాస్తవం.

దీనికి పూర్తి భిన్నంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చల్లగా మారే ‘లా నినా’ అనే సోదరి వాతావరణ నమూనా కూడా ఉంది. ఇది ఆస్ట్రేలియా, ఇండోనేషియా ప్రాంతాలకు భారీ వర్షాలను ఇస్తుంది. సాధారణంగా ప్రతి రెండు నుండి ఏడు సంవత్సరాలకు ఒకసారి ఇవి మారుతూ వస్తుంటాయి. ప్రస్తుతానికైతే ముంచుకొస్తున్న ఈ ‘సూపర్ ఎల్ నినో’ వినాశనాన్ని తట్టుకోవడానికి, ముందస్తు వ్యూహాలతో ప్రపంచ దేశాలన్నీ సిద్ధం కావాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *