Skip to content
జాతీయం › వార్తలు

ఢిల్లీలో శక్తివంతమైన రాజ్యం, పౌరుల మధ్య పోరాటం

Prajapaksham 16 Oct 2026 0 నిమిషాల పఠనం జాతీయం
ఢిల్లీలో శక్తివంతమైన రాజ్యం, పౌరుల మధ్య పోరాటం

Delhi Protest

డాక్టర్‌ అరుణ్‌ మిత్రా

ఢిల్లీలో మునుపెన్నడూ లేని రీతిలో చేసిన భద్ర తా ఏర్పాట్లు రాజధానిని వాస్తవంగా ఒక సైనిక స్థావరం (కంటోన్మెంట్‌)గా మార్చేశాయి. ఇది బ్రిటిష్‌ పాలనను గుర్తుకు తెస్తున్నాయి. అప్పట్లో వలస పాలకులు ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకు, అసమ్మతిని అణగదొక్కేందుకు క్రూరమైన బలప్రయోగాన్ని ఉపయోగించేవారు. కేవలం ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా సిజెపి, ఎఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎ నాయకులను, కార్యకర్తలను, అలాగే విద్యార్థులను, యువతను పెద్ద సంఖ్యలో అరెస్టు చేయడం, మోదీ ప్రభుత్వంలో పెరుగుతున్న భయాందోళనలను, అభద్రతాభావాన్ని బట్టబయలు చేస్తోంది.
జంతర్‌మంతర్‌ వద్ద తమ పౌరులు చేస్తున్న శాంతియుత నిరసనను ఎదుర్కొనేందుకు సన్నద్ధతలాగా కాకుండా, ఢిల్లీ ఏదో శత్రు సైన్యంపై దండ యాత్రకు సిద్ధమవుతున్నట్లుగా ఈ భద్రతా మోహరింపుల స్థాయి, తీరు కనిపిస్తోంది. ప్రజలు ఢిల్లీకి చేరుకోకుండా నిరోధించేందుకు రైళ్లను రద్దు చేయటం, ఇతర రవాణా మార్గాలపై తనిఖీలను కఠినతరం చేయడం వంటివి ప్రజాస్వామ్య అసమ్మతిని అణచివేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి మరిన్ని సాక్ష్యాలు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి) రాజీనామా కోరుతూ జరుగుతున్న ఆందోళనను అదుపు చేయకపోగా, ఈ అణచివేత చర్య లు ఉద్యమాన్ని వికేంద్రీకరించి, రాజధాని దాటి దేశంలోని వివిధ ప్రాంతాలకు వ్యాప్తి చేశాయి.
ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాలకు రకరకాలుగా స్పందిస్తాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు సాధారణంగా సంభాషణకు ప్రాధాన్యతనిస్తూ, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తాయి. అయి తే, నిరంకుశ పాలనలు బలప్రయోగం, అణచివేత వంటి మార్గాలను అనుసరిస్తాయి. ఇలాంటి ప్రతిస్పందనలు బలాన్ని కాకుండా బలహీనతను, అభద్రతను, హేతుబద్ధత లోపాన్ని ప్రతిబింబిస్తా యి.
జర్మనీలో నాజీలకు, కార్పొరేట్‌ ప్రయోజనాలకు మధ్య జరిగిన సహకారానికి చరిత్రే సాక్ష్యం. నాజీలు యూదులను దేశ శత్రువులుగా చిత్రీకరిస్తూ, దేశ సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు. వారు యూదు సమాజంపై ఉద్దేశపూర్వకంగా ద్వేషాన్ని, సామూహిక ఉన్మాదాన్ని రెచ్చగొట్టి, చివరికి గతంలో ఎన్నడూ లేని స్థాయిలో జాతి నిర్మూలనకు పాల్పడ్డారు. కమ్యూనిస్టులు, సోషలిస్టులు, కార్మిక సంఘాల వారు, సమాజంలోని ప్రగతిశీల వర్గాలు ఫాసిజాన్ని ప్రతిఘటించగా, యూదు వ్యతిరేక పక్షపాతంతోనో లేదా నాజీల క్రూరత్వపు భయంతోనో అనేకులు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయారు లేదా నాజీలకు మద్దతు కూడా ఇచ్చారు. ముస్సోలినీ హయాంలో ఇటలీలో కూడా ఇలాంటి నిరంకుశ పాలన, అణచివేత ధోరణి యే ఆవిర్భవించింది.
నేడు భారతదేశంలో మనం ఆందోళనకరమైన సారూప్యతలను చూస్తున్నాము. ఇక్కడ ప్రభుత్వ అధికారాన్ని చెలాయించే శక్తులు నిరంకుశ, మెజారిటీవాద ధోరణులను అంతకంతకూ ప్రదర్శిస్తున్నాయి. ప్రజాస్వామ్య విలువలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్న యువతను అడ్డుకోవడానికి పారామిలిటరీ బలగాలను మోహరించి, ఢిల్లీని భారీ పోలీసు పహారా నగరంగా మార్చడం ఈ వైఖరికి ఒక స్పష్టమైన నిదర్శనం. ఈ పరిణామాల వెనుక ఉన్న భావజాలానికి ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉంది. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాల్గొనలేదు. దాని విమర్శకుల ప్రకారం, అది వలసవాద వ్యవస్థతో సర్దుకుపోయింది. భగత్‌ సింగ్‌ వంటి విప్లవకారులను ధైర్యవంతులని, కానీ తప్పుదారి పట్టినవారని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన సిద్ధాంతకర్త ఎం. ఎస్‌. గోల్వాల్కర్‌ అభివర్ణించారు. గోల్వాల్కర్‌ జాతీయ సంపదను కొద్దిమంది చేతుల్లో కేంద్రీకరించాలని, తద్వారా అత్యధిక ప్రజలకు ఏమీ మిగలకుండా చేసి, కొద్దిమంది అధికారాలు గలవారు అధిక సంఖ్యాకుల పై ఆధిపత్యం చెలాయించడానికి వీలు కల్పించాలని కూడా వాదించారు.
మణిపూర్‌లో మూడున్నర సంవత్సరాల తర్వాత కూడా కొనసాగుతున్న హింస పట్ల చూపుతున్న ఉదాసీనత ఈ భావజాల ధోరణిని వివరించేందుకు ఉపయోగపడుతుంది. నిఘా, బలప్రయోగం ద్వారా పాలించబడే రాజ్యాన్ని సాధించాలనే తపన, ఇజ్రాయెల్‌తో బలపడుతున్న భారతదేశం రక్షణ, భద్రతా సంబంధాలలోనూ, పౌరులు, రాజకీయ ప్రత్యర్థులతో సహా వ్యక్తులను పర్యవేక్షించడానికి ఇజ్రాయెల్‌ అభివృద్ధి చేసిన పెగాసస్‌ గూఢచర్య సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించినట్లు వచ్చిన నివేదికలలోనూ మరింతగా ప్రతిబింబిస్తుంది.
ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్‌)అమలులో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ ప్రవర్తనపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తడంతో, ప్రభుత్వం ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. కోర్టు అనుమతితోనే ఫామ్‌ చేసిన మార్పులు చేశామన్న జ్ఞానేశ్‌ కుమార్‌ వాదనకు విరుద్ధంగా, ఆ మార్పులకు తమ ఆమోదం లేదని భారత సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించే బాధ్యత అప్పగించబడిన ఒక సంస్థకు అధిపతిగా, ఈ వైరుధ్యం ఆయన విశ్వసనీయత, నిజాయితీపై తీవ్రమైన ప్రశ్నల ను లేవనెత్తింది. ఈ చర్యలు ఎన్నికల సంఘం నైతిక అధికారానికి, ప్రజా విశ్వాసానికి కలిగించిన నష్టం మరింత ఆందోళనకరం. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ కారణంగా 13కోట్లకు పైగా భారత పౌరులు ఓటర్ల జాబితాల నుండి మినహాయించబడతారని, వారి ఓటు హక్కు నిరాకరించబడే అవకాశం ఉందని తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇంత పెద్ద ఎత్తున ఓటు హక్కును కోల్పోవడం ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పు. ముఖ్యంగా, ప్రజాస్వామ్య జవాబుదారీతనం, పౌరుల హక్కుల పరిరక్షణ ఇప్పటికే ఒత్తిడికి గురవుతున్న తరుణంలో ఇది మరింత ప్రమాదకరం.
మన జనాభాలో అత్యధికులకు, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి, ఆరోగ్యకరమైన పర్యావరణం, న్యాయమైన వేతనం వంటి హక్కులు అందని ఆకాంక్షలుగానే మిగిలిపోయాయి. చాలా మందికి, ప్రభుత్వ విధానాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి, అధికారంలో ఉన్నవారిని జవాబుదారీగా ఉంచడానికి ఉన్న కొన్ని అర్థవంతమైన మార్గాలలో ఓటు ఒకటి. ఈ ప్రాథమిక హక్కును బలహీనపరిచినా లేదా నిరాకరించినా, ప్రజలు తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి, ప్రజాస్వామ్య జీవితంలో పాల్గొనడానికి ఉన్న ఒక ముఖ్యమైన సాధనాన్ని కోల్పోతారు.
భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌కు ఆపాదించబడిన వ్యాఖ్యల చుట్టూ నెలకొన్న వివాదం నేపథ్యంలో, భారతదేశం అంతటా వేలాది మంది యువకులు తమ గౌరవాన్ని, ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకునేందుకు ముందుకు వచ్చారు. ప్రజాస్వామ్య విలువలు క్షీణించడం, మోదీ ప్రభుత్వ అణచివేత చర్యలుగా వారు భావిస్తున్న వాటికి వ్యతిరేకంగా వారి ఆగ్రహం నిరసనల రూపంలో ఎక్కువగా వ్యక్తమవుతోంది. ప్రధానమంత్రి, హోంమంత్రి ప్రభావంతో ఎన్నికల సంఘం పనిచేస్తోందని ఆరోపిస్తూ, జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ‘ఇండియా కూటమి’ కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ విధంగా ఈ ఉద్యమం ఎక్కువగా మోదీ ప్రభుత్వ విధానాలు, రాజకీయ నాయకత్వం వైపే మళ్ళించబడుతోంది.
నిరంతర ప్రజా ఉద్యమాలు అత్యంత శక్తివంతమైన, అణచివేత వ్యవస్థలను సైతం సవాలు చేయగలవని చరిత్ర నిరూపిస్తుంది. అయితే, అటువంటి ఉద్యమాల ను సునిశితమైన ఆలోచన, రాజకీయ స్పష్టత, క్రమశిక్షణ, స్పష్టమైన దిశానిర్దేశంతో నిర్వహించాలి. ఫాసిజం వ్యాప్తిని ఎదుర్కోవటానికి ప్రజాస్వామ్య, లౌకిక, ప్రగతిశీల శక్తులతో కూడిన ఒక బలమైన, విస్తృతమైన కూటమిని నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. ఈ పోరాటానికి ఐక్యత, వ్యూహాత్మక దూరదృష్టి, నిరంతర ప్రజా సమీకరణ అత్యంత అవసరం.
ద్రవ్య పెట్టుబడిలోని అత్యంత ప్రతిఘాతవాద, జాత్యాహంకార, సామ్రాజ్యవాద శక్తుల బహిరంగ, ఉగ్రవాద నియంతృత్వంగా ఫాసిజాన్ని జార్జి దిమిత్రోవ్‌ నిర్వచించారు. ఇది ఆర్థిక పెట్టుబడిలోని అత్యంత ప్రతిఘాతవాద వర్గాల ప్రత్యక్ష అధికార ప్రయోగాన్ని సూచిస్తుంది. ఇది బూర్జువా ప్రజాస్వామ్యాన్ని మార్చేసి, కార్మికవర్గం, రైతాంగం, మేధావులపై బహిరంగ హింస, అణచివేతలను ప్రవేశపెడుతుంది. అంతర్జాతీయ వేదికపై, ఇది తీవ్ర జాత్యాహంకారం, విస్తరణవాదం, సామ్రాజ్యవాద యుద్ధం ద్వారా వ్యక్తమవుతుంది.
ఆంటోనియో గ్రామ్సీ అవగాహన ప్రకారం ఫాసిజానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం కేవలం సైనిక లేదా ఆర్థిక ఘర్షణలకు అతీతంగా రాజకీయ వ్యవస్థ, సాంస్కృతిక భాగస్వామ్యం, భావాల పోరాటాన్ని కూడా కలిగి ఉండాలని నొక్కి చెప్పింది. కార్మికులు, రైతులు మూల సూత్రాలను విడిచిపెట్టే సంస్కరణవాద రాజీలను, అలాగే రాజకీయ నిష్క్రియాత్మకతను తిరస్కరించి, పెట్టుబడిదారీ దోపిడీ, ఫాసిస్ట్‌ హింస నుండి ప్రజలను రక్షించగల విస్తృత కూటములను నిర్మించుకోవాలి. ఫాసిజం కేవలం బలప్రయోగంతోనే కాకుండా, తన విలువలను రోజువారీ ఆలోచనా విధానంలో, ప్రజా సంస్కృతిలో, సామాజిక సంస్థలలో పాతుకుపోయేలా చేయడం ద్వారా కూడా మనుగడ సాగిస్తుంది. కాబట్ట్లి, దానిని ఓడించడానికి గ్రామ్సీ వర్ణించినట్లుగా ఒక ‘స్థాన యుద్ధం’ అవసరం. అంటే, నిరంకుశ భావజాలాలను సవాలు చేయడానికి, అవి ఆధారపడిన సామాజిక అంగీకారాన్ని కూల్చివేయడానికి పౌర సమాజం, సాంస్కృతిక సంస్థలు, సైద్ధాంతిక రంగంలో నిరంతరంగా సాగించే పోరాటం.
కాబట్టి, భారతదేశంలోని ప్రజాస్వామ్య శక్తులు తమ విభేదాలను పక్కనపెట్టి, రాజ్యాంగ విలువలు, పౌర స్వేచ్ఛలు, మానవ హక్కులను పరిరక్షించడానికి కలిసి ముందుకు సాగడం అత్యవసరం. అదే సమయం లో, వారు తమ స్వీయ లోపాలను, సంస్థాగత బలహీనతలను, రాజకీయ వ్యూహాలను నిజాయితీగా సమీక్షించుకోవాలి. దేశం ఎదుర్కొంటున్న ప్రాథమిక ప్రశ్నలపై ఐక్యతను, ద్వితీయ ప్రాధాన్యత అంశాలపై ఉన్న విభేదాలు అడ్డుపడటానికి అనుమతించకూడదు. సైద్ధాంతిక చర్చను నిర్మాణాత్మకంగా జరిపినప్పుడు, అది ఉద్యమాలను బలోపేతం చేసి, రాజకీయ అవగాహనను పెంచుతుంది. అయితే, వ్యక్తిగత ఆశయాలు, వర్గ ప్రయోజనా లు సంస్థాగత విశ్వసనీయత ను దెబ్బతీసి, ఉమ్మడి కార్యాచరణను బలహీనపరిచి, ప్రజల విశ్వాసాన్ని క్షీణింపజేస్తాయి. బృహత్తర పోరా టం కంటే వీటికి ఎన్నడూ ప్రాధాన్యత లభించకూడదు.
ఈ పోరాటానికి రాజకీయ స్పష్టత, సంస్థాగత ఐక్యత, పటిష్టమైన వ్యూహం, నిరంతర ప్రజా భాగస్వామ్యం మార్గదర్శకంగా ఉండాలి. ముప్పు తీవ్రతను గుర్తించటంలో ఏమాత్రం విఫలమైనా, లేదా ఐక్యంగా, సమర్థవంతంగా ప్రతిఘటనను నిర్మించడంలో ఏ మాత్రం సంకోచించి నా, అది కేవలం ప్రజాస్వామ్య సంస్థలకు, శ్రామిక ప్రజల హక్కులకే కాకుండా, సమాజం మొత్తానికే వినాశకరమైన పరిణామాలకు దారితీయవచ్చు.