కుట్టు మిషన్ చరిత్రకు రెండు శతాబ్దాలు
200 Years of the Sewing Machine: From Innovation to Industry
(13 జూన్ జాతీయ కుట్టు మిషన్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం)
పూర్వకాలంలో నూలు వస్త్రాలను శ్రమించి చేతులతో కుట్టుకునే సంస్కృతి నుంచి నేడు కుట్టు యంత్రం లేదా సీవింగ్ మిషన్ ఆవిష్కరణ తర్వాత అతి తక్కువ సమయం, శ్రమ వెచ్చించకుండానే అత్యంత సులభంగా, అందమైన రీతుల్లో వస్త్రాలు కుట్టుకోవడానికి మార్గం సుగమం అయ్యింది. నేడు ఇంటింటి మహిళల ఆత్మీయ నేస్తం అయ్యింది కుట్టు మిషన్. మహిళలకు మిత్రుడి వలె నిలుస్తూ, జీవనోపాధులను చూపుతోంది అద్భుత కుట్టు యంత్రం. నేడు వస్త్ర పరిశ్రమ కొత్త పుంతలు తొక్కడానికి నేడు కుట్టు మిషన్లు మానవ ప్రమేయ యంత్రాలు, ఎలక్ట్రానిక్, కంప్యూటరైజ్డ్, ఎలక్ట్రిక్ రూపాల్లో పలు సైజులు, ఆకృతుల్లో కనిపిస్తున్నాయి. కుట్టు మిషన్ల రాకతో టైలరింగ్ వృత్తితో పాటు అసంఖ్యాక మహిళలు ఆర్డర్లు తీసుకొని ఇంటి నుంచే బట్టలు కుడుతూ తమ తమ జీవనోపాధులను పొందడం జరుగుతున్నది.
జాతీయ కుట్టు మిషన్ దినం:
కుట్టు మిషన్ ప్రాధాన్యాన్ని గుర్తించిన అంతర్జాతీయ పౌర సమాజం ప్రతి ఏట జూన్ 13 న జాతీయ కుట్టు మిషన్ దినం లేదా నేషనల్ సీవింగ్ మిషన్ డే పాటించడం ఆనవాయితీగా మారింది. కుట్టు మిషన్ ఆవిష్కరణ మానవాళి నిత్య జీవితంలో, జీవనశైలిలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. ఫ్యాషన్ ప్రపంచానికి ఇది ఓ అద్భుత వరంగా మారింది. పెద్ద ఎత్తున వస్త్రాలను తయారు చేయడం, ఫ్యాషన్ లోకంలో అసంఖ్యాక డిజైన్లను పరిచయం చేయడం, వస్త్ర పరిశ్రమ రూపురేఖల్ని మార్చి వేయడం కొనసాగుతోంది. నేడు టైలరింగ్ వృత్తులు, ఫ్యాషన్ డిజైనర్లు, సాధారణ మహిళలు, అభిరుచి కలిగిన వ్యక్తులు కుట్టు మిషన్ ప్రాధాన్యాలను గుర్తించి దాని ప్రచారానికి ఎనలేని కృషి చేస్తున్నారు. జాతీయ కుట్టు మిషన్ దినం వేదికగా కుట్టు మిషన్ ప్రదర్శనలు, కుట్టు మిషన్ పని తీరు పట్ల అవగాహన, కుట్టు మిషన్ సహాయంతో తయారు చేసిన పలు రకాల వస్త్ర డిజైన్ల ప్రదర్శనలు, ప్రఖ్యాత టైలర్లను సన్మానించడం, కుట్టు మిషన్లలో వచ్చిన ఆధునిక సాంకేతిక మార్పులు లాంటివి అవగాహన చేసుకోవచ్చు.
కుట్టు మిషన్ పుట్టుక :
కుట్టు మిషన్ చరిత్ర 150 ఏండ్ల క్రితమే ప్రారంభమైంది. 13 జూన్ 1829 రోజున ఫ్రెంచ్ టేఫెంచ్ బార్థలెమి టిమ్మోనియర్ కృషితో కుట్టు యంత్రం కనుగొనబడింది. అంతకు పూర్వం పలు ప్రయత్నాలు జరిగిన విషయం కూడా జరగడం జరిగింది. 10 సెప్టెంబర్ 1847న అమెరికన్ ఇలియాస్ హోవె తొలిసారి కుట్టు మిషన్ పేటెంట్ చేసారు. 1851లో ఐజాక్ సింగర్ అను శాస్త్రవేత్త అత్యాధునిక కుట్టు యంత్రం రూపొందించి వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడం జరిగింది. కుట్టు మిషన్ తయారీలో తమ మేధస్సును వెచ్చించిన పలువురు ఆవిష్కర్తలకు కృతజ్ఞతలు తెలపడం మన కనీస బాధ్యత అవుతుంది.
నేడు వస్త్ర పరిశ్రమ పెద్ద ఎత్తున పెరగడానికి పునాదిగా నాటి, నేటి కుట్టు మిషన్ నిలుస్తున్నది. నేడు కుట్టు మిషన్ సామాన్యుల ఇంటిలో ఒక అవిభాజ్య భాగం అయ్యింది. మహిళలు తమ ఇంటి వస్త్రాలను, జీవనోపాధిగా ఇతరుల వస్త్రాలను కుట్టడానికి మన కుట్టు మిషన్ దోహదపడుతున్నది. మనకు వస్త్రాలను కుట్టి, మన అందాన్ని ఇనుమడింపజేస్తున్న టైలర్స్ కృతజ్ఞతలు తెలుపుదాం. కుట్టు మిషన్ల ప్రదర్శనలకు వెళ్లి పలు రకాల కుట్టు యంత్రాలను చూసి వద్దాం. – బిఎంఆర్