ఒక తెలుగోడు, ఒక మొనగాడు…ఆయనే వేములపల్లి శ్రీకృష్ణ
Vemulapalli Srikrishna
నందిరాజు రాధాకృష్ణ
‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీర్తి గలవోడా’ గీతం తెలుగు సాహిత్య కీర్తికిరీటం లో కలికి తురాయి. ఆ గీతంతో తెలుగుజాతి చైతన్యాన్ని మేల్కొల్పిన ప్రజాకవి, కమ్యూనిస్టు నాయకుడు కీ.శే.వేములపల్లి శ్రీకృష్ణ అని ఈ తరంలో చాలామందికి తెలీకపోవచ్చు. ఆయన రాసిన ఒక గేయం దశాబ్దాలపాటు తెలుగునేల నాలుగు దిక్కు లా పిక్కటిల్లింది. అన్ని భావాలు, అన్ని వాదాలు కలగలిపి సువిశాలాంధ్ర గళం వినిపించారు. తెలుగుజాతి చైతన్యాన్ని మేల్కొల్పిన ప్రజాకవి, ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా..!!’ అన్న ఆయన పిలుపునకు యువత పౌరుషంతో పరుగులెత్తింది ఆ రోజుల్లో. తెలుగుతనాన్ని తట్టిలేపి దేశ రాజకీయాల్లో చైతన్యం కలిగించిన ఆంధ్రప్రదేశ్‌పూర్వ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు నోట నర్తించిన ఆ గేయం. ఆయన ఒక నిబద్ధత కలిగిన విశాలాంధ్ర పాత్రికేయునిగా, పత్రిక ప్రధాన ఎడిటర్‌గా, పాత్రికేయ ప్రతిభను కనబరచారు. గుంటూరు జిల్లా పెదకాకాని హేమలత టెక్స్‌టైల్‌మిల్‌వర్కర్స్‌యూనియన్ ఉపాధ్యక్షులుగా వ్యవహరించారు. నిరాడంబరంగా నిజాయితీ ఊపిరికలిగిన కమ్యూనిస్టుగా జీవితం సాగించి, మూడుసార్లు శాసనసభ ప్రజాప్రతినిధిగా సేవలందించిన మహనీయుడు వేములపల్లి. ‘మనసులోని అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పటం అలవర్చుకోండి. ప్రజల దైనందిన సమస్యలు తెల్సుకుని సాన్నిహిత్యం పెంచుకోండి. చెప్పే మాటలకూ, చేసే పనులకూ దూరం పెరిగే కొద్దీ మీకు ప్రజలు దూరమవుతారు. సిద్ధాంత పరిజ్ఞానంతోపాటు వాస్తవ పరిస్థితుల అధ్యయనం అవసరం’ అనే స్ఫూర్తిదాయక వ్యాఖ్య లు ఆయన్ను చిరస్మరణీయునిగా నిలిపాయి.
విస్తృత జీవితానుభవాలతో, రాజకీయ ఉద్యమ సుభావాలతో రాటుదేలిన శ్రీకృష్ణ ఎలా ఉండేవారో పాత కమ్యూనిస్టు తరానికి; తలపండిన పాత్రికేయ మిత్రులకు మాత్రమే స్ఫురణకు వస్తా రు. కొద్దిమందికి ఆయన ఒక పాత్రికేయునిగా గుర్తు. విశాలాంధ్ర ఎడిటర్‌గా రాష్ట్రంలో పాతకాలం పత్రి కా పాఠకులకు తెలిసుండవచ్చు. తరతరాల సాహితీవేత్తలకూ, ప్రజాప్రతినిధులకు ఆదర్శనీయులుగా నిలిచారు.
రేపల్లెలోని బేతపూడిలో మధ్యతరగతి రైతు కుటుంబంలో వేములపల్లి శ్రీకృష్ణ 1917 జులై 30న (తండ్రి వేములపల్లి వెంకట్రామయ్య) జన్మించారు. పాఠశాలలో మాకినేని బసవపున్నయ్య, మోటూరు హనుమంతరావు, ఎం.పరంధామయ్య, పమిడిముక్కల లక్ష్మణరావు, కంఠంనేని వెంకటరత్నం తదితర ప్రముఖులు శ్రీకృష్ణకు సీనియర్లు. వారితో పరిచయం, ఆనాటి జాతీయోద్యమం, అతివాద సాహిత్యం ఆయనపై ప్రభావం చూపి కమ్యూనిజం వైపు అడుగులు వేయించాయి. గుంటూరులో బ్రాడీపేటలో చదువుతున్న కాలంలో పులుపుల వెంకట శివయ్య, ప్రభల కృష్ణమూర్తి, ప్రతాప రామసుబ్బయ్య, ఏటుకూరి బలరామమూర్తి, అమరవాది కృష్ణమూర్తి తదితరులతో ఏర్పడిన బంధాలు, సంబంధాలు కారణంగా 1935- కమ్యూనిస్టు పార్టీ అనుబంధ విభాగం లో ప్రవేశించారు.
చీరాల ఐ.ఎల్.టి.డి. కార్మికుల సమ్మె పోరాటంలో పోలీసు కాల్పులు జరిగిన సమయంలో సమ్మెలోని కార్మికుల సహాయార్ధం కన్యాశుల్కం నాటకం ప్రదర్శించి వచ్చిన ఆదాయమంతా కార్మికులకందించారు. బి.ఎ. పట్టా అందుకున్న తరువాత కొంతకాలం బందరు మ్యూచువల్‌ఇన్సూరెన్సు కంపెనీలో ఉద్యోగం చేసారు. ఆ సమయంలో కామ్రేడ్‌శివయ్య పిలుపుతో ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీ రహస్య యంత్రాంగ నిర్వహణ బాధ్యత చేపట్టారు. 1937లో కొత్తపట్నంలో నిర్వహించిన ప్రసిద్ధ రాజకీయ పాఠశాలకు హాజరై, ప్రభుత్వ నిషేధాజ్ఞలను ధిక్కరించి లాఠీఛార్జ్జిలో గాయపడ్డారు.. 1938లో కమ్యూనిస్టుపార్టీ సభ్య త్వం పొందారు. 1942- 43లో హిట్లర్‌సైన్యాలను మాస్కో వద్ద రెడ్‌ఆర్మీ అటకాయించి తిప్పికొడుతున్న రోజుల్లో ‘మాస్కో పొలిమేరల్లో నా ‘కోలాటం పాట, బెంగాల్‌కరవుపై ‘బ్రహ్మపట్నం పోదామంటే’ అంటూ, కయ్యూరు వీరులపై…ఇలా ఎన్నోపాటలు రాశారు. 1948లో కమ్యూనిస్టు పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శిగా, అనంతరం రెండుసార్లు రాష్ట్ర పార్టీ కార్యదర్శివర్గ సభ్యులుగా, రెండుసార్లు జాతీయ సమితి సభ్యులుగా ఎన్నికై సమర్థతతో బాధ్యతలు నిర్వర్తించారు. 1952లో బాపట్ల నుంచి, 1962, 1972లో మంగళగిరి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. శాసనసభలో కమ్యూనిస్టు పక్ష నాయకునిగా, పబ్లిక్‌ఎకౌంట్స్‌కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. 1965 విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకై ఉద్యమం సందర్భంగా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సి.ఆర్.ఫౌండేషన్‌ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి దాని నిర్మాణానికి విశేష కృషి చేశారు. భారత్‌సోవియట్‌మిత్రమండలి, శాంతి స్నేహ సంఘాల అభివృద్ధికి శ్రమించారు. 2000 ఏప్రిల్8న శ్రీకృష్ణ హైద్రాబాద్‌లో కన్నుమూశారు. వేములపల్లి రాసిన
‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా
గతమెంతో ఘనకీర్తి గలవోడా
వీర రక్తపుధార వారబోసిన సీమ, పలనాడు నీదెరా
వెలనాడు నీదెరా
బాలచంద్రుడు చూడ ఎవరోయి
తాండ్ర పాపయ్య గూడ నీవొడోయ్
నాయకీ నాగమ్మ, మల్లమాంబ, మొల్ల,
మగువ మాంచాల, నీ తోడబుట్టినవోళ్ళే
చేయెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి గలవోడా
పాట ఘంటసాల కంచుకంఠంతో ఆంధ్రదేశ యువతలో ఉత్తేజం మేల్కొలిపింది.