Skip to content
లైఫ్ స్టైల్ వార్తలు

సమ సమాజ నిర్మాణానికి అక్షర ఆయుధం అలిశెట్టి కవిత్వం…

Prajapaksham 19 Jul 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
సమ సమాజ నిర్మాణానికి అక్షర ఆయుధం అలిశెట్టి కవిత్వం…

సమ సమాజ నిర్మాణానికి అక్షర ఆయుధం అలిశెట్టి కవిత్వం...

డా॥ ఎస్. విజయ భాస్కర్

ఉమ్మడి తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తెలుగు సాహిత్యంలో అలిశెట్టి ప్రభాకర్ తెలియని వ్యక్తులు లేరు. అలిశెట్టి ప్రభాకర్ 39 సంవత్సరాలే జీవించినా తెలుగు సాహిత్యంలో తన ముద్రను చెరగని సంతకంగా పదిలపర్చుకున్నాడు. అలిశెట్టి ప్రభాకర్ శివైక్యం చెంది 33 సంవత్సరాలు గడిచినా, ఆయన రాసిన కవిత్వం ప్రజల నాలుకలపై నినాదాల రూపంలో, దినపత్రికల్లో పతాక శీర్షిక రూపంలో మనకు నిత్యం దర్శనమిస్తుంది.

అలిశెట్టి ప్రభాకర్ కవిత్వాన్ని ఇటీవల జగిత్యాల జిల్లాలో జరిగిన ప్రజా దీవెన సభలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (భారతీయ రాష్ట్ర సమితి – బీఆర్ఎస్) వ్యవస్థాపకులు, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తన ఉపన్యాసాన్ని అలిశెట్టి ప్రభాకర్ కవిత్వమైన ‘గుండె సైన్యం’ కవితతో ప్రారంభించారు.

“చీకట్లో జడుసుకుంటే
ఒక చెట్టే నీ చుట్టూరా…
గుండెంటు కలిగుంటే
అరణ్యమై భయపెడుతుంది.
నీ వెంట అదే
పెద్ద సైన్యమై నిలుస్తుంది.”

అని ప్రారంభించడంతో అలిశెట్టి ప్రభాకర్ కవిత్వాన్ని ఈనాటి తరానికి తెలియజేయడానికి ఈ వ్యాసం.

అలిశెట్టి ప్రభాకర్ తల్లిదండ్రులు కీ॥శే. లక్ష్మీ, చినరాజం పుణ్యదంపతులకు 12-01-1954న గతంలో కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం జగిత్యాల జిల్లాలోని జగిత్యాలలో జన్మించారు. ఆయన సహచరి భాగ్య, కుమారులు సంగ్రామై, సంకేత్. గతంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లిలో, ప్రస్తుతం ఉప్పల్ సమీపంలోని ఫిర్జాదిగూడలో నివాసం ఉంటున్నారు.

12-01-1993న భౌతికంగా మన నుంచి దూరమైనా, కవిత్వ రూపంలో మనకు ప్రతిరోజూ పలకరిస్తూనే ఉంటాడు.

“మరణం నా చివరి చరణం కాదు” కవితలో…

“మరణం నా చివరి చరణం కాదు
మౌనం నా చితాభస్మం కాదు
మనోహరాకాశంలో విలపించే
చంద్రబింబం నా అశ్రుకణం కాదు.”

అంటాడు.

మొదట చిత్రకారుడిగా జీవితం ప్రారంభించాడు. ప్రారంభంలో పండుగల, ప్రకృతి దృశ్యాల, సినీ నటుల బొమ్మలను పత్రికలలో వేశాడు. తర్వాత జగిత్యాలలో ‘సాహితీ’, ‘మిత్రదీప్త’ సంస్థల పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించాడు.

1974లో ఆంధ్రసచిత్ర వారపత్రికలో వచ్చిన ‘పరిష్కారం’ ప్రచురణ రూపంలో అచ్చయిన మొదటి కవిత.

జగిత్యాలలో 1976లో స్టూడియో పూర్ణిమ, 1979లో కరీంనగర్‌లో స్టూడియో శిల్పి, 1983లో హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో చిత్రలేఖ ఏర్పాటు చేసుకొని జీవిక కోసం ఫోటోగ్రాఫర్‌గా జీవిత పోరాటంలో కవిగా ఎదిగాడు.

కుంచెను, కెమెరా లెన్సును, కలాన్ని ఏకం చేసి తెలుగు కవితకు పుష్టి చేకూర్చాడు. ఏనాడు సంపాదన కోసం ఆరాటపడలేదు. తన కళ ప్రజల కోసమే… “కళ కళ కోసమే కాదు… కళ ప్రజల కోసమే” అనే భావాన్ని చివరి వరకు నమ్మాడు.

అలిశెట్టి రచనలు

  • 1978లో ఎర్ర పావురాలు
  • 1979లో మంటల జెండాలు, చురకలు
  • 1985లో రక్తరేఖ
  • 1989లో ఎండమావి
  • 1990లో సంక్షోభ గీతం
  • 1992లో సిటీ లైఫ్

ప్రచురింపబడిన కవితా సంకలనాలు.

ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ల పాటు సీరియల్‌గా ‘సిటీ లైఫ్’ పేరుతో హైదరాబాద్ నగరంపై రాసిన మినీ కవితలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. తన కవిత్వంతో పాఠకుల ఆలోచనా దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన కవి.

తెలుగు సాహిత్యంలో ప్రముఖ అభ్యుదయ, విప్లవ, ప్రజాకవి శ్రీశ్రీ తర్వాత అంత ఎక్కువగా కోట్ అయిన కవిత్వం ప్రభాకర్‌ది. రూపంలో సంక్షిప్తతను, వస్తువులో జీవిత విస్తృతిని, సమాజపు లోతులను ఇమిడ్చాడు. సమాజ మార్పును, సమసమాజాన్ని కాంక్షిస్తూ పేదరికానికి బలైన కవి.

సమాజంలోని అనేక రుగ్మతలపై కలాన్ని ఖడ్గంగా ఉపయోగించినవాడు అలిశెట్టి ప్రభాకర్.

“వేశ్య” అనే కవితలో…

“ఒకరికి వశమై…
తనువు పుండై…
ఒకడికి పండై…
ఎప్పుడూ ఎడారై…
ఎందరికో ఒయాసిస్ట్‌లా…”

అని వారి దీనస్థితిని ఎక్స్‌రే తీసినట్లు మన ముందుంచాడు.

“ట్రిగ్గర్” కవితలో…

“తిన్నగా
తుపాకీ గొట్టం మీదుగా
ప్రజాకవి గద్దర్‌పై నడిచొస్తే
కనిపిస్తాడొక ట్రిగ్గర్…

సరాసరి శత్రువు గుండెలపైకి
గురి పెట్టబడిన బాట మీదుగా
పయనిస్తే కనిపిస్తాడొక
గద్దర్!” అంటాడు.

ఉభయ తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రభుత్వం చేత ప్రచురించబడుతున్న పాఠ్యపుస్తకాల్లో ముఖ్యంగా పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీలలో అలిశెట్టి ప్రభాకర్ కవిత్వాన్ని ప్రచురించడం జరిగింది.

తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రచురించిన పదోతరగతి పాఠ్యపుస్తకంలో 5వ పాఠం “నగర గీతం” అనే కవిత ఎంతో మంది విద్యార్థులకు ఇష్టమైన పాఠంగా మారి తెలుగు సాహిత్యంపై ఆసక్తిని, అభిరుచిని, జిజ్ఞాసను పెంపొందిస్తుంది.

నగర గీతం

నగరం మోగిందా
నయాగరా దుమికిందా
నాలుగు రోడ్ల కూడలిలో ఏమది?
అదే నగరారణ్య హోరు
నరుడి జీవన ఘోష.

తల్లి ఒడివంటి
పల్లెసీమల్ని విడిచి
తరలివచ్చిన పేద రైతులూ
ఇనుప పెట్టెల్లాంటి
ఈ పట్టణాల్లో
ఊపిరాడని మీ బతుకులూ.

నగరంలో ప్రతి మనిషి
పఠనీయ గ్రంథమే
మరి నీ బతుకు
పేజీలు తిరిగేసేదెవరో!

ఉదయమే
బస్సుల్లో, రిక్షాల్లో,
పేవ్‌మెంట్లపై విరబూసిన
కాన్వెంట్ పువ్వుల సందడి
రాలే చదువుల పుప్పొడి!

సిటీ అంటే అన్నీ
బ్యూటీ బిల్డింగ్లు కావు
అటు భవంతులు… ఇటు పూరిళ్లు…
దారిద్ర్యం, సౌభాగ్యం
సమాంతర రేఖలు!

ఇది వెరైటీ సమస్యల మనుష్యుల
సమ్మేళన కోలాహలం!
ఎంత చేసినా ఎవరికీ
తీరిక దక్కదు…
కోరిక చిక్కదు…
మెర్క్యూరీ నవ్వులు…
పాదరసం నడకలు.

కొందరికి రెండు కాళ్లు
రిక్షావాళ్లకి మూడు కాళ్లు
ఉన్నవాళ్లకి నాలుగు కాళ్లు!

నగరంలో అన్ని పక్కలా
సారించాలి మన చూపులు
మహానగరాల రోడ్లకి
మరణం నాలుగు వైపులు!

నగరం మహావృక్షం మీద
ఎవరికి వారే ఏకాకి!
నగరం అర్థంకాని రసాయనశాల
నగరం చిక్కువడని పద్మవ్యూహం!!

అంటూ ఎలాంటి కఠిన పదాలు, అర్థం కాని పదాలు, ఢాంభికాలు, సంస్కృత భూయిష్టమైన పదాలు లేకుండా అందరికీ అర్థమయ్యే భాషలో, సులభ శైలిలో రాసి విద్యార్థులకు ఇష్టమైన పాఠంగా మారింది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కాంక్షించిన కవి. 39 సంవత్సరాలకే మరణించి ఉండకపోతే తెలుగు సాహిత్యంలో, ముఖ్యంగా తెలంగాణ సాహిత్యంలో వినూత్నమైన రీతిలో సాహిత్యం వెలువడేది.

అలిశెట్టి ప్రభాకర్ కవిత్వంలో ఆంగ్ల పదాలు తెలుగు సాహిత్యంలో సులభంగా కలిసిపోతాయి. ట్రీట్‌మెంట్‌, పెయింటింగ్‌, క్యూ, బ్యాండేజీ, మినీ టానిక్‌, ప్లాస్టిక్‌ సర్జరీ, రైటర్స్‌, మాన్‌స్క్రిప్ట్‌, డాక్టర్స్‌, ప్రిస్క్రిప్షన్‌, పర్సనల్‌ పోయమ్‌, ట్రిగ్గర్‌, లెట్స్‌ గో… వంటి అనేక పదాలు కనిపిస్తాయి.

అలిశెట్టి ప్రభాకర్ కుటుంబాన్ని ఆదుకోవాలి

తెలుగు సాహిత్యంలో, ముఖ్యంగా తెలంగాణ సాహిత్యంలో లబ్ధప్రతిష్ట కలిగిన అనేక కవులలో ముఖ్యంగా బండి యాదగిరి, గద్దర్, గోరేటి వెంకన్న, అందెశ్రీ, గూడ అంజయ్య, అశోక్‌ తేజ వంటి కవుల వరుసలో ఏమాత్రం తగ్గని, సమాజంపై ఎంతో ప్రభావం కలిగించిన కవి అలిశెట్టి ప్రభాకర్.

అలిశెట్టి ప్రభాకర్ కుటుంబం ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) ప్రభుత్వం గానీ, కాంగ్రెస్ ప్రభుత్వం గానీ వారి ఆర్థిక పరిస్థితిపై ఆరా తీయకపోవడం శోచనీయం.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి కోటి రూపాయలు, 500 గజాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. “జయహే తెలంగాణ జననీ జయకేతనం” అనే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడం జరిగింది.

తెలంగాణలోని కవులకు, కళాకారులకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మంచి ప్రాధాన్యత లభిస్తుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కవుల, రచయితల రచనలు మాత్రమే పాఠ్యపుస్తకాలలో ప్రచురించేవారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రచురించిన పుస్తకాలలో తెలంగాణ కవుల, రచయితల, కళాకారుల రచనలకు ప్రాధాన్యత పెరిగింది.

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాలలో పుట్టి పెరిగిన అలిశెట్టి ప్రభాకర్ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదు కోట్లు, పది ఎకరాల స్థలాన్ని కేటాయించి ఆదుకోవాలి.

పుస్తక ఎగ్జిబిషన్‌లోనూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ అలిశెట్టి ప్రభాకర్ ద్వారాన్ని నిర్మించారు.

అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం, సాహిత్యం తెలంగాణ రాష్ట్రంపై అధిక ప్రాధాన్యత కలిగి ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలిశెట్టి ప్రభాకర్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ట్యాగ్‌లు: Telugu literature