Typhoon Dolphin: చైనాపై విరుచుకుపడిన డాల్ఫిన్ తుఫాను.. వేలాది విమానాలు రద్దు.. 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు..
Typhoon Dolphin
Typhoon Dolphin: ఈ ఏడాది చైనాను తాకిన అతి శక్తివంతమైన డాల్ఫిన్ తుపాను (Dolphine Typhoon) తూర్పు తీరంలో తీవ్ర విధ్వంసం సృష్టిస్తోంది. ఈ సంవత్సరంలో చైనాను తాకిన 13వ తుపానుగా నమోదైన డాల్ఫిన్.. ఆదివారం జెజియాంగ్ ప్రావిన్స్‌లో తీరాన్ని దాటింది. తీరాన్ని తాకే సమయంలో గంటకు 151 కిలోమీటర్ల వేగంతో (సెకనుకు 42 మీటర్లు) చండప్రచండమైన గాలులు వీచడంతో జాతీయ వాతావరణ సంస్థ అత్యున్నత స్థాయి ‘రెడ్ అలర్ట్’ ప్రకటించింది.
ఈ తుపాను ప్రభావంతో చైనాలోని ప్రధాన ఆర్థిక రాజధాని, దేశంలో రెండవ అత్యంత ప్రాధాన్యత కలిగిన షాంఘై నగరంతో పాటు పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. షాంఘైలోని రెండు ప్రధాన విమానాశ్రయాల్లో దాదాపు 2,230 విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో నగరంలో విమాన రవాణా సామర్థ్యం 40 శాతం మేర పడిపోయింది. హాంగ్‌జావ్ విమానాశ్రయంలోనే మరో 500 విమానాలను అధికారులు రద్దు చేశారు.
జెజియాంగ్ తీర ప్రాంతాల నుంచి లక్షలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. షాంఘై సమీపంలోని జియాడింగ్, క్వింగ్‌పు, జిన్‌షాన్ జిల్లాల్లో వీధులు మోకాళ్ల లోతు నీటితో చెరువులను తలపిస్తున్నాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఇంతటి తీవ్రమైన వరదలను చూడటం ఇదే మొదటిసారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిన్‌షాన్ జిల్లాలోని విద్యాసంస్థలు, వ్యాపార వేళలు మరియు రవాణా సేవలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
సాధారణ తుపానులతో పోలిస్తే డాల్ఫిన్ తుపాను ప్రయాణించిన దూరం, దాని జీవిత కాలం మూడు రెట్లు ఎక్కువ అని ప్రభుత్వ ప్రసార సంస్థ ‘సీసీటీవీ’ వెల్లడించింది. తీరాన్ని తాకడానికి ముందే ఇది దాదాపు 6 వేల కిలోమీటర్ల సుదీర్ఘ దూరం ప్రయాణించి భారీ వర్షపు మేఘాల వ్యవస్థను చైనా తూర్పు ప్రాంతంపైకి తీసుకొచ్చింది. తీరం దాటిన తర్వాత ఇది ఉష్ణమండల తుపానుగా బలహీనపడినప్పటికీ, దీని ప్రభావంతో అన్హుయ్, జియాంగ్సు, షాన్‌డాంగ్ ప్రావిన్సుల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
డాల్ఫిన్ తుపాను ప్రభావంతో తేమతో కూడిన మేఘాలు దేశం లోపలి భాగాలైన హుబే, హెనాన్‌ల వైపు కదులుతుండటంతో రాజధాని బీజింగ్‌కు ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆగస్టు 13 (గురువారం) వరకు బీజింగ్‌లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఆకస్మిక వరదలు, పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. 2022లో ఫుజియాన్, బీజింగ్‌లలో విధ్వంసం సృష్టించిన ‘డోక్సూరి’ తుపాను స్థాయిలోనే డాల్ఫిన్ తుపాను ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
- Dussehra 2026: దసరా తొలి రోజు అమ్మవారి అవతారం.. శైలపుత్రి దేవి వెనుక కథ ఇదే..
- Strait of Hormuz Attack: హార్ముజ్ జలసంధిలో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు..
- US Measles Outbreak: అమెరికాలో మీజిల్స్ కలకలం.. మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ 3,900కు చేరువైన కేసులు!
- సీపీఐ నేత గుజ్జుల ఈశ్వరయ్యను పరామర్శించిన సీపీఐ, బీఆర్ఎస్ నేతలు.. ప్రజా జీవితంలో మళ్లీ చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్ష..
- Bay of Bengal Dead Zone: బంగాళాఖాతంలో తగ్గుతున్న ఆక్సిజన్.. విశాఖ-కాకినాడ తీరాలకు ఎదురుగా ‘డెడ్ జోన్’.. కనుమరుగవుతున్న చేపలు..