Israel Election 2026: అక్టోబరు 27న ఇజ్రాయెల్ ఎన్నికలు.. నెతన్యాహూకు మాజీ ఆర్మీ చీఫ్ ఐసెన్కోట్ గట్టి పోటీ
Israel Election 2026: అక్టోబరు 27న ఇజ్రాయెల్ ఎన్నికలు.. నెతన్యాహూకు మాజీ ఆర్మీ చీఫ్ ఐసెన్కోట్ గట్టి పోటీ
అక్టోబరు 27న ఇజ్రాయెల్ ఎన్నికలు
నెతన్యాహూ–ఐసెన్కోట్ మధ్య పోటీ
జెరూసలెం: పీకలోతు యుద్ధాల్లో మునిగి ఉన్న ఇజ్రాయెల్లో ఈ ఏడాది అక్టోబరు 27వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో ఈసారి ఇజ్రాయెల్ సైనిక దళాల మాజీ అధిపతి (ఐడీఎఫ్) ఐసెన్కోట్ ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. నెతన్యాహూతో సమఉజ్జీగా నువ్వా? నేనా? అనే రీతిలో పోటీ పడేందుకు ఆయన బరిలోకి దిగుతున్నారు.
ఇజ్రాయెల్ పార్లమెంటు క్నెసెట్ ప్రధానమంత్రిని ఎన్నుకుంటుంది తప్ప, ప్రజలు నేరుగా ఓట్లు వేసి ప్రధానమంత్రి అభ్యర్థిని ఎన్నుకునే సంప్రదాయం ఇజ్రాయెల్లో లేదు. క్నెసెట్లో ఏ పార్టీ అయినా మెజార్టీ సంపాదించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మొత్తం 120 స్థానాలకు గాను 61 స్థానాలను గెలుచుకోవాలి. నెతన్యాహూ వ్యతిరేక కూటమి 60 సీట్లు గెలుచుకుంటుందని, నెతన్యాహూ లికుద్ పార్టీ అనుకూల పార్టీలు 50 స్థానాలు గెలుచుకుంటాయని, అరబ్ పార్టీలు మరో 10 స్థానాలు గెలుచుకుంటాయని ఛానెల్–12 సర్వే అంచనా వేసింది.
ఐసెన్కోట్కు చెందిన యషార్ పార్టీ 23 సీట్లతో పార్లమెంటులో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని నివేదిక తెలిపింది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినాగానీ మిత్రులను కూడదీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందే. దేశంలో జరిగిన తాజా సర్వేలో 38 శాతం ప్రజలు నెతన్యాహూ ప్రధానమంత్రి పదవిలో కొనసాగాలని కోరుకుంటుండగా, మరో 38 శాతం ప్రజలు అంతే బలంగా ఐసెన్కోట్ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకుంటే బాగుంటుందని భావిస్తున్నారు.
ఈసారి ఎన్నికల్లో ఇజ్రాయెల్ భద్రత, దేశంలో అంతర్గత సంస్కరణలే ప్రధాన ప్రచారాంశంగా తెరమీదకు రానున్నాయి. ఈ నెల ఆరంభంలో ఛానెల్–12 నిర్వహించిన సర్వేలో 43 శాతం ప్రజలు ఐసెన్కోట్ను ఇష్టపడ్డారు. 34 శాతం మంది మాత్రమే నెతన్యాహూ వైపు మొగ్గుచూపారు. కానీ, ఆ తర్వాత సర్వేలో ఐసెన్కోట్ కంటే నెతన్యాహూకు ప్రజాదరణ పెరిగింది.
అన్నిటికంటే ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ను మోసం చేశారని, తన ప్రయోజనాలకు ఇజ్రాయెల్ను బలిపెట్టారని ఆ దేశ ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. ట్రంప్ వ్యతిరేకత కూడా ఆ దేశంలో చాలా బలంగా కనిపిస్తోంది.
2022 డిసెంబరు 29న ఏర్పడిన ఇజ్రాయెల్ ప్రస్తుత 37వ మంత్రివర్గం ఐదు పార్టీల కూటమితో ఏర్పడింది. ఈ కూటమికి నెతన్యాహూ సారథ్యంలోని లికుద్ పార్టీ 32 స్థానాలతో నాయకత్వం వహిస్తోంది. ఈ పార్టీలన్నీ కలిసి 60 స్థానాలు గెలుచుకున్నాయి. ఇక ప్రతిపక్షంలో మరో 14 పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
4,500 మంది సభ్యులున్న లికుద్ పార్టీ కేంద్ర కమిటీ మొత్తం పోటీ చేసే సీట్లలో ఎనిమిది స్థానాలను నెతన్యాహూకు వదిలేసింది. ఈ స్థానాలకు నెతన్యాహూ స్వయంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ముఖ్యంగా ఇటీవల బయట నుంచి వచ్చి పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.