Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

అక్టోబర్‌ 4న కీలకమైన బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికలు

Prajapaksham 29 Sep 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
అక్టోబర్‌ 4న కీలకమైన బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికలు

Brazilian Flag

అక్టోబర్‌ 4న జరిగే బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. వర్కర్స్‌ పార్టీ నేత, ప్రస్తుత వామపక్ష అధ్యక్షుడు ఇనాసియో లులా డ సిల్వ తొలిరౌండ్‌లోనే తిరిగి ఎన్నికవుతారా, లేక 50 శాతంపైగా ఓట్లు పొందటంలో విఫలమైతే రెండవ రౌండ్‌ అనివార్యమవుతుందా అనేది పరిశీలకులను పీడిస్తున్న ప్రశ్న. జైల్లో ఉన్న మాజీ అధ్యక్షుడు జైర్‌ బోల్సనారో పెద్దకుమారుడు ప్లాబియో బోల్సనారో ఆయన ప్రత్యర్థి. డి సిల్వాను ఓడించి అమెరికా అనుకూల మితవాద ప్రభుత్వం ఏర్పాటుకై అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఈ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో జోక్యం చేసుకుంటున్నందున అవి ప్రతిష్టాత్మకంగా తయారైనాయి. అభ్యర్థులిరువురికీ 40 శాతం మధ్య ఓట్లు లభిస్తాయని, అందువల్ల అక్టోబర్‌ 25న రన్‌ తప్పదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే తమ ఎన్నికల్లో ట్రంప్‌ జోక్యాన్ని, బోల్సనారోను బలపరచటాన్ని వ్యతిరేకిస్తున్న మితవాద, మధ్యేమార్గ పార్టీల మద్దతును లులా కూడగట్టగలిగితే తొలి రౌండ్‌లోనే ఆయన విజయం సాధ్యమంటున్నారు. ఈ ప్రయత్నం ఫలించకపోయినా రన్‌ ఎన్నికల్లో ఆయన విజయం తథ్యమంటున్నారు. బ్రెజిల్‌ ఎన్నికలు ఆ దేశానికేగాక లాటిన్‌ అమెరికాలో వామపక్ష రాజకీయాల భవిష్యత్‌కు ఎంతో కీలకం.
లులా గతవారం న్యూయార్క్‌లో ఐరాస జనరల్‌ అసెంబ్లీ ప్రసంగంలో ట్రంప్‌కు పరోక్షంగా గట్టి హెచ్చరిక చేశారు ః “మా ప్రజల అభీష్టంపై దాడి చేయటానికి ప్రజాస్వామ్య వ్యతిరేకులను వారు అంతర్గతంగా ఉండనీ లేక విదేశీయులుగానీ మేము అనుమతించబోము. బ్రెజిలియన్‌ ప్రజాస్వామ్యం బ్రెజిల్‌ వాసులకే చెందుతుంది”. లాటిన్‌ అమెరికాలో వామపక్ష ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ట్రంప్‌ కుట్రలు కూహకాలు చేస్తూ, మితవాదుల్ని గెలిపిస్తేనే అమెరికా సహాయం, లేకుంటే లేదని ప్రజల్ని బెదిరించి ప్రభుత్వాలను మార్చే దుర్మార్గపు విధానం అనుసరిస్తున్నాడు. మత్తుపదార్థాల వ్యాపారం తప్పుడు ఆరోపణతో వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను ఆయన భార్య గిలియా ఫ్లోరెస్‌ను ఈ సంవత్సరం జనవరి 3న ట్రంప్‌ ప్రభుత్వం అపహరించుకు వెళ్లిన దుర్మార్గం తెలిసిందే. అపారమైన వెనిజులా ఆయిలు సంపదను అమెరికా కంపెనీలపరం చేస్తున్నాడు. ఈ బందిపోటుతనాన్ని జాతీయ సార్వభౌమాధికారం ఉల్లంఘనగా అనేక దేశాలు ఖండించినా ట్రంప్‌కు చీమకుట్టినట్లు లేదు. ట్రంప్‌ తొలి పదవీకాలంనుంచీ బ్రెజిల్‌లో మితవాదుల అధికారంకోసం పనిచేశాడు. జైరో బోల్సనారో ఒక పర్యాయం ఎన్నిక కావటంలో ట్రంప్‌ హస్తం ఉంది. తన మిత్రుడు జైరో బోల్సనారోపై కేసులు ఎత్తివేయాలని ట్రంప్‌ నిస్సిగ్గుగా కోరారు. అందువల్ల వర్కర్స్‌ పార్టీ, ఇతర వామపక్షవాదులు లులాను తిరిగి గెలిపించుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.
బ్రెజిల్‌ ఎన్నికల చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే, వామపక్ష వర్కర్స్‌ పార్టీ నేత లులా డ సిల్వా 1989, 1994, 1998 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీచేసి విఫలమైనారు. 2002, 2006 ఎన్నికల్లో విజయం సాధించారు. 2010, 2014 ఎన్నికల్లో ఆయన చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ దిల్మా రౌసెఫ్‌ ఎన్నికైనారు. అయితే పరిపాలనా సంబంధ ఆరోపణలతో ఆమె తొలగించబడ్డారు. ఆమె ఉపాధ్యక్షుడు, సెంట్రిస్ట్‌ బ్రెజిలియన్‌ డెమొక్రటిక్‌ మూవ్‌మెంట్‌కు చెందిన మిచెల్‌ టెమర్‌ అధ్యక్ష స్థానంలోకి వచ్చారు. అధ్యక్ష పదవికి తిరిగి పోటీ చేసేందుకు లులా చేసిన ప్రయత్నం లీగల్‌గా నిరోధించబడింది. ఆపరేషన్‌ కార్‌ వాష్‌ పేరుతో ఆయనపై దురుద్దేశపూర్వకంగా అవినీతి కేసు బనాయించి 2018లో జైల్లో పెట్టారు. ఆ సంవత్సరం సోషల్‌ లిబరల్‌ పార్టీకి చెందిన మితవాది జైర్‌ బోల్సనారో అధ్యక్షునిగా ఎన్నికైనారు. ఆయన 2019లో సోషల్‌ లిబరల్‌ పార్టీని వీడి 2021లో లిబరల్‌ పార్టీలో చేరారు. లులా డ సిల్వపై కేసులకున్న చట్టబద్దతను ప్రశ్నిస్తూ సుప్రీం ఫెడరల్‌ కోర్టు అనేక తీర్పులిచ్చిన పర్యవసానంగా ఆయన 2019లో జైలునుంచి విడుదలైనారు. 2022 అధ్యక్ష ఎన్నికల్లో లులా స్వల్ప మెజారిటీతో బోల్సనారోను ఓడించారు. లులా ప్రమాణస్వీకారం నిరోధించేందుకై బోల్సనారో మద్దతుదారుల్లో కొందరు సైనిక తిరుగుబాటుకు ప్రయత్నించి విఫలమైనారు. సుప్రీంకోర్టు విధించిన శిక్ష కారణంగా 2025లో జైర్‌ బోల్సనారోను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. 2030లోపు రెండవసారి అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా సుప్రీంకోర్టు ఆయనపై ఆంక్ష విధించింది. పర్యవసానంగా ఆయన కుమారుడు సెనెటర్‌ ప్లావియో బోల్సనారో లిబరల్‌ పార్టీనుంచి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు.
అక్టోబర్‌ 4న పోలింగ్‌లో ఓటర్లు అధ్యక్ష పదవితోపాటు, ఉపాధ్యక్ష పదవులకు, దిగువ సభ డిప్యూటీలందరి ఎన్నికకు, గవర్నర్‌ల ఎన్నికకు, సెనేట్‌లోని 81సీట్లలో మూడింటి రెండు వంతులకు ఓటు చేస్తారు. డిప్యూటీల ఛాంబర్‌లోని 513 మంది సభ్యులతో పాటు, రాష్ట్ర అసెంబ్లీలు, ఫెడరల్‌ జిల్లా శాసనసభ డిప్యూటీలు ఎన్నుకోబడతారు. అభ్యర్థుల మధ్య ప్రత్యక్ష పోటీ, పార్టీలకు లభించిన ఓట్ల దామాషాలో ప్రతినిధుల కేటాయింపు పద్ధతుల్లో
ఎన్నుకోబడతారు.
నాల్గవసారి అధ్యక్ష పదవీకాలానికి పోటీ చేస్తున్న అధ్యక్షుడు లులా డ సిల్వ 2025 డిసెంబర్‌ ఆఖరు వారంలో తన ప్రచారం ప్రారంభించారు. 2024 డిసెంబర్‌లో జరిగిన ఆపరేషన్‌లనుబట్టి కొందరు ఆయన ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన తిరిగి ఎన్నికకు తన అభ్యర్ధిత్వం ప్రకటించినాక, రాజధాని రియొ డి జనిరోలో పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌లో కనీసం 120మంది చనిపోయారు. నేరాలపై కఠినంగా వ్యవహరిస్తానన్న సందేశాన్ని ఆయన ఈ ఆపరేషన్‌ ద్వారా పంపారు. ఎన్నికల్లో ఇదొక నిర్ణయాత్మక అంశం కానుంది.