Amrit Bharat Trains: 7 కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి రూట్లతో పాటు ఇతర వివరాలు ఇవే..
Railways Approves 7 New Amrit Bharat Express Trains: Check Routes and Stoppages
Amrit Bharat Trains: దేశవ్యాప్తంగా రైలు కనెక్టివిటీని మరింత బలోపేతం చేసే దిశగా భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 7 కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపినట్లు సమాచారం. తక్కువ, దిగువ-మధ్య తరగతి ప్రయాణికులకు అందుబాటు ధరల్లో వేగవంతమైన, సౌకర్యవంతమైన సుదూర ప్రయాణాన్ని అందించడమే ఈ సర్వీసుల ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది.
వందే భారత్ రైళ్ల తరహాలో ఆధునిక ప్రయాణ సౌకర్యాలను అందించేలా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లను రూపొందిస్తున్నారు. అయితే వందే భారత్‌తో పోలిస్తే సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉండే ఛార్జీలతో ఈ రైళ్లను నడపడం ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణాన్ని మరింత సులభతరం చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది.
కొత్తగా ప్రతిపాదించిన ఏడు రైళ్లలో ధన్‌బాద్–కోయంబత్తూరు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి–గోరఖ్‌పూర్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ప్రత్యేకంగా ఉపయోగపడనున్నాయి.
ధన్‌బాద్–కోయంబత్తూరు రైలు జార్ఖండ్ నుంచి దక్షిణ భారతదేశానికి ప్రయాణించే వారికి ఎంతో కీలకంగా మారనుంది. ఈ రైలు సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, తిరుపతి, కాట్పాడి, సేలం, ఈరోడ్ వంటి ముఖ్యమైన స్టేషన్ల మీదుగా ప్రయాణించేలా ప్రతిపాదించారు.
ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రయాణికులకు చర్లపల్లి–గోరఖ్‌పూర్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. చర్లపల్లి నుంచి బయలుదేరే ఈ రైలు కాజీపేట్, పెద్దపల్లి, మంచిర్యాల, బల్హర్షా, నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్ సెంట్రల్, ఐష్బాగ్, లక్నో, గోండా మీదుగా గోరఖ్‌పూర్ చేరుకోనుంది.
ఏడు రైళ్లు.. ఏయే మార్గాల్లో?
కొత్తగా ఆమోదం పొందినట్లు పేర్కొన్న అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ప్రయాగ్‌రాజ్–లోకమాన్య తిలక్ టెర్మినస్ (LTT) రైలు ఉత్తరప్రదేశ్‌ను ముంబైతో అనుసంధానించనుంది. ప్రయాగ్‌రాజ్, సత్నా, జబల్పూర్, ఇటార్సీ, భుసావల్, కళ్యాణ్ మీదుగా ఈ రైలు ప్రయాణించనుంది.
అలాగే ప్రయాగ్‌రాజ్–ఉద్నా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఉత్తరప్రదేశ్ నుంచి గుజరాత్ వైపు ప్రయాణించే వారికి ఉపయోగపడనుంది. ఫతేపూర్, గోవింద్‌పురి, ఇటావా, తుండ్లా, ఆగ్రా, కోట, రత్లాం, వడోదర వంటి ప్రధాన స్టేషన్లలో ఈ రైలుకు స్టాప్‌లు ఉండనున్నాయి.
సుబేదర్‌గంజ్–LTT అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ కూడా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాలను కలుపుతుంది. ఫతేపూర్, గోవింద్‌పురి, బందా, సత్నా, మైహర్, జబల్పూర్, ఇటార్సీ, భుసావల్, నాసిక్ రోడ్, కళ్యాణ్, థానే మీదుగా ఈ రైలు ముంబైకి చేరుకోనుంది.
ఇక గోరఖ్‌పూర్–ఢిల్లీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలను దేశ రాజధానితో అనుసంధానించనుంది. ఖలీలాబాద్, బస్తీ, గోండా, సీతాపూర్, బరేలీ, మొరాదాబాద్, ఘజియాబాద్ వంటి స్టేషన్లలో ఆగేలా ప్రతిపాదించారు.
అదే విధంగా గోరఖ్‌పూర్–బాంద్రా టెర్మినస్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ గోరఖ్‌పూర్ నుంచి ముంబై వరకు ప్రయాణించనుంది. గోండా, ఐష్బాగ్, కాన్పూర్ సెంట్రల్, తుండ్లా, ఆగ్రా ఫోర్ట్, కోట, రత్లాం, వడోదర, సూరత్, వాపి, బోరివలి వంటి ప్రాంతాలకు కనెక్టివిటీ కల్పించనుంది.
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ల విస్తరణతో దూర ప్రాంతాలకు వెళ్లే కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు, దిగువ-మధ్య తరగతి కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. తక్కువ ఖర్చుతో సుదూర ప్రయాణం చేయడంతో పాటు, ఆధునిక సౌకర్యాలతో కూడిన రైలులో ప్రయాణించే అవకాశం లభించనుంది.
ప్రస్తుతం దేశంలో రైలు ప్రయాణానికి భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో కొత్త సర్వీసులు అందుబాటులోకి వస్తే ప్రధాన మార్గాల్లో ప్రయాణికుల ఒత్తిడిని కొంతవరకు తగ్గించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర, మధ్య, పశ్చిమ, దక్షిణ భారతదేశాల మధ్య రైలు కనెక్టివిటీ మరింత బలోపేతం కానుంది.
అయితే ఈ రైళ్ల ప్రారంభ తేదీలు, పూర్తి టైమ్‌టేబుల్, ఛార్జీలు, వారంలో ఏ రోజుల్లో నడుస్తాయనే వివరాలపై అధికారిక ప్రకటన కోసం ప్రయాణికులు ఎదురుచూడాల్సి ఉంటుంది. రైల్వే శాఖ నుంచి తుది షెడ్యూల్ వెలువడిన తర్వాత పూర్తి వివరాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.
- CJP Protest: ఒకే దేశం, ఒకే ఎన్నిక’ నినాదం వెనుక పెద్ద కుట్ర ఉంది.. కేంద్రంపై విరుచుకుపడిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే
- India Bloc March: ఉద్రిక్తంగా మారిన ఇండియా బ్లాక్ పాదయాత్ర… ‘Gyanesh, it’s done bro’ ప్లకార్డుతో బారికేడ్ పైకి ఎక్కి నిలబడ్డ రాహుల్ గాంధీ…
- ఇండియా బ్లాక్ మార్చ్: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు అదుపులోకి
- Hyderabad Water Crisis: రిజర్వాయర్లు అడుగంటుతున్నాయ్.. హైదరాబాద్‌కు తాగునీటి సంక్షోభం ముంచుకొస్తుందా..?
- Andhra Pradesh: బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం చేసిన కండక్టర్