Skip to content
బిజినెస్ వార్తలు

Gold Demand in India: బంగారం కొనుగోళ్లకు బ్రేక్.. భారత్‌లో భారీగా తగ్గిన పసిడి డిమాండ్..

Prajapaksham 30 Jul 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
Gold Demand in India: బంగారం కొనుగోళ్లకు బ్రేక్.. భారత్‌లో భారీగా తగ్గిన పసిడి డిమాండ్..

Gold Rates Today

Gold Demand in India: భారతీయ సమాజంలో బంగారం కొనుగోళ్లపై నెలకొన్న సాంప్రదాయ ధోరణిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. దేశంలో నిత్యం విపరీతంగా అమ్ముడయ్యే ఆభరణాల విక్రయాలు కొంత మందగించినప్పటికీ.. సురక్షితమైన పొదుపు, వ్యూహాత్మక పెట్టుబడిగా స్వర్ణానికి ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) విడుదల చేసిన ‘Q2 2026 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశంలో పరిమాణం పరంగా మొత్తం బంగారం డిమాండ్ 6 శాతం తగ్గి 131.4 టన్నులకు పరిమితమైంది. అయితే రికార్డు స్థాయి పసిడి ధరల కారణంగా కొనుగోళ్ల విలువ పరంగా మాత్రం దేశంలో చరిత్రలోనే అత్యధికంగా రూ. 1,98,100 కోట్ల వ్యాపారం నమోదు కావడం విశేషం.

ఈ త్రైమాసికంలో నమోదు అయిన 131.4 టన్నుల డిమాండ్ తగ్గుదలకు అనేక కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఏప్రిల్-జూన్ కాలంలో పెద్దగా వివాహ ముహూర్తాలు లేకపోవడం, అధిక పసిడి ధరలతో పాటు కస్టమ్స్ సుంకాల్లో మార్పులు కొనుగోలుదారులను కొంత వెనక్కి తగ్గేలా చేశాయి. అలాగే దేశంలో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించేందుకు, దిగుమతి బిల్లుల భారాన్ని అదుపు చేసేందుకు అనవసరపు బంగారు కొనుగోళ్లను తగ్గించుకోవాలని మే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి కూడా వినియోగదారుల కొనుగోలు ధోరణిపై ప్రభావం చూపింది.

అంతర్జాతీయంగా, దేశీయంగా పెరిగిన ధరల భారం ప్రధానంగా ఆభరణాల వ్యాపారంపై పడింది. గత ఏడాది క్యూ2 లో 88.8 టన్నులుగా ఉన్న ఆభరణాల విక్రయాలు ఈసారి 15 శాతం తగ్గి 75.1 టన్నులకు పడిపోయాయి. అయినప్పటికీ బంగారం కేవలం ఒక నిత్యాలంకరణ వస్తువు మాత్రమే కాదని.. ఆర్థిక అనిశ్చిత పరిస్థితులలో స్థిరత్వం ఇచ్చే ఆస్తి అని భావించిన ప్రజలు ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల వైపు భారీగా మొగ్గు చూపారు. పెట్టుబడి రూపంలో కొనుగోలు చేసే గోల్డ్ బార్లు, నాణేల డిమాండ్ 9 శాతం పెరిగి 50.3 టన్నులకు చేరాయి. ఇక డిజిటల్, పేపర్ గోల్డ్ రూపంలో ఉండే ఈటీఎఫ్‌లలోకి 4.2 టన్నుల మేర కొత్త నిధులు వచ్చి చేరాయి.

మరోవైపు దేశంలోకి దిగుమతి అయ్యే పసిడి పరిమాణం 23 శాతం తగ్గి 98.1 టన్నులకు పరిమితమవ్వగా.. పాత బంగారాన్ని రీసైకిల్ చేసే పరిమాణం కూడా 17 శాతం తగ్గి 19.2 టన్నులకు చేరుకుంది. ఈ సందర్భంగా డబ్ల్యూజీసీ ఇండియా రీజినల్ సీఈఓ సచిన్ జైన్ మాట్లాడుతూ.. గ్రే మార్కెట్ ద్వారా దేశంలోకి అక్రమంగా బంగారం స్మగ్లింగ్ కావడం పరిశ్రమ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కస్టమ్స్ సుంకాలు, స్థానిక ధరల వ్యత్యాసాల కారణంగా ఈ ధోరణి పెరిగే అవకాశముందని.. దానిపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుత గ్లోబల్ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, 2026 ఏడాది మొత్తం మీద భారతదేశంలో పసిడి డిమాండ్ 650 నుండి 750 టన్నుల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని డబ్ల్యూజీసీ అంచనా వేసింది. రాబోయే పండుగల సీజన్, వివాహాల సీజన్లు భారత స్వర్ణ రంగానికి మళ్లీ బలమైన పునరుజ్జీవాన్ని ఇస్తాయని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ త్రైమాసికంలో మొత్తం బంగారం డిమాండ్ 1,269 టన్నుల వద్ద స్థిరంగా కొనసాగింది.