Skip to content
జాతీయం › వార్తలు

వట్టిపోతున్న ఉపాధి వనరులు.. పెరుగుతున్న నిరుద్యోగం

Prajapaksham 29 Nov 2026 0 నిమిషాల పఠనం జాతీయం
వట్టిపోతున్న ఉపాధి వనరులు.. పెరుగుతున్న నిరుద్యోగం

రచయిత: వెంకట్, ఖమ్మం

అనుకున్న మార్గంలో కార్యసాధన సాధ్యం కానప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం ఆనవాయితీ. పాలకులకైతే బాధ్యత కూడా. రెండు దశాబ్దాలుగా నానాటికీ తీసికట్టు నాగంబొట్టు అన్న చందంగా ఉద్యోగ, ఉపాధి వనరులు కుంచించుకుపోయి నిరుద్యోగం పెరిగిపోయి దేశానికి భారంగా మారుతున్న ప్రమాదకర పరిస్థితుల్లోనూ పాలకులు ప్రత్యామ్నాయం గురించి ఆలోచన చేయకపోవడం శోచనీయం. ప్రతియేటా కోట్లాది మంది వివిధ రంగాలలో పట్టభద్రులై ఉద్యోగ అన్వేషణతో బయటకు వస్తున్నారు. ఇందులో సాంకేతిక విద్యను అభ్యసించిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ఒక దశలో సాఫ్ట్‌వేర్ రంగం ఉపాధి కల్పనకు కేంద్రంగా మారి కొంతమేర యువతకు ఉపాధి చూపి ఉపశమనాన్ని ఇచ్చింది. శాస్త్ర సాంకేతిక రంగాలలో వస్తున్న విప్లవాత్మక మార్పులు ఉన్న కాస్త ఉపాధిని సైతం దూరం చేస్తున్నాయి. అనేక సంస్థలు సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులను అన్వయించుకుని క్రమేపీ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తుండగా మరికొన్ని సంస్థలు పనిచేస్తే చేయడం లేదంటే తప్పుకోండి కానీ వేతనాల్లో కోత తప్పదంటూ హెచ్చరిస్తున్నాయి. ప్రైవేటు రంగంలో ఎక్కడ చూసినా ఉపాధిలో కోత తప్ప ఉపాధి రంగం విస్తరించిన దాఖలాలు లేవు. ప్రభుత్వ రంగం మరింత వట్టిపోయింది. కోట్లాది మందికి ఉపాధి చూపగల అనేక సంస్థలు కార్పొరేట్ల చేతుల్లోకి తరలిపోవడం, మరికొన్నింటిలో ప్రైవేటు భాగస్వామ్యం పెరిగిపోవడంతో ప్రభుత్వపరంగా ఉపాధి కల్పన కరువవుతుంది. రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, బ్యాంకింగ్, ఎల్‌ఐసీ, రాష్ట్రానికి సంబంధించి సింగరేణి, ఆర్టీసీ సహా పలు సంస్థలు ఇప్పుడు ఉన్న ఉద్యోగులను తగ్గించుకోవడం తప్ప పెంచే పరిస్థితి లేదు. ఒకప్పుడు లక్షకు పైబడిన ఉద్యోగులతో అలరారిన సింగరేణి ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 35 వేలకు పడిపోయింది. ప్రతియేటా రెండుకోట్ల ఉద్యోగ హామీలతో 12 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన మోదీ కానీ, మూడేళ్ల క్రితం రెండు లక్షల ఉద్యోగాల హామీతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కానీ ఆ దిశగా కార్యాచరణ చేపట్టడం లేదు.

నిర్వీర్యమవుతున్న యువశక్తి

దేశ జనాభాలో సగభాగం కలిగిన యువశక్తి నిర్వీర్యమవుతుంది. ఉన్నత విద్యను అభ్యసించిన ఉపాధి దొరకక తల్లిదండ్రులకు భారంగా మారుతున్నారు. అన్ని అర్హతలు ఉన్న కుటుంబ పోషణార్థం కనీస ఉద్యోగం దొరకని దయనీయ స్థితి నెలకొన్నది. కోట్లాదిమంది యువత నిరుద్యోగులుగా మారడంతో కనీస సంపాదన లేక దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇదే సమయంలో ఆశలు ఉడిగిన యువత సంఘ వ్యతిరేక శక్తులుగా మారుతున్నారు. జూదం, డ్రగ్స్ లేదా ఇతర వక్రమార్గాల ద్వారా డబ్బు సంపాదించే యత్నంలో పట్టుబడి జైలుపాలై తమ విలువైన జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. కొందరు అసాంఘిక శక్తులుగా ముద్ర వేసుకుంటున్నారు. మద్యం, గంజాయి వంటి వాటికి బానిసలై మరికొందరు సంఘానికి భారంగా మారుతున్నారు. ఇటీవల కాలంలో గంజాయి రవాణా, బెట్టింగ్, ఇతర చట్టవ్యతిరేక పనుల్లో దొరికిపోతున్న వారిలో ఉన్నత విద్యావంతులు ఉండటం శోచనీయం. చదువుకు తగ్గ పనిని కూడా ఇప్పుడు నిరుద్యోగులు డిమాండ్ చేయడం లేదు. ఏదో ఒక పని దొరికినా చాలన్న భావన యువతలో పెరిగిపోయిన తరుణమిది.

సాగు సంక్షోభం

దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో 80 శాతానికి పైబడిన జనాభాకు ఉపాధి ఇచ్చిన వ్యవసాయరంగం క్రమేపీ ప్రాధాన్యతను కోల్పోవడంతో పాటు ఆర్థికరంగంలో వ్యవసాయ రంగ వాటా తగ్గుతూ వచ్చింది. సాగు లాటరీగా మారడం, పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితుల నేపథ్యంలో సాగుపై ఆధారపడి జీవించే వారి సంఖ్య 50 శాతం దిగువకు చేరుకుంది. వ్యవసాయ రంగాన్ని ఉపాధి రంగంగా మలచడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారు. దీనితో కష్టాల కార్ఖానాగా మారిన సాగు రంగం నుండి ఏటా కోట్లాది కుటుంబాలు ప్రత్యామ్నాయ రంగాల వైపు మళ్లుతున్నాయి. యువ రైతుల జాడ కనిపించడం లేదు. సాగు చేస్తే ఉన్న ఆస్తి అమ్ముకోవాల్సి వస్తుందన్న భావన నేటి యువతలో ఏర్పడింది. దీనితో వ్యవసాయ రంగం ఉపాధి కల్పించే స్థాయి నుంచి సంక్షోభం వైపుకు అడుగులు వేయడం వెనుక ప్రభుత్వ విధానాలే కారణమన్నది సుస్పష్టం.

ప్రత్యామ్నాయం చూపకపోతే ప్రమాదమే

పాలక వర్గాలు ఉద్యోగ, ఉపాధి కల్పన రంగాలపై దృష్టిసారించడం లేదు. రాజకీయ విమర్శ కాదు కానీ ఎన్నికల సమయంలో వాగ్దానాలతోనో, తాయిలాలతోనో ప్రజలను మభ్యపెట్టడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటను మరిచిపోవడం ఆనవాయితీగా మారింది. గెలుపుపైనే తప్ప ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై దృష్టి సారించకపోవడం దేశ భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరంగా నిరుద్యోగ సమస్య మారనుంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కొరకు ఒక వ్యవస్థను సృష్టించడంలో లేదా నిర్మించడంలోనూ వైఫల్యం దేశ ఆర్థిక వ్యవస్థపై రానురాను తీవ్ర ప్రభావం చూపనుంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో పాలకులు ఓట్ల గురించే కాకుండా దేశ భవిత గురించి కూడా ఆలోచించి ఉపాధి, ఉద్యోగ రంగాలపై దృష్టి సారించాలి. లేదంటే దేశ భవిత ప్రమాదపుటంచుకు చేరక తప్పదు.