జీవించే హక్కుకు ముప్పు తెచ్చిన జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్
dump yard
జి. అనురాధ, ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదారాబాద్‌కు ఆనుకోని ఉన్న మేడ్చల్ మల్కాజిగిరిజిల్లా జవహర్ నగర్‌ను మొత్తం గ్రేటర్ హైదరాబాదుకు డంపింగ్ యార్డుగా మార్చి వేశారు. ప్రజల ను మోసపుచ్చి 2001 లో నాలుగు సం.రాల కాలపరిమితితో అల్వాల్, ఉప్పల్, కాప్రా మున్సిపల్ పరిధి వరకు మాత్రమే ఈ డంపింగ్ యార్డును వినియోగిస్తామని ఆనాడు ప్రజలను నమ్మించారు. అందుకోసం 330 ఎకరాల విస్తీర్ణoలో ఏర్పాటుచేయబడిన డంపింగ్ యార్డును ఫలితంగా లక్షలాదిమంది ప్రజల ఆరోగ్యాలు తీవ్ర ప్రమాదంలో చిక్కుకొన్నాయి. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా ప్రభుత్వాలకు ఏ మాత్రం పట్టింపులేదు. ఈ డంపింగ్ యార్డు వెదజల్లే దుర్వాసనలు, దుర్గంధాల ప్రభావంతో జవహర్ నగర్, దమ్మాయిగూడ, కార్మికనగర్, బాలాజీనగర్, గబ్బిలాల పేట, అంబేద్కర్ నగర్, మల్లారం, రాజీవ్ గాంధీనగర్, శాంతినగర్, ప్రగతినగర్, హరిదాసుపల్లి, చెన్నాయిపల్లి, బిజేఆర్ నగర్, అమ్మద్ గూడ, తిమ్మాయిపల్లి, నాగారం, బండ్లగూడ, రాంపల్లి, యాప్రాల్, సైనికపురి తదితర ప్రాంతాల ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. రాజ్యాంగ సూత్రాలు, పర్యావరణ చట్టాలు, కాలుష్య నియంత్రణచట్టాలు, కోర్టుతీర్పు లు, హక్కులు, అంతర్జాతీయ సూత్రాలు ఎన్నిఉన్నా వాటిని చెత్తబుట్టలో పడేస్తున్నారనేది జవహర్ నగర్ ప్రాంత ప్రజల పరిస్థితినిచూస్తే అర్థమవుతుంది.
2001లో ప్రభుత్వం నాలుగు సంవత్సరాల కాలపరిమితితో జవహర్‌నగర్‌లో మూడు మున్సిపాలిటీలకోసం తాత్కాలిక ప్రాతిపదికపై 330 ఎకరాలలో ఏర్పాటుచేసిన డంపింగ్ యార్డు ఇప్పుడు 400 ఎకరాలకు భారీ డంపింగ్ యార్డుగా పెరిగి పోయింది. రాంకి ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించి మొత్తం భాగ్యనగరంలోని ఘన వ్యర్థాలు, చెత్తా చెదారాన్ని 400లారీలతో ప్రతీదినం 9600 మెట్రిక్ టన్నులు 2001 నుండి రాంకి సంస్థ అక్కడ డంపింగ్ చేస్తున్నది. ప్రస్తుతం ఈ డంపింగ్ యార్డులో ఒక కోటి 50 లక్షలు(15 మిలియన్)మెట్రిక్ టన్నుల పాత వ్యర్థాలు పేరుకుపోయాయి. ఈ డంపింగ్ యార్డు వల్ల భూగర్భజలాలు విషపూరితం అవుతున్నాయి. సుమారు 30లక్షల మందిపైగా ప్రజలు పీల్చేగాలి, తాగేనీరు కలుషితం చేయబడుతున్నాయి.
గ్లోబల్ వార్మిoగ్ కు కారణమయ్యే అత్యంత ప్రమాదకరమైన మీథేన్ వాయువును విడుదల చేయడం తో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలలో జవహర్ నగర్ నాలుగవ స్థానంలో ఉంద ని సర్వేలు తెలుపుతున్నాయి. 2025లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్
(యుసిఎల్ ఏ)కి చెందిన ‘స్టాప్ మీథేన్ ప్రాజెక్ట్’ అనే సంస్థ 18 దేశాలలో కార్బన్ మ్యాపర్ ద్వారా సేకరించిన శాటిలైట్ (ఉపగ్రహ)డేటా ను విశ్లేషించి ప్రపంచంలోనే అత్యధిక మీథేన్ ను విడుదలచేస్తున్న టాప్ 25 వ్యర్ధప్రాంతాల జాబితాను ప్రచురించింది.ఈ జాబితాలో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. ఇక్కడ గంటకు 5.9 టన్నుల మిథెన్ ఉద్గారాలు విడుదలవుతున్నాయని నిర్ధారించబడింది.ల్యాండ ఫీల్డ్ లో 5 టన్నుల మీథేన్ విడుదలచేసే చోట ఒక సంవత్సరానికి వాతావరణానికి చేసే నష్టం 10లక్షల కార్లు విడుదల చేసే పొగకాలుష్యం లేదా 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బొగ్గు ఆధారిత పెద్ద విద్యుత్ కేంద్రం కలిగించే నష్టంతో సమానం.
జవహర్ నగర్ డంపింగ్ యార్డు వలన పర్యావరణానికి తీవ్రమైన ప్రమాదం జరుగుతుంది.అంతేకాకుండా గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ కార్బన్ డయాక్సైడ్ (CO2)కంటే మీథేన్(CH4) వాయువు 20 సంవత్సరాల కాలంలో దాదాపు 86 రెట్లు ఎక్కువ ప్రమాదకరమైనది. ఇది ఇటీవల కాలంలో పెరుగుతున్న భూతాపం, వాతావరణ క్రమపద్ధతి కోల్పోవడం, వానకాలంలో వానలు లేకుండా విపరీతమైన వేడిగాలులు రావడం, ఎప్పుడు భూమి అత్యంత
వేడిగా ఉండటం లాంటి దానికి 45% పైగా మీథేన్ వాయువే కారణం. అంతేకాకుండా ఆక్సిజన్ లేకుం డా వ్యర్ధాలు కుళ్లిపోవడం వల్ల లాండ్‌ఫిల్ లలో మీథేన్ ఉత్పత్తి అవుతుంది. జవహర్ నగర్ డంపింగ్ యార్డు సగటున నెలకు 9 లక్షల 60 వేల m3 కంటే ఎక్కువ ల్యాండ్ ఫీల్ గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మిథైన్ వాయువు(CH4) పరిమాణం 30 శాతం నుండి 63 శాతం వరకు మరియు కార్బన్ డయాక్సైడ్ (CO.2) పరిమాణం 18 శాతం నుండి 42 శాతం వరకు ఉన్నట్లు నిర్ధారించబడింది. ఈ డంపింగ్ యార్డులో నియంత్రణ లేకుండా మీథేన్ పేరుకుపోవడం వల్ల ఆకస్మాత్తుగా మంటలు అంటుకోవడం, భూగర్భంలోనే మంటలు చెలరేగడం వంటి ప్రమాదాలు జరిగి స్థానికంగా ఉంటున్న ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాలలో సేకరించిన భూగర్భ జలాల నమూనాలలో టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్(TDS)టోటల్ హార్డీనెస్, సోడియం(NA+) నైట్రేట్లు (NO.3) క్లోరైడ్ (CI)లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అనుమతించిన పరిమితులకంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. భూగర్భ జలాలలో ఆర్సినిక్, కాడ్మియం, క్రోమియం, రాగి, ఇనుము, సీసం, మాంగనీస్, జింక్ వంటి భారలోహాలు(Heavy Metals) కనుగొనబడ్డాయి. రోగ నిరోధకశక్తిని నిర్మూలించి కేన్సర్‌కు కారణం అయ్యే ప్రమాదకర క్లోరినేషన్ బై-ప్రొడక్ట్ ట్రైహాలో మీథేన్ నీటిలో ఉన్నట్లు నిర్ధారించబడిం ది. వాటర్ క్వాలిటీ ఇండెక్స్(WQI) విశ్లేషణ ప్రకారం ఈ ప్రాంతం చుట్టుపక్కల 75శాతం నీటినమూనాలు అత్యంత అధ్వానంగా(poor)గా ఉన్నాయని ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (BIS) నిబంధనల ప్రకారం ఇవి తాగడానికి ప్రమాదమని, కనీసం ఇంట్లో వాడుకొని అవసరాలు తీర్చుకోవడానికి ఏమాత్రం ఉపయోగించకూడనివని తేలింది.
చట్టాలు ఎన్నో ఉన్నా అవి అమలుకు నోచుకోవు
ఘన వ్యర్ధాల నిర్వహణ నిబంధనలు 2016, రూల్ 24 ప్రకారం డంపింగ్ యార్డులు చెరువులకు, నదులకు నివాస ప్రాంతాలకు, రహదారులు, తాగునీటి బావులకు చాలా దూరంలో ఏర్పాటు చేయాలి. జవహర్ నగర్లో ఈ నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నారు. సామర్థ్యం నిండిన వెంటనే శాస్త్రీయ పద్ధతిలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని మూసివేసి కనీసం 15 సంవత్సరాలపాటు పర్యవేక్షించాలని ఈ నిబంధనలు చెప్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986 నిబంధనలకు విరుద్ధంగా గాలి, నీరు, మట్టిని కలుషితం చేయడాన్ని ఈ చట్టంలోని సెక్షన్ 7 మరియు 17 ప్రకారం నిషేధించడం జరిగింది. ఇది నేరపూరిత చర్యగా పరిగణించబడుతుంది. నీరు కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం,1974 భూ గర్భ జలాల్లోకి మరియు 40కిలోమీటర్ల పరిధిలోని చెరువుల్లోకి లీచేట్ విషద్రవాలను వదలడం ఈ చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం నేరమే అవుతుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 మరియు సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక తీర్పుల ప్రకారం(ఉదా. మెహత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా)జీవించే హక్కులో స్వచ్ఛమైన గాలి,నీరు, పర్యావరణ హక్కు కూడా భాగమే. ఇంతే కాకుండా పలువురు స్వతంత్ర నిపుణుల బృందాల సైతం కొన్ని ధ్రువీకరణలు చేశాయి.
2025 అక్టోబర్ 28న ఐఐటి బొంబాయి నిపుణుల కమిటీ సిపిసిబికి సమర్పించిన నివేదికలో జిహెచ్ఎంసి వ్యర్ధాల నిర్వహణపద్ధతులు గాలి, నీటి కాలుష్యానికి కారణమవుతున్నాయని పేర్కొంటూ పునరుద్ధరణ ఖర్చులను జిహెచ్ఎంసి వారే భరించాలని స్పష్టం చేసింది. అక్రమంగా ఫ్లైయాస్ పారబోయడం, అనుమ తించదగిన స్థాయి కంటే వెయ్యిరేట్లు అధికంగా కాడ్మియం ఉండటం, పర్యవేక్షణలో రాష్ట్ర సంస్థల వైఫల్యాన్ని సిపిసిబి నివేదిక ఎత్తిచూపింది. గంటకు 5.9 టన్నుల మీథేన్ విడుదలవుతుందని ఇది ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఉద్గార ప్రాంతమని యుసిఎల్ ఏ స్టాప్ మీథేన్ ప్రాజెక్టు సర్వే లు తేల్చి చెప్పాయి. భూగర్భ జలాలు 75% పనికిరానివని తాగటానికి వాడుకోవటానికి ఎంతమాత్రమూ ఉపయోగపడవని డిస్కవరీ అప్లయిడ్ సైన్సెస్ పరిశోధనలో తేలింది.
జవహర్ నగర్ ప్రాంత ప్రజానీకం పరిసర గ్రామాల ప్రజలు ఉద్యోగం కావాలని, భూములు ఇవ్వాలని ఆలోచించడం లేదు. కనీసం ప్రాణంతో బతికి ఉండాలని ఆలోచన చేస్తున్నారు. బ్రతికి ఉండాలంటే డంపింగ్ యార్డ్‌ను వెంటనే మూసివేయాలని దాని ఫలితంగా ప్రమాదాలు తలెత్తకుండా ఉండే జాగ్రత్తలను అన్ని రకాలుగా తీసుకోవాలని, ఇప్పటి కే అనారోగ్యం బారినపడిన ప్రజలందరికీ తగిన వైద్యాన్ని ప్రభుత్వం జిహెచ్ఎంసి ద్వారానే అందించాలని, జవహర్ నగర్ ప్రాంతంలో గతంలో నిర్ణయించిన ప్రకారం వంద పడకల హాస్పిటల్‌ను నిర్మించాలని కోరుకుంటున్నారు. రాజకీయాలకతీతంగా కేవలం ప్రాణంతో ఉండేందుకోసం అఖిలపక్షంగా ఏర్పడి చేస్తున్న ఆందోళన చేస్తున్నారు. 25 సంవత్సరాలుగా దగాపడిన పేదల ప్రాణాలను నిలపాలి.అక్రమంగా కొనసాగిస్తున్న డంపింగ్ యార్డ్‌ను ఎత్తివేయాలి. బడుగు బలహీన వర్గాలకు చెందిన కార్మిక, దిన కూలి, పేద ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత జిహెచ్ఎంసిపై, రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ప్రాణంతో బతికి ఉండేందుకు వారుచేస్తున్న ఆందోళనలో చట్టబద్ధత, న్యాయబద్ధత ఉంది. ప్రజా ఆందోళన ఆగ్రహంగా మారకుండా ఉండేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది.