Skip to content
జాతీయం › వార్తలు

నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. శుక్రవారం కేంద్ర కేబినెట్ భేటీ

Krishna Rao 27 Nov 2026 0 నిమిషాల పఠనం జాతీయం
నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. శుక్రవారం కేంద్ర కేబినెట్ భేటీ

Parliament

న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారం వెల్లడించారు. లోక్‌సభ సమావేశాలు నవంబర్ 30న ప్రారంభం కానుండగా, రాజ్యసభ సమావేశాలు డిసెంబర్ 2న మొదలవుతాయని తెలిపారు. అవసరమైన ప్రభుత్వ కార్యకలాపాల కోసం ఈ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ మేరకు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌లను ప్రభుత్వం కోరినట్లు కిరణ్ రిజిజు ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. సభా కార్యకలాపాలను బట్టి రెండు సభల సమావేశాలు డిసెంబర్ 3న ముగిసే అవకాశం ఉందని తెలిపారు. అయితే, ప్రత్యేక సమావేశాల్లో చర్చించనున్న అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

శుక్రవారం కేంద్ర కేబినెట్ కీలక భేటీ

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ముందు శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రివర్గం కీలక సమావేశం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మధ్యాహ్నం 1 గంటకు సేవా తీర్థ్‌లో ఈ భేటీ నిర్వహించనున్నట్లు సమాచారం.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ కీలక భేటీకి మంత్రులందరూ హాజరుకావాలని సమాచారం పంపినట్లు వెల్లడించాయి.

డీలిమిటేషన్ బిల్లుపై కాంగ్రెస్ అభ్యంతరం

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ స్పందించారు. డీలిమిటేషన్ బిల్లును ఆమోదించేందుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆరోపించారు.

ఏప్రిల్ 14, 2026న అంబేడ్కర్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లులను బహిరంగపరిచిందని, ఏప్రిల్ 17న అవి విఫలమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సమావేశాలను ప్రకటించడం ద్వారా రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.

ముగియని వర్షాకాల సమావేశాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసి 105 రోజులు గడిచినా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వాటిని అధికారికంగా ప్రొరోగ్ చేయలేదని సమాచారం. దీంతో ఇప్పటికే కొనసాగుతున్న సమావేశాల పరిధిలోనే ప్రత్యేక సమావేశాలను నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

కొత్త సమావేశాన్ని ప్రారంభించాలంటే కనీసం 14 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని, ప్రస్తుత సమావేశాలనే తిరిగి కొనసాగిస్తే రెండు రోజుల ముందస్తు నోటీసుతో నిర్వహించవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

గత ఏడాది నవంబర్ 8న పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈ ఏడాది శీతాకాల సమావేశాల తేదీలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

డీలిమిటేషన్ బిల్లులో కీలక అంశం

డీలిమిటేషన్ బిల్లులో భాగంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే ప్రతిపాదన ఉంది. ప్రతి రాష్ట్రానికి జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు ఉండే విధంగా ఈ బిల్లు రూపొందించినట్లు సమాచారం.

దీంతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని లోక్‌సభ నియోజకవర్గాల జనాభా దాదాపు సమానంగా ఉండేలా పునర్విభజన జరిగే అవకాశం ఉంది. ఈ అంశం రాజకీయంగా కీలకంగా మారడంతో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

ట్యాగ్‌లు: Parliament