Skip to content
ఆంధ్రప్రదేశ్ › వార్తలు

CII Summit 2026: ఏపీలో కియా రూ. 18 వేల కోట్ల పెట్టుబడి ప్రకటన.. 12 వేల ఉద్యోగాలు కల్పిస్తామని సీఐఐ సదస్సులో వెల్లడి..

jagan 12 Nov 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
CII Summit 2026: ఏపీలో కియా రూ. 18 వేల కోట్ల పెట్టుబడి ప్రకటన.. 12 వేల ఉద్యోగాలు కల్పిస్తామని సీఐఐ సదస్సులో వెల్లడి..

CII Summit 2026

CII Summit 2026: పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ వేగంగా దూసుకెళ్తున్న తీరుపై దేశ, విదేశీ పారిశ్రామిక దిగ్గజాలు ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దార్శనికత, ప్రభుత్వ పారదర్శక విధానాలు రాష్ట్రంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాయని కొనియాడారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సు వేదికగా పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో తమ భవిష్యత్ ప్రణాళికలు, భారీ పెట్టుబడుల వివరాలను అధికారికంగా ప్రకటించారు. కియా ఇండియా, జీఎంఆర్ గ్రూప్, సాగర్ డిఫెన్స్ వంటి దిగ్గజ సంస్థల అధినేతలు ఏపీ ప్రభుత్వ పనితీరును ప్రత్యేకంగా అభినందించారు.

ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (PPP) విజయానికి ఆంధ్రప్రదేశ్‌లోని కియా పరిశ్రమే ప్రత్యక్ష ఉదాహరణ అని కియా ఇండియా సీఈఓ, ఎండీ గ్వాంగ్ లీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై, ఏపీ ప్రభుత్వంపై ఉన్న పూర్తి భరోసాతోనే తాము మరోసారి భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్లాంట్‌ను విస్తరించి, ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయించామని, ఇందుకోసం రూ. 18 వేల కోట్ల భారీ పెట్టుబడులు పెట్టబోతున్నామని ప్రకటించారు.

ఈ విస్తరణ ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా 12 వేల మందికి పైగా యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏటా 4 లక్షల వాహనాలను ఉత్పత్తి చేస్తూ ఏపీ ఆటోమొబైల్ ఎకో సిస్టమ్‌కు కియా అండగా నిలుస్తోందని, ఇక్కడ తయారైన కార్లను 100కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తూ ‘మేక్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులను ప్రపంచానికి అందిస్తున్నామని గర్వంగా చెప్పారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా సుస్థిర ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలోనూ భాగస్వాములమవుతామని ఆయన వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లో కేవలం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ మాత్రమే కాదని, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నడుస్తోందని జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ గ్రంథి మల్లిఖార్జునరావు ప్రశంసించారు. ఒక పెట్టుబడిదారుడిగా చెబుతున్నానని, ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తోందని కొనియాడారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కు ఒక ప్రధాన ఆర్థిక చోదక శక్తిగా (ఎకనామిక్ ఇంజన్) మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గతంలో తాము శంషాబాద్ విమానాశ్రయం గురించి ఆలోచించి నిర్మించడం వల్లే ఇప్పుడు అది తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరుగా మారిందని, అదే తరహాలో భోగాపురం విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి కీలకం కానుందని వివరించారు. అంతేకాకుండా, రాష్ట్రంలో ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు జీఎంఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో ఒక ప్రతిష్టాత్మక ఏరోసిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

మహారాష్ట్ర తన జన్మభూమి అయితే, ఆంధ్రప్రదేశ్ తన భాగ్య భూమి అంటూ సాగర్ డిఫెన్స్ సీఈఓ నికుంజ్ పరాశర్ భావోద్వేగంగా ప్రసంగించారు. మారిటైమ్ టెక్నాలజీ రంగంలో ఐదో పారిశ్రామిక విప్లవం రాబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ చెబుతుంటారని, ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైందని అన్నారు. అందుకే ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చామని తెలిపారు. రక్షణ రంగంలో స్థానిక యువతను భాగస్వాములను చేస్తూ ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యం దిశగా తమ సంస్థ ముందుకు వెళుతోందన్నారు. తీరప్రాంత రక్షకులైన మత్స్యకారుల కోసం ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేయడం ద్వారా సంపద సృష్టించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని నికుంజ్ పరాశర్ వివరించారు.