నియోజకవర్గ నిధులు విడుదల చేయకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేస్తా: కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
నియోజకవర్గ నిధులు విడుదల చేయకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేస్తా: కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జె. అనిరుధ్ రెడ్డి తన నియోజకవర్గానికి అభివృద్ధి నిధుల విడుదల, పెండింగ్ బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా అభివృద్ధి పనులకు నిధులు అందకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మంత్రుల నియోజకవర్గాలకే నిధులు విడుదల చేస్తున్నారా? ఇతర ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. ఇటీవల ఓ కాంట్రాక్టర్ మరణించిన తర్వాత ఆయనకు రావాల్సిన రూ. 5 కోట్ల బిల్లు చెల్లించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. “అంటే, నేను చనిపోతేనే నా నియోజకవర్గ పనులకు నిధులు మంజూరు చేస్తారా?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన నియోజకవర్గంలో మీడియాతో మాట్లాడిన అనిరుధ్ రెడ్డి.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు సమాంతరంగా అభివృద్ధి చెందితేనే ప్రభుత్వం మనుగడ సాగించగలదని పేర్కొన్నారు. జడ్చర్ల నియోజకవర్గానికి సాగునీరు అందించే విషయంలో పార్టీలకు అతీతంగా పోరాడతానని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల కోసం చేసే పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. నియోజకవర్గంలో పూర్తయిన, ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇంతకుముందు రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగూడ, గుండ్లపోట్లపల్లి తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం, పూర్తయిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల విడుదల కోసం అవసరమైతే 30 వేల మంది ప్రజలతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని అనిరుధ్ రెడ్డి ప్రకటించారు.