Abhijeet Dipke Gets Bail: ‘లెహ్రా దో తిరంగా’ మార్చ్ కేసులో అభిజీత్ దీప్కేకు షరతులతో కూడిన బెయిల్.. ఏడాది పాటు శాంతిభద్రతలకు భంగం కలిగించకూడదని షరతు..
Abhijeet Dipke
Abhijeet Dipke Gets Bail: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ నిరసనల్లో పాల్గొంటున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు ఢిల్లీలోని ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ (SEM) కోర్టు సంచలన ఊరటనిచ్చింది. శుక్రవారం పోలీసులు అరెస్టు చేసిన ఆయనకు శనివారం షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం కఠిన నిబంధనలను పాటించాలని స్పష్టం చేసిన కోర్టు, దీప్కే తప్పనిసరిగా ‘పీస్ బాండ్’ (Peace Bond) పై సంతకం చేయడంతో పాటు రూ. 50,000 సెక్యూరిటీ డిపాజిట్ను సమర్పించాలని ఆదేశించింది. పీస్ బాండ్ పూర్తి చేసి, సెక్యూరిటీ డిపాజిట్ సమర్పించిన తక్షణమే ఆయనను కస్టడీ నుంచి విడుదల చేయనున్నట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి.
దేశ రాజధానిలోని కన్నాట్ ప్లేస్, సెంట్రల్ పార్క్ ప్రాంగణంలో సీజేపీ ఆధ్వర్యంలో ‘లహారా దో తిరంగా’ పేరుతో భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో శాంతిభద్రతలకు భంగం కలగకుండా చూసేందుకు అభిజీత్ దీప్కేను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో సెక్షన్ 163 అమలులో ఉన్నందున, అనుమతి లేకుండా చేపడుతున్న యాత్రను నిలిపివేయాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చినా ఆయన ముందుకు సాగడంతో ఢిల్లీలోని ఝండేవాలన్ సమీపంలో అరెస్ట్ చేశారు. గతంలో అక్టోబర్ 10న జారీ చేసిన బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆయనపై ఈ చర్యలు తీసుకున్నారు. అయితే, పోలీసుల అరెస్టును సవాలు చేస్తూ సీజేపీ న్యాయవాది రత్నా సింగ్ శనివారం స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ బెయిల్ పిటిషన్పై వాదనలు విన్న న్యాయస్థానం.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం హక్కే అయినప్పటికీ, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడడం అంతే ముఖ్యమని పేర్కొంది. భవిష్యత్తులోనూ శాంతియుత వాతావరణానికి సహకరిస్తానని పీస్ బాండ్ ద్వారా రాతపూర్వక హామీ ఇవ్వాలని సూచిస్తూ బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు, ఇదే ‘లహారా దో తిరంగా’ నిరసనల సందర్భంగా మండి హౌస్ సమీపంలో పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) అధ్యక్షురాలు నేహా బోరాను కూడా శనివారం పోలీసులు విడుదల చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపు కోసం విపక్షాలు, విద్యార్థి సంఘాలు చేపడుతున్న ఈ ఆందోళనలు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.