Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

పశ్చిమ బెంగాల్‌లో దుర్గా పూజ

Prajapaksham 17 Oct 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
పశ్చిమ బెంగాల్‌లో దుర్గా పూజ

bjp and durga puja

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో దసరా సందర్భంగా దుర్గా పూజ అతిపెద్ద పండుగ. ఒకనాడు జమీందార్లు, పెద్దపెద్ద వ్యాపారుల ప్రాసాదాల్లో జరిగే ఉత్సవాలు కాలక్రమంలో రాజకీయాలకనుగుణంగా అధికారంలో ఉన్న పార్టీ అధిపత్యంలోకి వెళ్లిపోయాయి. మూడు దశాబ్దాల వామపక్ష సంఘటన పరిపాలన కాలంలో కూడా పాలక పార్టీ నేతలు ప్రత్యక్షంగా ఉత్సవాల నిర్వహణలో పాల్గొనకపోయినా, ఆ ప్రజా ఉత్సవంలో వారి అనుయూయులు నిర్వాహకులుగా దాన్ని విజయవంతం చేసేవారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ 15 సంవత్సరాల పరిపాలనలో ఉత్సవాలను తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ సంవత్సరం మే నెలలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. నగరంలోని కొన్ని అతిపెద్ద సాముదాయక పూజ మండపాల పోషకులు మారిపోయారు. ప్రజలతో దగ్గరి సంబంధానికి ఇంతకుమించిన అవకాశం రాదు కదా! 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఓటమి దరిమిలా పార్టీ చీలిపోయినందున రాష్ట్రమంతటా పూజా మంటపాల్లో గత తృణమూల్‌ అర్గనైజర్లను తొలగించి పాలక బిజెపి వారు వాటిని స్వాధీనం చేసుకున్నారు. బెంగాల్‌లో ఈ అతిపెద్ద హిందూ పండుగ నిర్వహణను తమ చేతిలోకి తీసుకోవటం తమ హక్కుగా బిజెపి భావించింది. ఏమాత్రం ప్రతిఘటన ఎదురుకాలేదు. మమతా బెనర్జీ తృణమూల్‌ కాంగ్రెస్‌ పెద్ద నాయకులు చాలా మంది రాష్ట్రం వదిలివెళ్లారు. ఇప్పుడు ఎటు చూసినా బిజెపియే.
భిన్న మతాలకు, సంస్కృతులు, ఆచార వ్యవహారాలకు నిలయమైన, భిన్నత్వంలో ఏకత్వంతో భాసిల్లుతున్న భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతం లో ఒక్కో పండుగ పెద్ద ఎత్తున పాటిస్తుంటారు. ఉదాహరణకు మన తెలంగాణకు బతుకమ్మ ప్రత్యేకం. మరికొన్ని రాష్ట్రాలు కొన్నింటిలో దసరా, మరికొన్నింటిలో దీపావళి, హిందీ రాష్ట్రాల్లో ఈ పండుగలతోపాటు ఛాత్‌ ఎవరి వేడుక వారిది. ముస్లింలు, క్రైస్తవులు, పార్శీలు, కొన్ని ఆదివాసీ జాతులు వారి పండుగలను వేడుకగా జరుపుకుంటారు. ఇక హిందువుల పెద్ద ఉత్సవాల్లో వినాయకచవితి దానికదే సాటి. తర్వాత అంతటి ప్రాముఖ్యతగలది దుర్గా పూజ వీటన్నింటి సమాహారమే భారతీయ సంస్కృతీ విశిష్టత.
ప్రస్తుత దసరా ఉత్సవాలకు తలమానికమైన దుర్గాపూజను పశ్చిమ బెంగాల్‌లో ఊరురా వాడవాడలా పెద్ద పండుగగా విరివిగా జరుపుకుంటారు. ఒకనాడు, బ్రిటిష్‌వారి ఈస్ట్‌ ఇండియా కంపెనీ సేవలో తరించి లబ్ధి పొందిన జమిందార్లు, బడా వ్యాపారుల పూర్వీకుల లోగిళ్లలో పెద్ద ఎత్తున జరిపేవారు. తెల్లదొరల నుంచి లబ్ధి పొందడానికి ఈ ఉత్సవాన్ని ఉపయోగించుకునేవారు. కలకత్తా ఉత్తర, మధ్య ప్రాంతాల్లో నివసించే ధనికులు, ప్రముఖులు దుర్గా పూజను కడువేడుకగా జరపడంలో పోటీపడేవారట. పదవుల్లో ఉన్న ఇంగ్లీషువారిని ఆహ్వానించడంలో కూడా పోటీ ఉండేదట. రాబర్ట్‌ క్లువ్‌, వార్రెన్‌ హేస్టింగ్స్‌ను తమ సోమబజాబ్‌ ప్రాసాదానికి రప్పించిన ఘనత జమీందారు నాబకృష్ణదేవ్‌కు దక్కింది. ప్లాస్లీ యుద్ధంలో విజయం పొందటంలో బ్రిటిష్‌వారికి వెన్నుదన్నుగా నిలబడి ఆయన పేరు ప్రఖ్యాతి పొందారు. (నవాబు ఆఫ్‌ బెంగాల్‌ సిరాజ్‌ ఆయన ఫ్రెంచి మిత్రులతో ప్లాసీ వద్ద రాబర్ట్‌ క్లైైవ్‌ నాయకత్వంలో జరిగిన యుద్ధంలో బ్రిటీష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ 1757 జూన్‌ 23న విజయం సాధించింది. తదుపరి 100 సంవత్సరాల్లో తెల్లదొరలు భారత ఉపఖండంలోని మిగతా ప్రాంతాలకు, బర్మాకు విస్తరించారు). నాబకృష్ణదేవ్‌ కుటుంబం పాలకులకు అణిగిమణిగే ఉండే సాంప్రదాయం వందేళ్లు తదుపరి కూడా కొనసాగింది. 1857లో తొలి స్వాతంత్య్ర పోరాటంలో భారత సైనికులను అణిచివేసి ఇంగ్లీషువారు విజయం సాధించిన ఉత్సవం కూడా ఆ ప్రాసాదంలో జరిపారు.
కాలం గడిచింది. స్వాతంత్య్ర పోరాటం ఉధృతం కావటంతో రాజకీయ నాయకులు ఈ ఉత్సవాల్లో ప్రవేశించారు. సుభాష్‌ చంద్రబోస్‌ కాక పూర్వం సిమ్లా బాయం శానిటీస్‌ కమ్యూనిటీ దుర్గా పూజలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన బోస్‌ ఫార్వర్డ్‌ బ్లాక్‌ ఏర్పాటు చేశారు. కాళీఘాట్‌ ఫైర్‌ స్టేషన్‌ సమీపంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికీ పెద్ద ఎత్తున కమ్యూనిటీ పూజ జరుగుతుంది. 1972 మధ్య కాంగ్రెస్‌ ప్రభుత్వంలో యువ మంత్రి సుబ్రతా ముఖర్జీ గరియాహాట్‌ జంక్షన్‌ ఉత్సవం నిర్వహించారు. లెఫ్ట్‌ ఫ్రంట్‌, తృణమూల్‌ ప్రభుత్వాల కాలంలోనూ ఆయన మరణం వరకు ఆ పూజకు ప్రేరణగా ఉన్నారు. లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ భావజాలంతో ఈ పూజలు పొసగనివి అయినా శ్రీభూమి స్పోర్టింగ్‌ క్లబ్‌లో పూజలో పాల్గొనేందుకు క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి సుభాష్‌ చక్రవర్తిని సిపిఐ(ఎం) అనుమతించింది. నాస్తిక కామ్రేడ్స్‌ పూజలో పాల్గొనకపోయినా, పూజ పెండాల్స్‌ సమీపంలో స్టాల్స్‌ ఏర్పాటు చేసి పార్టీ సాహిత్యం, మున్షీ ప్రేమ్‌చంద్‌, లెనిన్‌ రచనలు అమ్మేవారు. ఈ సంవత్సరం సిపిఐ(ఎం) స్టాల్‌కు బిజెపి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో వారు హైకోర్టుకు వెళ్లి అనుమతి పొందారు. పండుగలు, ప్రజా ఉత్సవాల్లో ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించటం, సాహిత్యం విక్రయించడం కమ్యూనిస్టుల సాంప్రదాయం. ఇప్పుడు మరుగునపడిన ఈ సాంప్రదాయాన్ని పునరుద్ధరించడం అవసరం. కమ్యూనిస్టులు ఎప్పుడూ నీటిలో చేపలా ప్రజల మధ్య ఉండాలి. ఆధ్యాత్మికవాదం వేళ్లూని ఉన్న మనదేశంలో పండుగలు, మత ఉత్సవాలు పెద్ద ఎత్తున ప్రజలు సమీకరించబడే సందర్భాలు. ప్రజల్లో హేతువాదదృక్పథం పెంపొందించేందుకు సిద్ధాంతరీత్యా, ప్రచారం ద్వారా కృషి చేస్తూనే సామూహిక, సాముదాయక కార్యక్రమాల్లో ప్రజల మధ్య ఉండటం ప్రజాసంబంధాలను పెంపొందిస్తుంది.