Skip to content
జాతీయం › వార్తలు

Tiranga Yatra Row: సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్.. తిరంగా యాత్రకు ముందు అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు

jagan 16 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Tiranga Yatra Row: సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్.. తిరంగా యాత్రకు ముందు అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు

Abhijeet Dipke

Tiranga Yatra Row: దేశ రాజధాని ఢిల్లీలో ‘లహారా దో తిరంగా’ ర్యాలీ పిలుపు సంచలనం సృష్టిస్తున్న వేళ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు ముందస్తు చర్యగా అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం కన్నాట్ ప్లేస్ సమీపంలోని సెంట్రల్ పార్క్ వేదికగా ‘త్రివర్ణ యాత్ర’ నిర్వహించేందుకు ఇంటి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఆయనను పోలీసులు అడ్డుకుని కస్టడీలోకి తీసుకున్నారు. ఢిల్లీలోని సున్నితమైన ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసు యంత్రాంగం స్పష్టం చేసింది.

అంతకుముందే, కన్నాట్ ప్లేస్ , సెంట్రల్ పార్క్ ప్రాంతాల్లో ఎటువంటి బహిరంగ సభలు, ప్రదర్శనలు లేదా త్రివర్ణ యాత్రలు నిర్వహించవద్దని హెచ్చరిస్తూ ఢిల్లీ పోలీసు ప్రత్యేక బృందం అభిజీత్ దీప్కేకు అధికారిక నోటీసులు జారీ చేసింది. సదరు ప్రాంతంలో ప్రస్తుతం భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (గతంలో CrPC) సెక్షన్ 163 అమలులో ఉందని, అందుకే ఎటువంటి ర్యాలీలకు అనుమతి లేదని తేల్చిచెప్పారు.

అయినప్పటికీ, చేతిలో జాతీయ జెండా పట్టుకుని, మహాత్మా గాంధీ చిత్రం ముద్రించిన టీ-షర్టు ధరించి దీప్కే తన నివాసం నుంచి బయటకు రాగానే పోలీసులు వాహనంలోకి తరలించారు. ఈ సందర్భంగా సీజేపీ మద్దతుదారులు పోలీసు వాహనాన్ని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

అదుపులోకి తీసుకునే సమయంలో అభిజీత్ దీప్కే , పోలీసు ఉన్నతాధికారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తాను పట్టుకున్నది జాతీయ జెండా అని, ఏ రకమైన చట్టాన్ని ఉల్లంఘించని పక్షంలో తనను ఎందుకు నిర్బంధిస్తున్నారని ఆయన పోలీసులను నిలదీశారు.

దీనికి స్పందించిన అధికారి.. కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో సెక్షన్ 163 అమల్లో ఉంది కాబట్టి, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నివారించేందుకు మిమ్మల్ని ముందుజాగ్రత్త చర్యగానే నిర్బంధిస్తున్నాం” అని స్పష్టం చేశారు. నేతను పోలీసులు తీసుకెళ్లినప్పటికీ, జాతీయ జెండాలతో శాంతియుతంగా తమ త్రివర్ణ ర్యాలీని కొనసాగించి తీరతామని సీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు ప్రకటించారు.