Meerut Snakebite Murder Case: భర్తను హత్య చేసి పాముకాటుగా చిత్రీకరణ.. భార్య, ప్రియుడికి ఉరిశిక్ష విధించిన మీరట్ కోర్టు..
Meerut Snakebite Murder Case
Meerut Snakebite Murder Case: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లా కోర్టు.. దారుణ హత్య కేసుకు సంబంధించి సంచలనాత్మకమైన తీర్పును వెలువరించింది. కట్టుకున్న భర్తను అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని అత్యంత దారుణంగా హత్య చేసిన భార్యకు, ఆమె ప్రియుడికి జిల్లా అదనపు సెషన్స్ న్యాయమూర్తి (కోర్టు-12) జైవీర్ సింగ్ నగర్ శుక్రవారం మరణశిక్ష (ఉరిశిక్ష) విధిస్తూ తీర్పు చెప్పారు. మీరట్ న్యాయస్థాన చరిత్రలోనే కేవలం రెండు రోజుల వ్యవధిలో భర్తను హత్య చేసిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష పడటం ఇది వరుసగా రెండో కావడం గమనార్హం.
ఈ భయంకరమైన హత్య కేసు వివరాల్లోకి వెళితే.. గతేడాది ఏప్రిల్ 17న అమిత్ కశ్యప్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. మృతుడి భార్య రవిత, ఆమె ప్రియుడు అమర్దీప్ ఇద్దరూ కలిసి పథకం ప్రకారం అమిత్ కశ్యప్ను గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత ఈ దారుణాన్ని సహజ మరణంగా, పాము కాటు మరణంగా చిత్రీకరించేందుకు పక్కా ప్లాన్ వేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహం ఉన్న బెడ్ పక్కనే ఒక విష సర్పాని తెచ్చి వదిలిపెట్టారు. అయితే, పోస్టుమార్టం నివేదికతో వారి నాటకానికి తెరపడింది. మృతుడి శరీరంలో ఎక్కడా పాము కాటు గాయాలు లేవని, శ్వాస ఆడక గొంతు నులమడం వల్లే ప్రాణాలు పోయాయని వైద్యులు కచ్చితంగా ధృవీకరించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, రవిత , అమర్దీప్ అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక ఆధారాలు లభించడంతో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేవలం 60 రోజుల్లోనే వేగవంతంగా చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు విచారణ సమయంలో నిందితులు ఇద్దరూ వేర్వేరు జైళ్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. విచారణ ముగింపు దశలో న్యాయమూర్తి జైవీర్ సింగ్ నగర్ వారి నేరం , శిక్షపై ప్రశ్నించగా, తాము చేసిన దారుణానికి పశ్చాత్తాపపడుతున్నామని కన్నీరుమున్నీరయ్యారు. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, వారి బాధ్యతను బంధువులు చూసుకుంటారని రవిత కోర్టుకు తెలపగా.. తన ఇంట్లో వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారని వారిని ఆదుకోవాలని అమర్దీప్ విజ్ఞప్తి చేశాడు.
అయితే, సమాజంలో నేరాలను అరికట్టడానికి, ఇటువంటి క్రూరమైన నేరాలకు కఠినమైన శిక్షే సరైన సమాధానమని భావించిన న్యాయమూర్తి నిందితులిద్దరికీ మరణశిక్ష ఖరారు చేశారు. కాగా, రెండు రోజుల క్రితమే మీరట్లో తీవ్ర కలకలం రేపిన ప్రసిద్ధ ‘బ్లూ డ్రమ్ మర్డర్’ కేసులో కూడా భర్తను చంపి డ్రమ్లో దాచిన భార్య రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలకు మీరట్ కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే.