Skip to content
జాతీయం › వార్తలు

Prashant Bhushan’s Comments: ప్రశాంత్ భూషణ్ అధికార మార్పిడి వ్యాఖ్యలతో విభేదించిన అభిజిత్ దీప్కే..సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగిండచడమే మా నిరసనల ఉద్దేశమని వెల్లడి..

jagan 16 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Prashant Bhushan’s Comments: ప్రశాంత్ భూషణ్ అధికార మార్పిడి వ్యాఖ్యలతో విభేదించిన అభిజిత్ దీప్కే..సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగిండచడమే మా నిరసనల ఉద్దేశమని వెల్లడి..

CJP Meeting

Prashant Bhushan’s Comments: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను ఆయన పదవి నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, సీజేపీ , ఇతర విపక్ష పార్టీల నేతలు తమ ఆందోళనలను మరింత ఉధృతం చేశారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విపక్షాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొని ఎన్నికల కమిషన్ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఈ సమావేశంలో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌తో పాటు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) నేత నేహా బోరా, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తదితరులు పాల్గొన్నారు. అయితే, సీఈసీ తొలగింపు ఉద్యమం వెనుక ఉన్న ఉద్దేశం , ‘అధికార మార్పిడి’ వ్యాఖ్యలపై నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సమావేశంలో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయడం ఏమాత్రం నేరం కాదని, దేశంలో ఇప్పుడు సాగుతున్న పోరాటమంతా పారదర్శకత , అధికార మార్పిడి కోసమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు కేవలం అధికార మార్పిడి కోసం మాత్రమే కుట్ర పన్నుతున్నాయని అధికార పక్షం ఆరోపిస్తోందని, కానీ తమ ప్రాథమిక లక్ష్యం ఎన్నికలను అత్యంత సజావుగా, నిష్పాక్షికంగా నిర్వహించడమేనని ఆయన స్పష్టం చేశారు.

ఒకవేళ ఎన్నికల నిర్వహణలో ఇదే తరహా క్రూరత్వం, ఏకపక్ష వైఖరి కొనసాగితే దేశంలో తప్పకుండా అధికార మార్పిడి జరుగుతుందని ఉద్ఘాటించారు. దేశంలో ప్రభుత్వాన్ని మార్చాలనే కోరిక తమతో పాటు ప్రతి ఒక్కరికీ ఉందని తెలిపారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బిజెపి కూడా అధికార మార్పిడి కోసం అనేక ఉద్యమాలు చేసిందని, ఇప్పుడు విపక్షాలు పోరాడుతుంటే కుట్ర అని ఆరోపించడం ఏమాత్రం సమంజసం కాదని ప్రశాంత్ భూషణ్ ధ్వజమెత్తారు.

అయితే ప్రశాంత్ భూషణ్ చేసిన ‘అధికార మార్పిడి’ వ్యాఖ్యలను కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తప్పుబట్టారు. తమ ఉమ్మడి నిరసనల ముఖ్య ఉద్దేశం కేవలం సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించడమేనని.. ప్రభుత్వ మార్పిడి లేదా అధికార మార్పిడి తమ అజెండా కాదని స్పష్టం చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఎన్నికలను పూర్తిగా రిగ్గింగ్ చేస్తున్నారని, తోటి ఎన్నికల కమిషనర్ల అభిప్రాయాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చివరికి సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను కూడా సీఈసీ ఖాతరు చేయడం లేదని, అందుకే ఆయనను వెంటనే తొలగించి, ఆయన స్థానంలో స్వతంత్రంగా, నిష్పాక్షికంగా వ్యవహరించే కొత్త సీఈసీని నియమించడమే తమ ఏకైక డిమాండ్ అని దీప్కే తేల్చి చెప్పారు.