Skip to content
జాతీయం › వార్తలు

Jantar Mantar Protest: నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపుపై.. కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం

Krishna Rao 16 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Jantar Mantar Protest: నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపుపై.. కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం

Protest Alert in Delhi

Jantar Mantar Protest: జంతర్ మంతర్‌ను నిరసనలకు నిర్దేశించిన ప్రదేశాల జాబితా నుంచి తొలగించి, ప్రదర్శనల కోసం మూడు ప్రత్యామ్నాయ వేదికలను ప్రకటిస్తూ అక్టోబర్ 11న జారీ చేసిన ఉత్తర్వును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసుల స్పందన కోరింది.

ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ అక్టోబర్ 11న జారీ చేసిన స్థాయీ ఉత్తర్వు ద్వారా జంతర్ మంతర్‌ను నిరసనల వేదికల జాబితా నుంచి తొలగించారు. దాని స్థానంలో తూర్పు ఢిల్లీలోని రాంలీలా మైదానం, బురారీ మైదానం, సీబీడీ గ్రౌండ్స్‌ను నిరసనలు, ప్రదర్శనల కోసం ప్రత్యామ్నాయ వేదికలుగా నిర్దేశించారు.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం.. నిరసన ప్రదర్శనల కోసం జంతర్ మంతర్‌ను ఉపయోగించడం, ఆ వేదిక సమర్థతకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తామని మౌఖికంగా పేర్కొంది.

న్యాయవాది స్వాతి సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా, జంతర్ మంతర్‌ను నిరసనల వేదికగా గుర్తిస్తూ గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను పునరుద్ధరించాలని సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ ధర్మాసనాన్ని కోరారు.

గత రెండు వారాల్లో ఢిల్లీలో పలు తేదీల్లో బహిరంగ సమావేశాలు, ప్రదర్శనలను పరిమితం చేస్తూ, గతంలో సీఆర్‌పీసీలోని సెక్షన్ 144గా ఉన్న భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌)లోని సెక్షన్ 163 కింద జారీ చేసిన నిషేధాజ్ఞలకు సంబంధించిన ఉత్తర్వులను సమర్పించాలని సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.

నిరసనలకు సంబంధించిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీ, ఇతర డిజిటల్ సాక్ష్యాలను భద్రపరచాలని అన్ని చట్ట అమలు సంస్థలను ఆదేశించింది.

నిరసనలను సుదూర ప్రాంతాలకు, మారుమూల ప్రదేశాలకు తరలించడం వల్ల శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు, భావప్రకటనా స్వేచ్ఛ వంటి ప్రాథమిక హక్కులు నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. సవాల్ చేసిన స్థాయీ ఉత్తర్వు ఏకపక్షంగా, లోపభూయిష్టంగా ఉందని పిటిషన్‌లో ఆరోపించారు.