Delhi Protests Intensify: ఢిల్లీలో AISF, AIYF తిరంగా మార్చ్ ఫోటోలు ఇవిగో.. భారీ వర్షంలోనూ వెనక్కి తగ్గని నిరసనకారులు..
Delhi Protests Intensify
Delhi Protests Intensify: దేశ రాజధాని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF), ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (AIYF) ఉమ్మడి ఆధ్వర్యంలో కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వందలాది మంది విద్యార్థి, యువజన కార్యకర్తలు భారీ ‘తిరంగా మార్చ్’ (త్రివర్ణ పతాక ప్రదర్శన) నిర్వహించారు.
జాతీయ పతాకాలను చేతబూని భారీగా తరలివచ్చిన ఆందోళనకారుల నినాదాలతో కన్నాట్ ప్లేస్ హోరెత్తిపోయింది. చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి!, “ప్రజాస్వామ్య నిరసనల హక్కు వేదిక జంతర్ మంతర్ హమారా హై!” అంటూ కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేయడంతో పాటు, మూసివేసిన జంతర్ మంతర్ నిరసన వేదికను పునఃప్రారంభించాలని, అలాగే అరెస్టై తీహార్ జైలులో ఉన్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఈ త్రివర్ణ యాత్రను చేపట్టారు.

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు ప్రతీక అయిన త్రివర్ణ పతాకాన్ని శాంతియుతంగా చేతబూని ప్రదర్శన నిర్వహించిన విద్యార్థి, యువజన నాయకులను ఢిల్లీ పోలీసులు బలవంతంగా అడ్డుకున్నారు. నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ వ్యాన్లలోకి తోసివేసారు.


ఈ అరెస్టుల్లో ఏఐవైఎఫ్ (AIYF) జాతీయ ప్రధాన కార్యదర్శి సుఖ్జీందర్ మహేసరి, సీపీఐ (CPI) అగ్రనేత డి. రాజా కుమార్తె అపరాజిత రాజాతో పాటు వందలాది మంది కీలక యువజన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. జాతీయ జెండాతో శాంతియుతంగా ప్రదర్శన చేయడమే తాము చేసిన ‘నేరం’ అన్నట్లుగా పోలీసులు ప్రవర్తించారని నాయకులు మండిపడ్డారు.

పోలీసుల అణచివేత చర్యలతో పోరాటం ఆగిపోదని, ప్రజాస్వామ్య రక్షణ కోసం త్రివర్ణ పతాకం నిరంతరం రెపరెపలాడుతుందని, మరింత గట్టిగా తిరిగి వచ్చి పోరాటాన్ని కొనసాగిస్తామని అరెస్టయిన ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నేతలు స్పష్టం చేశారు.