నిరసన గొంతుపై ఉక్కుపాదం!
Protest
ప్రజాస్వామ్యంలో ఓటు ప్రజల అధికారం. నిరసన ప్రజల గొంతు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పౌరుల హక్కు. ఈ మూడింటిలో ఏ ఒక్కదానికైనా ముప్పు ఏర్పడితే అది కేవలం ఒక రాజకీయ పార్టీకి, ఒక ఉద్యమానికి సంబంధించిన సమస్య కాదు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే సవాలు. ప్రస్తుతం దేశం లో భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్, ఢిల్లీలోని జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించడం, ప్రత్యామ్నాయ నిరసన స్థలమైన రామ్‌లీలా మైదానం పరిసరాల్లో ముఖ గుర్తింపు సాంకేతికతతో కూడిన సిసి కెమెరాల ఏర్పాటు ప్రతిపాదనలు, ఉద్యమకారుల అరెస్టులు.. వంటి పరిణామాలు వేరువేరుగా కనిపించినా, ‘ప్రజల అసమ్మతిని ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతవరకు సహించగలుగుతోంది?’ అనే ప్రశ్నను తెరపైకి తెస్తున్నది. ఓటు చోరీ జరిగిందన్నది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ. ఆ ఆరోపణలపై తుది నిర్ధారణ జరగాల్సి ఉంది. అయితే ఆరోపణ లు చేయడం, వాటిపై విచారణ కోరడం, ఎన్నికల ప్రక్రియ పారదర్శకతను ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో సహజమైన రాజకీయ హక్కులు. ఓటరు జాబితాల్లో పేర్ల తొలగింపు, ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, ఎన్నికల నిర్వహణలో పారదర్శకత వంటి అంశాలపై ప్రతిపక్షాలు, పౌరసంఘాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నప్పుడు ఎన్నికల సంఘం వాటికి స్పష్టమైన సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యతను విస్మరించకూడదు. ఆరోపణల అణచివేత కాదు.. నిష్పాక్షికమైన విచారణ అవసరం. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామాను కోరుతూ సాగుతున్న ఉద్యమానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఎన్నికల్లో ఓటమిని అంగీకరించడం ప్రజాస్వామ్య సంప్రదాయం. అదే సమయంలో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అనుమానం కలిగితే వాటిని ప్రశ్నించడం కూడా ప్రజాస్వామ్య హితమే. ఈ రెండు సూత్రాల మధ్య సమతుల్యతను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం, ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థపై ఉంది. జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) నిర్వహించిన మొదటి ఉద్యమం సఫలమై, నాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో, ఇప్పుడు అక్కడ జరుగుతున్న మరో ఉద్యమం కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు కనిపిస్తున్నది.
జంతర్‌మంతర్‌ను నిరసన స్థలం కాదంటూ ఆదేశాలు జారీ చేయడం, ఇద్దరు సిజెపి నాయకులను అరెస్టు చేయడం ఇందుకు నిదర్శనాలు.
వాస్తవానికి ఢిల్లీలోని జంతర్ మంతర్ దశాబ్దాలుగా ప్రజా ఆందోళనలకు ప్రతీకగా నిలిచింది. కార్మికుల సమస్యల నుంచి విద్యార్థుల ఉద్యమాల వరకు, పౌరసత్వ చట్టాలకు వ్యతిరేక నిరసనల నుంచి మహిళా రెజ్లర్ల న్యాయపోరాటం వరకు ఎన్నో ఉద్యమాలకు వేదికైంది. అక్కడికి వచ్చిన ప్రతి నిరసనకారుడి డిమాండ్ న్యాయమైనదేనని చెప్పలేం. కానీ తన సమస్యను దేశం దృష్టికి తీసుకురావడానికి ఒక పౌరుడికి అందుబాటులో ఉండే వేదికగా జంతర్ మంతర్ది ప్రత్యేక స్థానం. అలాంటి ప్రదేశాన్ని నిరసన స్థలాల జాబితా నుంచి తొలగించి, రామ్‌లీల మైదానం, బురారీ మైదానం, షహదరాలోని సిబిడి మైదానం వంటి ప్రత్యామ్నాయాలను సూచించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పోలీసుల వాదన ప్రకారం, ఈ నిర్ణయం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసుల ఆధారంగా తీసుకున్నది. శాంతిభద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజల రాకపోకలు వంటి అంశాలను విస్మరించలేం. అయితే వాటి పేరుతో నిరసనకారులను ప్రజలకు, మీడియాకు, అధికార కేంద్రాలకు దూరంగా నెట్టివేయడం సమంజసమా అన్నది అసలు ప్రశ్న. జంతర్ మంతర్‌కు ప్రత్యామ్నాయంగా ఒక మైదానాన్ని ప్రకటించడం మాత్రమే సరిపోదు. అక్కడికి ప్రజలు సులభంగా చేరుకోగలరా? నిరసనకు అవసరమైన అనుమతులు సకాలంలో లభిస్తాయా? స్థలం అందుబాటులో ఉందా? దాని వినియోగానికి విధించే ఖర్చులు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయా? అక్కడి పరిస్థితులు శాంతియుత నిరసనకు అనుకూలంగా ఉన్నాయా? వంటి అనేక ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు అవసరం. భారత రాజ్యాంగంలోని 19(1)(బి) అధికరణం శాంతియుతంగా, నిరాయుధంగా సమావేశమయ్యే హక్కును పౌరులకు కల్పిస్తుంది. ప్రజా శాంతి వంటి కారణాలతో చట్టబద్ధమైన, సమంజసమైన పరిమితులు విధించవచ్చు. కానీ పరిమితులు విధించే అధికారం ఉందన్న కారణంతో నిరసన అవకాశాన్నే దాదాపుగా తొలగించడం సమర్థనీయం కాదు. సుప్రీంకోర్టు గతంలోనూ శాంతియుత నిరసన హక్కు, ప్రజా ప్రయోజనాల మధ్య సమతుల్యత అవసరమని స్పష్టం చేసింది. కాగా, రామ్‌లీలా మైదానం పరిసరాల్లో ప్రతిపాదిత సిసి కెమెరాల ఏర్పాటు. అందుబాటులో ఉన్న టెండర్ పత్రాల ప్రకారం, ఢిల్లీ పోలీసు విభాగం సుమారు రూ.15.66 కోట్ల విలువైన 338 కెమెరాల కొనుగోలుకు బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించిన విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.ఈ ప్రతిపాదనలో ముఖ గుర్తింపు సాంకేతికత, జనసమూహాల గుర్తింపు, వాహన నంబర్ ప్లేట్ల పఠనం వంటి సామర్థ్యాలు ఉన్నాయి. రామ్ లీలా మైదానం ప్రవేశద్వారాలు, ఢిల్లీ గేట్, తుర్క్‌మన్ గేట్ తదితర ప్రాంతాలు కెమెరాల ప్రతిపాదిత జాబితాలో ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. జంతర్ మంతర్‌ను కాదని, రామ్‌లీలాకు ‘నిరసన’ను మార్చడం వెనుక కుట్ర కోణం లేకపోలేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే, జంతర్‌మంతర్ వద్ద నిరసనలకే సిజెపి ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలోనే ఆ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను పోలీసులు అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ కస్టడీకి తరలించడం పాలకుల ఆంతర్యాన్ని స్పష్టం చేస్తున్నది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే అవకాశం పూర్తిగా మూసుకుపోయిన పరిస్థితిలో, ప్రత్యామ్నాయంగా ఏ మార్గాన్ని పౌరులు ఎంచుకోవాలి? నిరసనకారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవచ్చు. కానీ ప్రతి అసమ్మతినీ శాంతిభద్రతల సమస్యగా పరిగణించి, అరెస్టులు, నిర్బంధాలతో విరుచుకుపడితే ప్రజల్లో భయం పెరుగుతుంది.
సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే దీనిని ‘అనధికారిక అత్యవసర పరిస్థితి’గా అభివర్ణించడం ఎంతైనా సమర్థనీయం. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును హరించడానికి జరుగుతున్న చర్యలను అడ్డుకునే ప్రయత్నాలపై ఉక్కుపాదం సరికాదు. ఎందుకంటే, ప్రజాస్వామ్యం ఎన్నికలు నిర్వహించడంతోనే సురక్షితంగా ఉండదు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు, స్వతంత్ర మీడియా, న్యాయపరమైన రక్షణ, శాంతియుత నిరసనలకు అవకాశం కూడా అంతే అవసరం. విమర్శకులను ప్రభుత్వాలు శత్రువులుగా చూడకూడదు. ఎన్నికల ప్రక్రియపై వచ్చిన ఆరోపణలకు విశ్వసనీయమైన సమాధానాలు ఇవ్వాలి. ఓటును ప్రశ్నించినందుకు పౌరుడిని అనుమానితుడిగా చూడటం, నిరసనకు స్థలం అడిగినందుకు చట్టవ్యతిరేకిగా చిత్రించడం, తన ముఖాన్ని ప్రభుత్వ కెమెరా గుర్తిస్తుందేమోనని భయపడే పరిస్థితిని సృష్టించడం వంటి చర్య ఏ ప్రజాస్వామ్యానికీ శుభసూచకాలు కావు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగినప్పుడే ప్రభుత్వానికి నిజమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది. ప్రజల గొంతును వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం సజీవంగా నిలుస్తుంది.