Protest Alert in Delhi: దేశ రాజధానిలో కొనసాగుతున్న ఆందోళనలు.. అక్టోబర్ 20 వరకు కేంద్ర బలగాలను కొనసాగించాలని హోంశాఖకు ఢిల్లీ పోలీసుల విజ్ఞప్తి
Protest Alert in Delhi
Protest Alert in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో వివిధ రాజకీయ పక్షాలు, సామాజిక వర్గాల ఆందోళనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విధుల్లో ఉన్న కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్)ను ఇప్పుడే ఉపసంహరించవద్దని, వారి మోహరింపు గడువును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించాలని కోరుతూ కేంద్ర హోంశాఖకు ఢిల్లీ పోలీసులు అధికారికంగా లేఖ రాశారు. ఈ విషయానికి సంబంధించిన వివరాలను ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు.
ముందు ముందు వివిధ నిరసన ప్రదర్శనలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందంటూ నిఘా వర్గాల నుంచి అందిన నివేదికల ఆధారంగానే ఈ ప్రతిపాదన చేసినట్లు అధికారులు తెలిపారు. రాజధాని నగరం అంతటా శాంతిభద్రతలను కాపాడటంతో పాటు అనవసర ఉద్రిక్తతలకు తావులేకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టడానికి ఈ అదనపు సాయుధ బలగాల అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో విధుల్లో ఉన్న 273 కంపెనీల సీఏపీఎఫ్ బలగాల మోహరింపు గడువు సోమవారంతోనే ముగియడంతో, వారి సేవలను తక్షణమే అక్టోబర్ 20 వరకు కొనసాగించాలని కోరారు.
మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), భీమ్ ఆర్మీ, వివిధ విద్యార్థి సంఘాలతో పాటు పలు రాజకీయ వర్గాలు పిలుపునిచ్చిన ఆందోళనల కారణంగా జంతర్ మంతర్, భారత ఎన్నికల సంఘం కార్యాలయం, పార్లమెంట్ హౌస్, ఇండియా గేట్ వంటి అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో నిరసనలు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాన రహదారులతో పాటు కీలక ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.
వివిధ దశల్లో రాబోయే ఆందోళనలను నియంత్రించడానికి ఢిల్లీలో మొత్తం 301 కంపెనీల సీఏపీఎఫ్ బలగాల మోహరింపునకు కేంద్రం ముందస్తు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా అక్టోబర్ 6వ తేదీన 221 కంపెనీలకు, అక్టోబర్ 8న మరో 80 కంపెనీలకు అనుమతి లభించడంతో ఆయా బలగాలు నగరంలో విధుల్లో చేరాయి. అయితే, అదనంగా మంజూరైన 80 కంపెనీలలో 28 కంపెనీలు సోమవారం నాటికి ఇంకా ఢిల్లీ పోలీసులకు నివేదించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా ఈ బలగాలన్నీ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండటం అత్యంత అవసరమని ఢిల్లీ పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.