Jantar Mantar Protest Row: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత: సీజేపీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంక్కాల అరెస్ట్..
CJP Leaders Taken Into Police Custody
Jantar Mantar Protest Row: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలిపేందుకు ప్రభుత్వం అనుమతించని నేపథ్యంలో.. సోమవారం కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు అక్కడకు చేరుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిరసన ప్రదేశానికి వెళ్లిన సీజేపీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంక్కాలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్, జాతీయ ప్రతినిధి ఆశుతోష్ రాంక్కాలను పోలీసులు అరెస్టు చేసినట్లు ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.
నిషేధాజ్ఞలను ధిక్కరించి జాతీయ జెండాలతో జంతర్ మంతర్‌లోకి ప్రవేశించిన సీజేపీ నేతలు అక్కడ నిరసనకు దిగారు. “మేము జంతర్ మంతర్‌ను తిరిగి సాధించాం, ఆ ప్రదేశంలోకి ప్రవేశించాం.. కానీ పోలీసులు మమ్మల్ని అరెస్టు చేశారు” అంటూ సౌరవ్ దాస్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆంక్షలను లెక్కచేయకుండా నేతలు నేరుగా నిరసన స్థలికి చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమై వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, నిరసన తెలిపే హక్కు కోసం తమ పోరాటం ఆగదని సీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి. జంతర్ మంతర్ వద్ద చోటుచేసుకున్న ఈ పరిణామాలు దేశ రాజధానిలో మరోసారి రాజకీయ కలకలం రేపాయి.