మీడియా స్వేచ్ఛపై పెరుగుతున్న దాడులు, కేసులు
Rising attacks and cases against media freedom
నందిరాజు రాధాకృష్ణ
ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలతో పాటు ప్రజల తరఫున ప్రశ్నించే నాలుగో స్థంభంగా మీడియాకు ప్రత్యేక స్థానం ఉంది. అధికారంలో ఉన్నవారి చర్యలను పరిశీలించడం, ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడం, అవినీతి ప్రశ్నించడం పాత్రికేయ వృత్తి యొక్క ప్రాథమిక బాధ్యత. అయితే ఈ బాధ్యతే నేడు అనేక సందర్భాల్లో పాత్రికేయులకు కేసులు, అరెస్టులు, బెదిరింపులు, దాడులు, సంస్థలపై దర్యాప్తులు వంటి రూపాల్లో పెనుసవాలుగా మారుతోంది.
కేసుల సంఖ్య ఈ సమస్య తీవ్రతను స్పష్టంగా చూపుతోంది. నేషనల్ లా యూనివర్సిటీ కొలంబియా లా స్కూల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూట్, క్లూనీ ఫౌండేషన్ ఫర్ జస్టిస్‌కు చెందిన ట్రయల్ వాచ్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం 2012 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా పాత్రికేయులపై నమోదైన 423 క్రిమినల్ కేసులు, 427 మంది జర్నలిస్టులు, మొత్తం 624 క్రిమినలైజేషన్ ఘటనలను విశ్లేషించిం ది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, పోలీసు వ్యవస్థపై వార్తలు రాసిన సందర్భాల్లోనే అనేక కేసులు నమోదైనట్లు అధ్యయనం వెల్లడించింది.
ఈ అధ్యయనంలో మరో ఆందోళనకర అంశం వెలుగుచూసింది. మహానగరాల్లో పనిచేసే జర్నలిస్టుల కంటే చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే పాత్రికేయులు అరెస్టులకు ఎక్కువగా గురయ్యారు. పెద్ద నగరాల్లో నమోదైన ఘటనల్లో అరెస్టు శాతం 24 శాతం కాగా, చిన్న పట్టణాలు, గ్రామాల్లో అది 58 శాతానికి చేరింది. అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ పొందిన వారి శాతం మహానగరాల్లో 65 శాతం ఉండగా, చిన్న పట్టణాల్లో కేవలం 3 శాతం మాత్రమే. న్యాయ సహాయం అందుబాటులో లేకపోవడం దీనికి ఒక కారణంగా అధ్యయనం పేర్కొంది.
2025లో మరింత ఆందోళనకర దృశ్యం
ఫ్రీ స్పీచ్ కలెక్టివ్ గణాంకాల ప్రకారం 2025లో దేశవ్యాప్తంగా 33 మంది జర్నలిస్టులపై దాడులు నమోదయ్యాయి. జర్నలిస్టుల పనికి సంబంధించిన 14 వేధింపులు, 12 బెదిరింపులు కూడా నమోదయ్యాయి. అదే సంవత్సరంలో మొత్తం 9 మంది జర్నలిస్టులు మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు, అండమాన్ ఛత్తీస్‌గఢ్, హర్యానా, కర్ణాటక, ఒడిశా, ఉత్తరాఖండ్, పంజాబ్‌లలో ఒక్కొక్కరు మరణించినట్లు
నివేదిక పేర్కొంది.
2025 తొలి నాలుగు నెలల్లోనే పరిస్థితి తీవ్రతకు మరో అద్దం పడింది. ఆ కాలంలో ఇద్దరు జర్నలిస్టులు హత్యకు గురికాగా, నలుగురి పై దాడులు, ఆరుగురి అరెస్టులు, కనీసం ఐదు బెదిరింపు ఘటనలు నమోదయ్యాయి. పాత్రికేయులపై కనీసం ఐదు కేసులను లా-ఫేర్ గా ఫ్రీ స్పీచ్ కలెక్టివ్ నమోదు చేసింది.
దేశవ్యాప్తంగా స్వేచ్ఛా ప్రసంగానికి సంబంధించిన మొత్తం ఘటనల్లో 2025లో గుజరాత్లో 108, ఉత్తరప్రదేశ్‌లో 83, కేరళలో 78, అసోంలో 62, జమ్మూ 51 ఘటనలు నమోదైనట్లు గణాంకాలను ఉటంకిస్తూ నివేదికలు పేర్కొన్నాయి. దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో 9, ఆంధ్రప్రదేశ్‌లో 7, తమిళనాడులో 6, తెలంగాణలో 5 ఘటనలు నమోదయ్యాయి. ఇవి మీడియా కేసులకే పరిమితమైన సంఖ్యలు కాకుండా, విస్తృతమైన స్వేచ్ఛా ప్రసంగ ఉల్లంఘనలను కలుపుకున్న గణాంకాలని స్పష్టం చేయాలి.
తెలంగాణలో 2025 మార్చిలో ఆన్లైన్ న్యూస్ ఛానల్‌కు చెందిన నిర్వాహకురాలు, రిపోర్టర్ అరెస్టు కావడం చర్చనీయాంశమైంది. అసోంలో ఆర్థిక అవకతవకలపై నిరసనను రిపోర్టు చేసిన జర్నలిస్టు అరెస్టై, ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసులో అరెస్టయ్యారని Fశ్ఛ్ నమోదు చేసింది. మహారాష్ట్రలో జర్నలిస్టుపై పరువునష్టం కేసు కూడా నమోదైంది. సంబంధిత ప్రభుత్వాలు మాత్రం తమ చర్యలను మీడియా స్వేచ్ఛను అణచివేయడంగా చూడకూడదని వాదించాయి.
జమ్మూ భద్రతా, ఉగ్రవాద నిరోధక చట్టాల నేపథ్యంలో జర్నలిస్టులు దీర్ఘకాలిక న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అంతర్జాతీయ మీడియా స్వేచ్ఛా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ప్రకారం 2026 సూచీలో భారత్ 180 దేశాల్లో 157వ స్థానంలో ఉంది; 2025లో 151వ స్థానంలో ఉండగా, 2026లో స్థానం మరింత దిగజారింది.
కేసు దాఖలు శిక్షగా మారకూడదు
పాత్రికేయుడు తప్పు చేస్తే చట్టం తన పని తాను చేయాలి. తప్పుడు వార్తలు, పరువు నష్టం, విద్వేష ప్రసంగం లేదా ఇతర నేరాలకు మీడియా వ్యక్తులు కూడా చట్టానికి అతీతులు కారు. అయితే ప్రశ్న అడిగినందుకు, అధికార నిర్ణయాన్ని విమర్శించినందుకు, ప్రజా ప్రయోజన అంశాన్ని వెలుగులోకి తెచ్చినందుకు క్రిమినల్ కేసులు పెట్టడం వృత్తి స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం చూపుతుంది.ప్రత్యేకించి చిన్న పత్రికలు, ప్రాంతీయ మీడియా సంస్థలు, స్వతంత్ర డిజిటల్ జర్నలిస్టులకు న్యాయపోరాటం ఆర్థికంగా భారమవుతుంది. కేసు చివరకు నిలబడకపోయినా, అరెస్టు భయం, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, న్యాయవాదుల ఖర్చు, కుటుంబంపై ఒత్తిడి ఇవన్నీ కలిపి ప్రక్రియే శిక్షగా మారే ప్రమాదం ఉంది.
423 కేసుల అధ్యయనం ఈ అంశాన్ని ప్రత్యేకంగా
ప్రతిబింబించింది.
అందువల్ల మీడియా స్వేచ్ఛ రక్షణకు పాత్రికేయులపై దాడులపై వేగవంతమైన దర్యాప్తు, కేసుల నమోదులో చట్టబద్ధమైన ప్రమాణాలు, అరెస్టుల విషయంలో న్యాయపరమైన జాగ్రత్త, చిన్న పట్టణ జర్నలిస్టుల కు న్యాయ సహాయం, ప్రభుత్వ సంస్థల పారదర్శకత అవసరం. మీడియా ప్రభుత్వానికి శత్రువు కాదు; ప్రజాస్వామ్యానికి కాపలాదారు. విమర్శను నేరంగా చూడకుండా, నేరాన్ని విమర్శ నుంచి వేరుచేసే వివేకమే ప్రజాస్వామ్య పరిపక్వతకు కొలమానం. అధికారాన్ని ప్రశ్నించే స్వరం భయంతో మౌనమైతే, నష్టపోయేది ఒక్క జర్నలిస్టు కాదు ప్రజలకు అందే
సమాచార హక్కు మొత్తం.