Rahul Gandhi: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ గారు రాత్రిళ్లు మీకు నిద్ర కరువైంది.. ఇది శివతాండవం.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు.. వీడియో ఇదిగో..
Rahul Gandhi
Rahul Gandhi: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయన్న తీవ్ర ఆరోపణల నడుమ, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా విపక్షాలు చేపట్టిన పోరాటం కొత్త మలుపు తిరిగింది. సోమవారం సుప్రీంకోర్టు వైపు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి చేపట్టిన భారీ మార్చ్‌కు ముందు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. తమ నిరసనలకు ఎలాంటి ముందస్తు ప్రణాళిక గానీ, వ్యూహాలు గానీ అవసరం లేదని, ఈ పోరాటం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న ఒక ‘శివతాండవం’ లాంటిదని ఆయన వర్ణించారు.
విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తమ నిరసనల స్వభావాన్ని వివరించారు. “ఈ పోరాటానికి ఒక స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని మా సోదరి ప్రియాంక గాంధీ నాతో అన్నారు. దానికి నేను సమాధానమిస్తూ.. ఇది ‘తాండవం’ (శివుడి నాట్యం). దీనికి ఎలాంటి వ్యూహాలు, ప్రణాళికలు ఉండవు అని చెప్పాను” అని రాహుల్ వెల్లడించారు. ఆకాశవాణి భవన్ వద్ద నిర్వహించిన ఆందోళనను ప్రస్తావిస్తూ, పోలీసుల ఆంక్షల కారణంగా నిరసన వేదికలను అనుకోకుండా మార్చుకోవాల్సి వచ్చిందని, అయితే అలాంటి అనాలోచిత మార్పుల వల్లే సరైన, ప్రభావవంతమైన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనుకునే ప్రతి ఒక్క పౌరుడు, ఏ రాజకీయ పార్టీ నేత అయినా వచ్చి ఈ అనధికారిక పోరాటంలో భాగస్వామ్యం కావచ్చని పిలుపునిచ్చారు.
మరోవైపు సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను ఉద్దేశించి రాహుల్ గాంధీ నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. “జ్ఞానేశ్ కుమార్ గారూ.. రాత్రిళ్లు మీకు నిద్ర కరువైందని మాకు విశ్వసనీయ సమాచారం అందుతోంది. చింతించకండి, మిమ్మల్ని సులభంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. లక్షలాది మంది ప్రజల ఆగ్రహం నుంచి, ప్రతిపక్షాల నిరసనల నుంచి మీరు తప్పించుకోలేరు. కోట్ల మంది ఓటర్ల హక్కులను కాలరాస్తున్న మీ ప్రవర్తనను దేశ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. సొంత సంస్థలోని ఇద్దరు ఎన్నికల కమిషనర్లు లేవనెత్తిన తీవ్రమైన సందేహాలకే తాము కూడా సమాధానాలు కోరుతున్నామని, నిష్పాక్షికతను కోల్పోయిన జ్ఞానేశ్ కుమార్ ఎందుకు తక్షణమే రాజీనామా చేయడం లేదని ఆయన నిలదీశారు.
ఈ ఆందోళనల తదుపరి కార్యాచరణగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏకపక్ష వ్యవహారశైలిపై, ఓటర్ల తొలగింపుపై సాయంత్రంలోగా సుప్రీంకోర్టులో అధికారికంగా పిటిషన్ దాఖలు చేయనున్నట్లు రాహుల్ గాంధీ ప్రకటించారు. విపక్షాల సుప్రీంకోర్టు మార్చ్‌ను అడ్డుకునేందుకు దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ పోలీసులతో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), సీఆర్పీఎఫ్ బలగాలను భారీగా మోహరించారు. బరాఖంబా రోడ్, మండి హౌస్, సుప్రీంకోర్టు పరిసర ప్రాంతాల్లో రవాణాను పాక్షికంగా నిలిపివేసి, వ్యూహాత్మక ప్రాంతాలను కంటైనర్లు, బారికేడ్లతో దిగ్బంధించారు. రాజ్యాంగ పరిరక్షణ పేరిట ఇండియా కూటమి ఉధృతం చేసిన ఈ పోరాటం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత తీవ్ర చర్చనీయాంశంగా మారింది.