Skip to content
తెలంగాణ › వార్తలు

Telangana Groundwater Crisis: తెలంగాణలో అడుగంటిన భూగర్భ జలాలు.. 33 జిల్లాల్లో పాతాళానికి పడిపోయిన నీటిమట్టాలు..

jagan 12 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Telangana Groundwater Crisis: తెలంగాణలో అడుగంటిన భూగర్భ జలాలు.. 33 జిల్లాల్లో పాతాళానికి పడిపోయిన నీటిమట్టాలు..

Water

Telangana Groundwater Crisis: తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలు అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లోనూ గతేడాది (2025) సెప్టెంబర్‌తో పోల్చితే ఈ ఏడాది (2026) సెప్టెంబర్‌ చివరి నాటికి నీటిమట్టాలు గణనీయంగా క్షీణించాయి. ఎల్‌నినో ప్రభావం వల్ల ప్రస్తుత వర్షాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడమే ఈ తీవ్ర పరిస్థితికి ప్రధాన కారణమని స్పష్టమవుతోంది.

రాష్ట్ర భూగర్భ జలశాఖ విడుదల చేసిన 2026 సెప్టెంబర్‌ రెండో పక్షం నివేదిక ప్రకారం, 2025 సెప్టెంబర్‌ చివరి నాటికి రాష్ట్రంలో భూగర్భ జలాల సగటు లోతు 4.41 మీటర్లుగా ఉండగా, 2026 సెప్టెంబర్‌ నాటికి అది 7.52 మీటర్ల లోతుల్లోకి పతనమైంది. అంటే ఒక్క ఏడాది వ్యవధిలోనే సగటున 3.11 మీటర్ల లోతుల్లోకి నీటిమట్టాలు పడిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే, హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 6.44 మీటర్ల మేర నీటిమట్టం పడిపోగా, మేడ్చల్‌లో 6.29 మీటర్లు, వికారాబాద్‌లో 6.17 మీటర్లు, రంగారెడ్డిలో 5.43 మీటర్లు, మహబూబ్‌నగర్‌లో 5.24 మీటర్లు , సంగారెడ్డి జిల్లాలో 5.13 మీటర్ల మేర లోతుల్లోకి ఇంకిపోయాయి. కనిష్టంగా పెద్దపల్లి జిల్లాలో కూడా 1.02 మీటర్ల మేర క్షీణత నమోదు కావడం గమనార్హం.

సాధారణంగా జూన్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు రాష్ట్రంలో 741 మి.మీ. సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా, కేవలం 616 మి.మీ. మాత్రమే కురిసి 17 శాతం లోటు నమోదైంది. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా, 5 మీటర్లలోపు నీటి లభ్యత ఉండే సురక్షిత స్థితిలో కేవలం 7 జిల్లాలు మాత్రమే మిగిలాయి. 19 జిల్లాల్లో 5 నుండి 10 మీటర్లు, మిగిలిన 7 జిల్లాల్లో 10 నుండి 15 మీటర్ల లోతుల్లో భూగర్భ జలాలు పడిపోయాయి. జిల్లాల ప్రాతిపదికన ఖమ్మంలో అత్యల్పంగా 3.56 మీటర్ల లోతులోనే నీటి లభ్యత ఉండగా, వికారాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 11.96 మీటర్ల లోతుకు నీళ్లు ఇంకిపోయాయి.

మరోవైపు, వర్షాకాలం ప్రారంభానికి ముందు మే నెలలో 9.26 మీటర్లు ఉన్న సగటు లోతు వర్షాల వల్ల సెప్టెంబర్‌ నాటికి 7.52 మీటర్లకు కోలుకున్నప్పటికీ, దశాబ్దపు సగటుతో పోలిస్తే పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. రాష్ట్రంలోని మొత్తం 621 మండలాల్లో 68 శాతం (423 మండలాలు) పరిధిలో దశాబ్ద సగటు కంటే భూగర్భ జలాలు క్షీణించాయి. అంతేకాకుండా, 20 మీటర్ల కంటే ఎక్కువ లోతుల్లో నీటిమట్టాలు ఉన్న ప్రాంతాల విస్తీర్ణం 617 చదరపు కిలోమీటర్ల నుండి 1,272 చదరపు కిలోమీటర్లకు రెట్టింపు కావడం సమీప భవిష్యత్తులో నీటి భద్రతపై తక్షణమే అప్రమత్తమై చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది.