Delhi Protest: ఢిల్లీ నిరసనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. మెట్రో, రైలు సేవలకు ఆటంకం వద్దు!
Supreme Court
Delhi Protest: ఆదివారం సెలవు దినమైనప్పటికీ ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రత్యేక విచారణ చేపట్టింది. జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ప్రజా రవాణా, పౌరుల రాకపోకలు, నిరసనలపై విధించిన ఆంక్షలకు సంబంధించి కీలక సూచనలు చేసింది.
Delhi Protest: దేశ రాజధానిలో సీజేపీ నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం విధించిన ఆంక్షలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజల రాకపోకలకు అనవసరమైన అడ్డంకులు సృష్టించవద్దని స్పష్టం చేసింది. మెట్రో, రైలు సేవలు సాధారణంగా కొనసాగేలా చూడాలని, ఇంటర్నెట్ సేవలకు చట్టవిరుద్ధంగా అంతరాయం కలిగించవద్దని అధికారులను ఆదేశించింది. శాంతియుతంగా నిరసనలు తెలిపే వారి హక్కులను గౌరవించాలని పేర్కొంది.
జంతర్ మంతర్ వద్ద నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతా చర్యలు ముమ్మరమయ్యాయి. పలు మెట్రో స్టేషన్లలో ప్రవేశం, నిష్క్రమణపై ఆంక్షలు విధించడంతో పాటు.. రాజధానికి వచ్చే రైళ్ల రాకపోకలపైనా పరిమితులు విధించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి నిరసనకారులను అడ్డుకున్నారు. పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
ఆదివారం సెలవు దినమైనప్పటికీ ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రత్యేక విచారణ చేపట్టింది. జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ప్రజా రవాణా, పౌరుల రాకపోకలు, నిరసనలపై విధించిన ఆంక్షలకు సంబంధించి కీలక సూచనలు చేసింది.
ప్రజల రాకపోకలకు ఆటంకాలు వద్దు
ఢిల్లీలో చట్టానికి లోబడి ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శాంతిభద్రతలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవచ్చని చెబుతూనే.. ఆ పేరుతో ప్రజలను అనవసరంగా ఇబ్బందులకు గురిచేయకూడదని పేర్కొంది.
చట్టపరమైన ఆధారాలు లేకుండా ఎవరినీ నిర్బంధించరాదని తెలిపింది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్ 163 కింద చట్టబద్ధంగా విధించిన ఆంక్షలు అమల్లో ఉన్న ప్రాంతాలను మినహాయించి, ఇతర ప్రాంతాల్లో శాంతియుతంగా సమావేశమయ్యే వారిపై అనవసర పరిమితులు విధించవద్దని సూచించింది.
మెట్రో, రైలు సేవలు సాధారణంగా కొనసాగించాలి
ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేయడం వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొన్న ధర్మాసనం.. ఢిల్లీకి వచ్చే, నగరంలో నడిచే మెట్రో రైళ్లు, ఇతర రైళ్ల సేవలు సజావుగా కొనసాగేలా చూడాలని ఆదేశించింది. శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన మేరకు నియంత్రణలు విధించవచ్చని, అయితే రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేయడం సమంజసం కాదని స్పష్టం చేసింది.
బారికేడ్లపై సమీక్ష.. ఇంటర్నెట్ సేవలకు ఆటంకం వద్దు
ఢిల్లీలో ట్రాఫిక్, శాంతిభద్రతల పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని బారికేడ్ల ఏర్పాటు అవసరాన్ని అధికారులు సమీక్షించాలని సుప్రీంకోర్టు సూచించింది. ప్రజల రాకపోకలకు వీలైనంత తక్కువ అంతరాయం కలిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
ఇంటర్నెట్ సేవల విషయంలోనూ చట్టాన్ని అనుసరించాలని అధికారులకు సూచించింది. తీవ్రమైన శాంతిభద్రతల సమస్యలు తలెత్తిన సందర్భాల్లో చట్టప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవచ్చని, అయితే తగిన ఆధారాలు లేకుండా సేవలను పూర్తిగా నిలిపివేయడం సరికాదని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు బయట ఆంక్షలపైనా ప్రశ్నలు
సీజేపీ నిరసనల నేపథ్యంలో సుప్రీంకోర్టు వెలుపల BNSS సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించడంపై కూడా ధర్మాసనం ప్రశ్నలు లేవనెత్తింది. ఆ ఆంక్షలకు సంబంధించిన ఉత్తర్వులను సమీక్షించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది.