Hyderabad SIR Protest: ‘ఇండియా’ కూటమి ఆధ్వర్యంలో లోక్ భవన్ ముట్టడికి యత్నం
Hyderabad SIR Protest: హైదరాబాద్‌లోని లోక్ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఆయన పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇండియా (INDIA) కూటమికి చెందిన కాంగ్రెస్, లెఫ్ట్ (CPI, CPM) పార్టీల నేతలు, కార్యకర్తలు భారీగా ‘చలో లోక్ భవన్’ ముట్టడికి పిలుపునిచ్చారు.
ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ఖైరతాబాద్ మీదుగా లోక్ భవన్ వైపు నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీగా బయలుదేరారు. కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.
పోలీసుల మోహరింపు – ఆందోళనకారుల అరెస్ట్:
ర్యాలీ లోక్ భవన్‌కు చేరుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. లోక్ భవన్‌కు సుమారు 300 మీటర్ల దూరంలోనే రోడ్లపై భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి నిరసనకారులను అడ్డుకున్నారు. ఈ సమయంలో సిపిఐ, సిపిఎం మరియు ఇతర కూటమి నేతలు బారికేడ్లను దాటుకుని లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్ర తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకుంది.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), పీఆర్‌డీ, స్వాట్ (SWAT) బృందాలతో పాటు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు పోలీస్ వాహనాలను ఇప్పటికే సిద్ధం చేశారు. లోక్ భవన్ వైపు దూసుకొస్తున్న నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి, సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు.