CEC Resignation Row: జ్ఞానేశ్ రాజీనామా వరకు కదలను.. ఢిల్లీ రోడ్డుపైనే బైఠాయించిన రాహుల్
CEC Resignation Row
CEC Resignation Row: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమికి చెందిన ప్రతిపక్ష పార్టీలు మంగళవారం భారీ నిరసన చేపట్టాయి. ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉత్కంఠగా మారింది.
పార్లమెంట్‌లోని మకర్ ద్వార్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ప్రతిపక్ష ఎంపీలు పాదయాత్రగా బయలుదేరారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని పేర్కొన్న పోలీసులు.. జీఎస్టీ భవన్ సమీపంలో ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద వారిని నిలువరించారు. దీంతో రాహుల్ గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నేతలు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు.
ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వరకు వెళ్లకుండా తమను అడ్డుకోవడంపై ప్రతిపక్ష ఎంపీలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. నిరసనలో భాగంగా రాహుల్ గాంధీ బారికేడ్‌పైకి ఎక్కి త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు.
పోలీసులు తమను ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడంతో రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సంఘం కార్యాలయానికి సమీపంలోని రహదారిపైనే కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ, బాధ్యులైన వారు జవాబుదారీగా ఉండాల్సిందేనని అన్నారు. దేశ ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.
ప్రతిపక్షాల ర్యాలీ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ర్యాలీ మార్గంలో పలుచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు.
ఇండియా కూటమి నేతలు మాత్రం తమ నిరసన శాంతియుతంగానే కొనసాగిస్తున్నామని తెలిపారు. ఎన్నికల సంఘం కార్యాలయం వరకు వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సంఘం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ప్రతిపక్షాలు.. ముఖ్యంగా SIR ప్రక్రియపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, దీనిపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, SIR ప్రక్రియను ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ఇప్పటికే ఇండియా కూటమి ప్రకటించిన నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన ఈ ర్యాలీ ప్రాధాన్యం సంతరించుకుంది.