G7 oil reserves: చమురు ధరలపై ట్రంప్‌కు షాక్.. 10 కోట్ల బ్యారెళ్ల నిల్వలు విడుదలకు జి-7 నిర్ణయం
G7 oil reserves release
G7 oil reserves: ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో 10 కోట్ల బ్యారెళ్ల చమురు నిల్వలను విడుదల చేయాలని జి-7 నిర్ణయించింది.
: చమురు ఎగుమతులు నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించడంతో మార్కెట్ ధరలను స్థిరీకరించడం కోసం 10 కోట్ల బ్యారెళ్ల (100 మిలియన్లు) డీజిల్, ముడి చమురు రిజర్వుల నుంచి విడుదల చేయాలని జి-7 దేశాలు దృశ్యమాధ్యమ పద్ధతిలో సమావేశమై తక్షణ నిర్ణయం తీసుకున్నాయి. అవసరమైతే ఇంకా మరింత డీజిల్ మార్కెట్లోకి విడుదల చేస్తామని కూడా జి-7 ప్రకటించింది.G7 oil reserves release
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ మాట్లాడుతూ, అంతర్జాతీయ ఇంధన సంస్థ సమన్వయంతో నాలుగు నెలలపాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. బ్రిటన్ తరపున విదేశాంగ మంత్రి ఎడ్ మిలిబాండ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. జి-7 నిర్ణయం తర్వాత ట్రంప్ కూడా తన బెదిరింపును వెనక్కు తీసుకున్నారు. అయితే జి-7లో ఏయే భాగస్వామ్య దేశాలు ఈ చమురు నిల్వలు విడుదల చేస్తాయన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు.
బ్యారెల్ 100 డాలర్ల కంటే తక్కువగా ఉన్న ప్రపంచ ప్రామాణిక బ్రెంట్ క్రూడాయిల్ ధర శుక్రవారం నాటికి మళ్లీ 102 డాలర్లకు పైగా పెరిగిపోయింది. గడచిన ఫిబ్రవరి నెలాఖరులో అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడి చేయడానికి ముందు బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 72 డాలర్ల వద్ద ఉండేది. కానీ ఈనాడు దాదాపు 30 డాలర్ల కంటే ఎక్కువగా పెరిగింది.
జి-7 నిర్ణయం తర్వాత చమురు ధర గణనీయంగా తగ్గినప్పటికీ బాబ్ ఎల్ మందాబ్‌పై హౌతీలు తమ పట్టు మరింత బిగించడంతో ధరలు మళ్లీ పెరిగాయి. ఒకవైపు ద్వైవార్షిక ఎన్నికలు సమీపించడం, మరోవైపు దేశంలో ప్రజావ్యతిరేకత మితిమీరడంతో ట్రంప్ కొన్ని పాపపరిహార చర్యలకు పూనుకోవడంతో జి-7 ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది.
అమెరికా సహా అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన ఈ కూటమి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల యూరప్ దేశాలలో ఇంధన సరఫరాలపై ఇకమీదట ఎలాంటి ఆంక్షలు ఉండవు. జి-7 కూటమిలో అమెరికాతోపాటు బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ, ఇటలీ, కెనడా సభ్యులుగా ఉన్నాయి.
యూరప్ దేశాలు తమ వద్ద ఉన్న చమురు నిల్వలను మార్కెట్లోకి విడుదల చేయకపోతే అమెరికా నుంచి డీజిల్ ఎగుమతులను నిలిపివేస్తామని ట్రంప్ బెదిరించారు. డీజిల్ ఎగుమతులు నిలిపివేస్తే ఎన్నికల సమయంలో అమెరికాలో వినియోగదారులపై చమురు ధరల భారం తగ్గుతుంది.
ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో అమెరికాలోని రైతులు, ట్రక్ డ్రైవర్లు, వ్యాపారవేత్తలు చమురు ధరల భారాన్ని మోయకూడదని అమెరికా ఆర్థికమంత్రి స్కాట్ బెస్సెంట్ తొలుత వాదించారు. ఇప్పుడు ఆయిల్ విడుదల ద్వారా యూరప్ చాలా గొప్ప పని చేసిందని, వారు ప్రపంచానికి సహాయం చేయబోతున్నారని అన్నారు. మేం కూడా ఎగుమతులను నిషేధించకుండా మా బాధ్యతలు నెరవేరుస్తామన్నారు.
యూరప్ దేశాలు తమ వద్ద భారీగా ఉన్న చమురు నిల్వల విడుదలకు అంగీకరించాయని ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ చెప్పారు. ఎక్కువగా రవాణా, వ్యవసాయంలోనే డీజిల్ ఉపయోగించడం వల్ల ఆహార వస్తువుల ధరలపై తీవ్ర ప్రభావం పడుతుంది.
65 శాతం వ్యతిరేకతతో ట్రంప్ మల్లగుల్లాలు
అమెరికాలో 65 శాతం మంది వయోజనులు ట్రంప్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తాజా సర్వే నివేదిక ప్రకటించడంతో ట్రంప్ సమస్యలో చిక్కుకున్నారు. వయోజనులలో 17 శాతం మంది మాత్రమే జీవన వ్యయాల విషయంలో ట్రంప్ విధానాలను సమర్థిస్తున్నారు.
ట్రంప్ ఆర్థిక విధానాలు, పెరుగుతున్న ధరల విషయంలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. నవంబరులో ద్వైవార్షిక ఎన్నికల్లో ప్రతిపక్ష డెమోక్రాట్లు ఆధిపత్యం సాధిస్తే ట్రంప్ పెత్తనానికి కాలం చెల్లుతుంది. చాలామంది ఆయన పనితీరు, యుద్ధ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని ద అసోసియేటెడ్ ప్రెస్ – నార్క్ సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ నిర్వహించిన సర్వే ప్రకటించింది.
26 శాతం అమెరికన్లు మాత్రమే ట్రంప్ ఆర్థిక విధానాలను సమర్థిస్తున్నారు. జీవన వ్యయాలపై ప్రతి పదిమందిలో ఏడుగురు ట్రంప్‌ను సర్వేలో తప్పుపట్టారు. పదిమంది రిపబ్లికన్లలో ఆరుగురు ట్రంప్‌ను వ్యతిరేకిస్తున్నారు. 65 శాతం మంది ప్రజలు నియంత్రణలేని విధానాలనే వ్యతిరేకిస్తున్నారు.
సుంకాలు విధించడంలో దూకుడు, యుద్ధ ప్రకటనలతో ప్రజలు విసుగెత్తిపోయారని సర్వే ప్రకటించింది. దీంతో ట్రంప్ కొన్ని దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు.
హౌతీ – సౌదీ దాడులు
అన్సరుల్లా హౌతీ తిరుగుబాటుదారులు, సౌదీ అరేబియా కూటమి దళాల మధ్య యుద్ధ దాడులు కొనసాగుతున్నాయి. యెమెన్‌లోని తీర ప్రాంతాలపై హౌతీ తిరుగుబాటుదారులు పూర్తి పట్టు సంపాదించి ఇరాన్‌కు చెందిన ఘోస్ట్ క్షిపణులతో దాడులు చేస్తూ ఉండటంతో సౌదీ అరేబియా ఆందోళన చెందుతోంది.
మరోవైపు యెమెన్‌లో హౌతీల స్థావరాలపై గురిపెట్టి 51 లక్ష్యాలపై సౌదీ దళాలు దాడులు చేశాయి. హౌతీలు బలం పుంజుకుని ఎర్ర సముద్రంలో క్షిపణులతో దాడులు చేస్తూ ఉండటంతో బాబ్ అల్ మందాబ్‌లో నౌకల రాకపోకలకు కొత్త సమస్యలు తలెత్తాయి.