Skip to content
తెలంగాణ › వార్తలు

Telangana Degree Colleges: తెలంగాణలో ఐదేళ్లలో 335 కాలేజీలు మూసివేత.. ఖాళీగా మిగిలిన లక్షల సీట్లు..

jagan 26 Sep 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Telangana Degree Colleges: తెలంగాణలో ఐదేళ్లలో 335 కాలేజీలు మూసివేత.. ఖాళీగా మిగిలిన లక్షల సీట్లు..

Telangana Degree Colleges

Telangana Degree Colleges: తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ విద్యావ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. విద్యార్థుల నుంచి ఆదరణ తగ్గడం, మరోవైపు ప్రభుత్వ ప్రోత్సాహం, ఆర్థిక సహకారం కొరవడటంతో ఏటా పదుల సంఖ్యలో కళాశాలలు మూతపడుతున్నాయి. గత ఐదేళ్ల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 335 ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు తాళాలు పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 2021లో 1,100గా ఉన్న మొత్తం డిగ్రీ కాలేజీల సంఖ్య, ప్రస్తుతం 783కి పడిపోయింది. నల్గొండలో 4 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రముఖ ‘నీలగిరి డిగ్రీ కాలేజీ’ సైతం గతేడాది ఆర్థిక భారంతో మూతపడటం ఉన్నత విద్యా రంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

56 కాలేజీల్లో సున్నా అడ్మిషన్లు!
తాజాగా ముగిసిన మూడు విడతల ‘దోస్త్’ (DOST) కౌన్సెలింగ్‌ తర్వాత కూడా రాష్ట్రవ్యాప్తంగా సగానికి పైగా డిగ్రీ సీట్లు ఖాళీగానే ఉండిపోయాయి. ముఖ్యంగా 9 జిల్లాల పరిధిలోని 56 కాలేజీల్లో ఉన్న మొత్తం 16,460 సీట్లలో ఒక్క విద్యార్థి కూడా చేరకపోవడం గమనార్హం. విద్యాశాఖ నిబంధనల ప్రకారం… వరుసగా మూడేళ్లపాటు 25 శాతం సీట్లు భర్తీ కాని కళాశాలల గుర్తింపును రద్దు చేస్తారు. ఈ నిబంధన కారణంగా ఈ ఒక్క విద్యా సంవత్సరంలోనే మరో 50కి పైగా ప్రైవేటు కాలేజీలు మూతపడే ప్రమాదం ఏర్పడింది.

ప్రభుత్వం నుంచే నెరవేరని సహకారం:
ప్రభుత్వ అపెక్స్ నిర్ణయాలు, నిర్లక్ష్యమే ఈ దుస్థితికి కారణమని ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాల సంఘం ఆరోపిస్తోంది. ప్రభుత్వం ఇంజనీరింగ్‌, ఫార్మసీ వంటి సాంకేతిక కోర్సులకు ఇస్తున్న ప్రాధాన్యం సాధారణ డిగ్రీ విద్యకు ఇవ్వడం లేదని సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద తమకు దాదాపు రూ. 2,000 కోట్లు రావలసి ఉందని, నిర్వహణా ఖర్చులు భరించలేక, అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేక ఆర్థిక ఇబ్బందులతోనే కాలేజీలను మూసివేయాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అవకాశంగా ‘స్పాట్ అడ్మిషన్లు’:
మిగిలిపోయిన సీట్ల భర్తీకి గురువారం నుంచి స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను ఉన్నత విద్యామండలి ప్రారంభించింది. దోస్త్‌లో సీటు పొందని లేదా ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు నేరుగా తమకు కావలసిన కళాశాలల్లో ప్రవేశాలు పొందేందుకు అవకాశం కల్పించారు. మరి ఈ స్పాట్ అడ్మిషన్ల ద్వారా అయినా ప్రైవేటు కాలేజీలకు గండం గడుస్తుందో లేదో వేచి చూడాలి.