Skip to content
తెలంగాణ వార్తలు

CM Revanth Reddy: కీలెరిగి వాత పెట్టిన రేవంత్..ఎర్రవెల్లి కేసీఆర్ ఫాం హౌస్ కు షిఫ్ట్ అయిన 22A వివాదం..

Krishna Rao 18 Sep 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
CM Revanth Reddy: కీలెరిగి వాత పెట్టిన రేవంత్..ఎర్రవెల్లి కేసీఆర్ ఫాం హౌస్ కు షిఫ్ట్ అయిన 22A వివాదం..

CM Revanth Reddy

CM Revanth Reddy: కీలెరిగి వాత పెట్టడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధహస్తుడయ్యాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే గడచిన కొన్ని నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం చిక్కున పెట్టేలాగా వరుసగా సమస్యలు వస్తూనే ఉన్నాయి.

ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా అంతర్గత విభేదాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చుట్టూ సమస్యల వలయం విస్తరించింది. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని గుక్కతిప్పుకోనివ్వకుండా విమర్శల జడివాన కురిపిస్తోంది.

అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పుల మీద తప్పులు చేస్తూ ముందుకు వెళ్ళింది. కొండా సురేఖ వివాదంతో మొదలైన ఈ రగడ తాజాగా 22A భూముల వివాదంతో మరింత రాజుకుంది.

మరోవైపు ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్, హరీష్ రావు అనుకున్నదే తడవుగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి వరుస పెట్టి ప్రెస్ మీట్‌లు, సోషల్ మీడియాలో పోస్టులు చేయిస్తూ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం వరసగా చేస్తూనే ఉన్నారు.

22A విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందని ప్రకటించడం ప్రభుత్వంలో ఉన్నటువంటి కంగారు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కొండా సురేఖ వివాదంలో ఏం జరిగింది?

దీనికి తోడు కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీగా వస్తున్న అసంతృప్తి కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొండా సురేఖ రూపంలో ఎదురుదెబ్బలు తగిలాయి.

అయితే దీని నుంచి బయట పడేందుకు ఆయన కొండాపైన కఠినమైన వైఖరి వ్యవహరించి అధిష్టానంతో కొండా సురేఖను ఏకంగా బర్తరఫ్ చేయించే వరకు వ్యవహారం వెళ్లింది.

నిజానికి గతంలో రాజశేఖర్ రెడ్డి సైతం ఈ స్థాయిలో సాహసం చేయలేదని చెప్పవచ్చు. ఎందుకంటే అప్పట్లో ఆయన పైన కూడా స్వపక్షంలోనే విపక్షం ఎప్పుడు కాచుకొని ఉండేది.

కానీ ఆయన అన్ని కలుపుకొని ముందుకు వెళ్లారు తప్ప కఠినంగా ముందుకు వెళ్లలేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అధిష్టానం ముందు తన బలాన్ని చూపించుకున్నారో ఏంటో కానీ కొండా సురేఖను బర్తరఫ్ చేసే స్థాయి వరకు వ్యవహారం వెళ్లిపోయింది.

అయితే కొండా సురేఖ బర్తరఫ్ రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ కొండా సురేఖ దంపతులను ఇతర పార్టీల వారు ఎవరు కూడా రానివ్వము అని గేట్లు మూయడంతో వారు తప్పనిసరిగా కాంగ్రెస్‌లోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చేసిన తప్పును కూడా ఒప్పుకొని తొందరపడ్డాము అని కొండా సురేఖ దంపతులు పశ్చాత్తాపం పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఒక రకంగా పైచేయి సాధించారనే చెప్పవచ్చు.

22A వివాదం.. మలుపు ఎక్కడ?

ఇక ఈ 22A వివాదం కొస్తే అటు ప్రజల్లో నుంచి కూడా వ్యతిరేకత రావడంతో దీని నుంచి ప్రభుత్వం ఎలా బయట పడుతుందని అంతా అనుకున్నారు.

అటు అసెంబ్లీ వేదికగా భారత రాష్ట్ర సమితి మొదటి రోజే అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్‌ను ఆ పార్టీ ఎమ్మెల్సీ ఒకరు అనరాని మాటలు అనడంతో మొత్తానికి సభకు రాకుండానే బీఆర్‌ఎస్ మాకు అసెంబ్లీలు నడుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదంతా బాగానే ఉంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 22A విషయంలో ఏం చేయబోతున్నారా అని అంతా అనుకుంటున్న తరుణంలో ఆయన అసెంబ్లీ సాక్షిగా ఆ బాంబును ఏకంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ పైనే గురిపెట్టడం ప్రధాన ప్రతిపక్షానికి ఏం చేయాలో తెలియక పాలుపోని పరిస్థితిలో పడినట్లు చెప్పవచ్చు.

కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై రేవంత్ గురి

ఎందుకంటే ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ గడచిన మూడు సంవత్సరాలుగా అసెంబ్లీలో అడుగు పెట్టడం లేదు. ఏమున్నా కానీ కేటీఆర్, హరీష్ రావు మాత్రమే అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నారు.

తాజాగా కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి తమకు హైదరాబాద్‌లో ఉండటానికి కూడా ఇల్లు లేదని తాను జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఉంటున్నానని, కేసీఆర్ సైతం సొంత ఇల్లు లేక ఫామ్‌హౌస్‌లో ఉంటున్నారని తమ దీన గాధను వెళ్లబుచ్చుకున్నారు.

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ ఫామ్‌హౌస్ విషయంలో మరో 30 రోజుల్లో సంగతి చూస్తానని.. ఆ ఫామ్‌హౌస్ పరిధిలో ప్రభుత్వ భూములు ఉన్నాయని, అసైన్డ్ భూములు ఉన్నాయని బాంబు పేల్చడంతో ఇప్పుడు బీఆర్‌ఎస్ ఆత్మరక్షణలో పడింది అని చెప్పవచ్చు.

కారు పార్టీకే ఎసరు పెట్టిందా?

మొత్తానికి 22A వివాదం చిలికి చిలికి గాలివానై చివరకు కారు పార్టీకే ఎసరు పెట్టిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఒకవైపు 22A భూముల వ్యవహారం.. మరోవైపు కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల అంశం.. ఇంకోవైపు కాంగ్రెస్‌లో అంతర్గత పరిణామాలు.. ఇలా వరుస పరిణామాలు తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.

కీలెరిగి వాత పెట్టడంలో రేవంత్ దిట్ట?

సీఎం రేవంత్ రెడ్డి కీలెరిగి వాత పెట్టడంలో సిద్ధహస్తుడు అని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఈ సందర్భంగా జరుగుతున్న పరిణామాలను చూసి అర్థం చేసుకోవచ్చు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.