Skip to content
తెలంగాణ వార్తలు

Kavitha on Harish: BJP, RSSతో హరీష్ రావు సీక్రెట్ మీటింగ్…రాజపుష్పలో రహస్య కోడ్…? కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణ…

Krishna Rao 28 Aug 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Kavitha on Harish: BJP, RSSతో హరీష్ రావు సీక్రెట్ మీటింగ్…రాజపుష్పలో రహస్య కోడ్…? కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణ…

Kavitha on Harish: BJP, RSSతో హరీష్ రావు సీక్రెట్ మీటింగ్...రాజపుష్పలో రహస్య కోడ్...? కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణ...

Kavitha on Harish: బీజేపీ, RSSతో హరీష్ రావు సీక్రెట్ మీటింగ్ నిర్వహించి బీఆర్ఎస్ కు వెన్నుపోటు పొడిచేందుకు బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు ప్లాన్ సిద్ధం చేసుకున్నారని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆమె ప్రెస్ మీట్ నిర్వహించి హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ, మెదక్ వేదికగా బిఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకునేందుకు హరీష్ రావు కుట్రలు పన్నుతున్నారని, అలాగే హరీష్, సీఎం రేవంత్ ఇద్దరూ లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని ఆమె తీవ్రస్థాయిలో ఎండగట్టారు.

మెదక్ ఎమ్మెల్యేల మీటింగ్ – ఎన్టీఆర్ తరహా వెన్నుపోటు

హరీష్ రావును టార్గెట్ చేస్తూ కవిత ఇలా మాట్లాడారు.. “నిన్న గాక మొన్న మెదక్ జిల్లా ఎమ్మెల్యేలందరితో హరీష్ రావు ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆ మీటింగ్‌లో పాల్గొన్న ఒక ఎమ్మెల్యేనే స్వయంగా ఈ సమాచారాన్ని నాకు చేరవేశారు. ఎన్టీఆర్ లాగే కేసీఆర్ కూడా గొప్ప మనిషే. కానీ ఆయన కొడుకు కేటీఆర్‌కు వారసత్వం నడిపించే సామర్థ్యం లేదు కాబట్టి పార్టీ వారసత్వం దక్కదు. బిఆర్ఎస్ పార్టీ నాకే వస్తుంది. మనం మెదక్‌లో అన్ని సీట్లు గెలుచుకుందాం.. ఆ తర్వాత బిజెపితో అగ్రిమెంట్ పెట్టుకుందాం” అని హరీష్ రావు ఎమ్మెల్యేలకు స్పష్టంగా చెప్పినట్లు కవిత ఆరోపించారు.అలాగే గతంలో ఎన్టీఆర్ కు ఆయన సన్నిహితులలే వెన్నుపోటు పొడిచినట్టు, ఇప్పుడు కేసీఆర్ పేరు ఎత్తి ఆయనకే హరీష్ రావు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమవుతున్నారని దుయ్యబట్టారు.

‘రాజ్ పుష్ప విల్లాస్’ రహస్యం – ఆర్‌ఎస్‌ఎస్ నేతతో పాలు-మిరియాలు..?

హరీష్ రావుపై కవిత మరో సంచలన ఆరోపణ చేశారు. “బిజేపి, ఆర్‌ఎస్‌ఎస్‌లతో హరీష్ రావుకు ఉన్న అంతర్గత ఒప్పందానికి బలమైన ఆధారం నా దగ్గర ఉంది. ‘రాజ్ పుష్ప ఓపెన్ స్కై విల్లాస్’ వేదికగా ఈ రహస్య రాజకీయాలు నడుస్తున్నాయి. అక్కడ ఉన్న ఒక ఇల్లు నుంచి పాలల్లో పసుపు, మిరియాలు కలిపి హరీష్ రావు ఇంటికి పంపుతారు. అది ఒక ‘కోడ్’.

అక్కడికి వచ్చే ఒక ప్రముఖ ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్ద మనిషి రోజంతా ఆ మిరియాలు, పసుపు కలిపిన పాలే తాగుతాడు. ఆ పెద్ద మనిషి ఎవరో ఇంటర్నెట్‌లో వెతికితే ప్రజలకే తెలిసిపోతుంది. ఆ ఆర్‌ఎస్‌ఎస్ నేత వచ్చిన రోజు హరీష్ రావు తన సొంత కార్యక్రమాలన్నీ బంద్ చేసుకుని, ఆ ఇంటికి వెళ్లి పలు దఫాలుగా రహస్య సమావేశాలు నిర్వహించినట్లు పక్కా ఎవిడెన్సులతో ప్రూవ్ చేస్తానని కవిత సవాల్ విసిరారు.

గుంటనక్క వ్యక్తిత్వం – తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నైజం

అలాగే నేను ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీలో లేను. ఆ పార్టీ వెయ్యి ముక్కలైనా, మూడు ముక్కలైనా నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ ‘గుంటనక్క’ లాంటి హరీష్ రావు వ్యక్తిత్వం తెలంగాణ ప్రజలకు తెలియాలి. ఉన్న పార్టీని, ఆశ్రయం ఇచ్చిన ఇంటికే ‘తిన్నింటి వాసాలు లెక్కపెట్టే’ నైజం ఆయనది. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన అవినీతిపరుడి నిజస్వరూపాన్ని ప్రజలకు మళ్లీ గుర్తుచేస్తున్నామని కవిత తీవ్ర విమర్శలు చేశారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు – కేసులలో లాలూచీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే కాళేశ్వరం అవినీతి, ఫోన్ ట్యాపింగ్ కేసుల గురించి మాట్లాడారు. మరి ఇప్పుడు ఆ కేసులు ఏమయ్యాయి? ఎందుకు ముందుకు పోవడం లేదు? కేసులు ఆగిపోయాయంటే ముఖ్యమంత్రి అబద్ధమైనా చెప్పి ఉండాలి, లేదా బిఆర్ఎస్ వాళ్లతో లాలూచీ అయినా పడి ఉండాలి. ఒకవైపు బిఆర్ఎస్‌తో లాలూచీ, మరోవైపు ప్రధాని మోదీని ‘బడే భాయ్’ అంటూ బిజెపితో లాలూచీ పడుతున్నారు.

ఇటీవల లండన్ పర్యటనలో ప్రభుత్వ ధనంతో ముఖ్యమంత్రి, హరీష్ రావుల మధ్య రహస్య సమావేశం జరిగింది. దీనికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ముందుకు తెస్తామని కవిత తెలిపారు.

కృష్ణా జలాల ద్రోహం – ఆంధ్ర ప్రయోజనాలకు పెద్దపీట

కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు రావాల్సిన 70 శాతం వాటాను వదిలేసి, కేవలం 50 శాతం వాటాకు ఒప్పుకుని సంతకాలు పెట్టి రావడం రాష్ట్ర ద్రోహమే.తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకేనా? ఇక్కడి ప్రాజెక్టులను పట్టించుకోకుండా పొలిటికల్ పోస్టులన్నీ ఆంధ్ర ప్రాంతం వాళ్లకే కట్టబెడుతున్నారని కవిత ఆరోపించారు.

ఉద్యమకారులకు అవమానం – రవీంద్రభారతిలో విగ్రహాల రచ్చ
రవీంద్రభారతిలో గద్దర్, అందెశ్రీ లాంటి తెలంగాణ ఉద్యమకారులు, కవుల విగ్రహాలు ఉండాల్సిన చోట ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడంపై తెలంగాణ వాదులంతా బాధపడుతున్నారు.

ఎస్పీబి గొప్ప గాయకుడే కాదనట్లేదు, కానీ తెలంగాణ ప్రాంగణాల్లో ఆంధ్ర ప్రాంత నాయకుల విగ్రహాలు పెట్టి దండలు వేయడం, 100 అడుగుల విగ్రహాలు కడతామని చెప్పడం తెలంగాణ ఉద్యమాన్ని అవమానించడమే. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మీకు కరుగాల్చి వాత పెడతారని కవిత హెచ్చరించారు.

పచ్చి బీసీ వ్యతిరేకి హరీష్ రావు – మాధవరెడ్డి వ్యవహారం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్న మాధవరెడ్డి ఇంటికి హరీష్ రావు స్వయంగా వెళ్లి శాలువాలు కప్పి సన్మానాలు చేస్తున్నారు. గతంలో కార్పొరేటర్ ఎన్నికల్లో బీసీ సంఘాలు, తెలంగాణ రక్షణ సేన, జాగృతి పిలుపునిచ్చిన తర్వాత ప్రజలు మాధవరెడ్డిని ఓడించారు. అలాంటి పచ్చి బీసీ వ్యతిరేకిని హరీష్ రావు ఇంకా పార్టీలో ఎందుకు మోస్తున్నారు? అని ఆమె దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రికి మా డిమాండ్లు ఇవే..
ముఖ్యమంత్రికి లాలూచీ లేకపోతే తక్షణమే హరీష్ రావుపై ఫిట్‌ప్రో (FITPRO) కేసులు పెట్టాలి. బ్రాహ్మణ పరిషత్‌లో ఉన్న ఆంధ్ర చైర్మన్, వైస్ చైర్మన్‌లను, అలాగే యాదాద్రి ఆలయ బోర్డులో ఉన్న ఆంధ్ర సభ్యులను వెంటనే తొలగించాలి. అలా చేయకపోతే రేవంత్ రెడ్డిని తెలంగాణ సీఎం అని కాకుండా “ఆంధ్ర రేవంత్ రెడ్డి, ఆంధ్ర ఏజెంట్” అని పదేపదే పిలవాల్సి వస్తుంది. ఈ లాలూచీ రాజకీయాన్ని ఎండగట్టడానికి తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఆగస్టు 31న నిజామాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని కోరుతున్నామని కవిత విజ్ఞప్తి చేశారు.