Bihar Protest: బీహార్‌లో BPSC అభ్యర్థుల ఆందోళన.. వాటర్ క్యానన్లతో చెదరగొట్టిన పోలీసులు.. సీఎం ఇంటి వైపు దూసుకెళ్లిన విద్యార్థులు..
Bihar protest
Bihar Protest: బీహార్ రాజధాని పాట్నాలో నియామకాలు, పోటీ పరీక్షల నిర్వహణలో జరుగుతున్న ఆలస్యం, అక్రమాలపై విద్యార్థులు చేపట్టిన నిరసన తీవ్ర రూపం దాల్చింది. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) అభ్యర్థులు, ఇతర విద్యార్థులు పెద్ద సంఖ్యలో గాంధీ మైదాన్ నుంచి సచివాలయం వైపు ర్యాలీగా బయలుదేరారు.
పోలీసులు వారిని డాక్ బంగ్లా కూడలి వద్ద అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బారికేడ్లను ఛేదించుకుని ముందుకు వెళ్లేందుకు యత్నించిన నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు వాటర్ కెనాన్లను ప్రయోగించారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు వెనక్కి తగ్గకుండా నీటి ధారల మధ్యే నాట్యం చేస్తూ వినూత్నంగా తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ ఆందోళనలో విద్యార్థులు పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. BPSC-TRE 4 పరీక్షను ఒకే అంచెలో నిర్వహించాలని, 70వ BPSC పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ దానిని తక్షణమే రద్దు చేయాలని కోరారు. అలాగే బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) ద్వారా నియామక ప్రక్రియలను వేగవంతం చేసి, క్రమం తప్పకుండా వార్షిక పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పదేపదే జరుగుతున్న పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, హిందీ మాధ్యమ అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించాలని విద్యార్థి నాయకులు స్పష్టం చేశారు.
ఈ పరిణామాలపై ప్రభుత్వం స్పందిస్తూ, విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. బీహార్ విద్యాశాఖ మంత్రి మిథిలేష్ తివారీ మాట్లాడుతూ, అభ్యర్థులు లేవనెత్తిన మెజారిటీ డిమాండ్లను ప్రభుత్వం ఇప్పటికే నెరవేర్చిందని, మిగిలిన అంశాలపై చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ప్రతి నెలా నాలుగో మంగళవారం విద్యాసంస్థల్లో ‘విద్యార్థి సహయోగ్ శిబిర్’ నిర్వహిస్తామని, విద్యార్థులు తమ సమస్యలను ఆన్‌లైన్ పోర్టల్, హెల్ప్‌లైన్ (1100) ద్వారా నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని ప్రకటించారు. అయితే కేవలం హామీలతో సరిపెట్టకుండా స్పష్టమైన నియామక ప్రక్రియ చేపట్టే వరకు తమ పోరాటం ఆగదని నిరసనకారులు స్పష్టం చేశారు.
- Four Storms Churning at Once: ఒకేసారి నాలుగు తుపాన్లు.. 8 ఏళ్ళ తరువాత పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో అరుదైన వాతావరణ పరిణామం..
- GO 77 Controversy: జీవో నంబర్ 77 వెంటనే రద్దు చేయండి.. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన థియేటర్ యాజమాన్యాలు..
- H1N1 Spread in India: భారత్‌లో స్వైన్‌ఫ్లూ కేసుల పెరుగుదలపై ఆందోళన.. H1N1పై కీలక ప్రకటన జారీ చేసిన ICMR
- Bihar Protest: బీహార్‌లో BPSC అభ్యర్థుల ఆందోళన.. వాటర్ క్యానన్లతో చెదరగొట్టిన పోలీసులు.. సీఎం ఇంటి వైపు దూసుకెళ్లిన విద్యార్థులు..
- Telangana Municipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై కీలక అప్డేట్.. డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం..